విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వాల్మీకి సంఘాలన్నీ కలిసి జేఏసీగా ఏర్పడి స్థానిక అలంకార్ సర్కిల్ లో ధర్నా చౌక్ నందు పదవ రోజు చేస్తున్న సత్యాగ్రహ దీక్షలు, నిరవదిక దీక్షలకు సంఫీుభావం తెలుపుతూ టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి వాల్మీకిలను ఎస్టీ జాబితాలోనికి చేర్చాలని, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కేంద్రంపై తక్షణమే వత్తిడి తీసుకుని రావాలని శాసనసభలో చర్చించి సమస్య పరిష్కారం కొరకు అవసరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం పెద్దలు ఓట్లు కోసమే పార్టీలు అన్నట్టు కాకుండా వాల్మీకుల సమస్యను తక్షణమే పరిష్కరించాలని లేనిచో ఆంధ్రప్రదేశ్‌లోని వాల్మీకులంతా వారి సమస్య తీర్చేవరకు ఉద్యమిస్తారని హెచ్చరించారు. 2017 అప్పటి రాష్ట్ర ప్రభుత్వ వాల్మీకులకు జరిగిన అన్యాయాన్ని సరిచేస్తూ ప్రొఫెసర్ సత్యపాల్ కమిటీని మరియు ఆంధ్రప్రదేశ్ ఎస్సీ అండ్ ఎస్టీ కమిషన్ నివేదికలను రాష్ట్ర మంత్రి మండలిలో తీర్మానించి రాష్ట్ర అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానమును ఆమోదింపజేసి కేంద్రంలో ప్రభుత్వ చర్యలకు కేంద్ర ప్రభుత్వానికి పంపామని తెలిపారు. అయితే ఆ ప్రక్రియ పూర్తి అయితేనే తన కృషికి సార్దకత అని అపుడే బోయలు దాస్యశృంఖలాల నుంచి విముక్తులు అవుతారన్నారు. బోయల చిరకాల వాంఛను అర్థం చేసుకుని వారి న్యాయమైన కోర్కెను తీర్చి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలన్నారు. గాంధీ దేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు గాంధీ నాగరాజన్ పాల్గొని సంఫీుభావం తెలుపుతూ వీరి న్యాయమైన కోర్కెను తీర్చి వీరి భావి తరాల వారిని భవిష్యత్‌ను కల్పించాలన్నారు. ప్రతి వారు ఓటు హక్కును సద్వినియోగ పరుచుకుని న్యాయమైన హక్కులకు పోరాడాలని కోరారు. చిరకాల డిమాండ్ అయిన వాల్మీకి బోయలను గతంలో వలె ఎస్టీ జాబితాలోనికి చేర్చాలని, శాంతియుతంగా చేస్తున్న వీరి ఆవేదనను ప్రభుత్వాలు అర్థం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి సంఘం నాయకులు కూడేరు బ్రహ్మయ్య, ఆదినారాయణ, చొప్పరపు భానుప్రకాష్, ఎం.వెంకటేశ్వర్లు, అంకె లక్ష్మన్న, సుంకు రత్నమ్మ, వెంకటేశ్వర్లు, డి.ప్రతాప్, వాల్మీకి జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ యం.జగదీశ్వరరావు, బొప్ప వరపు భానుప్రకాష్, వాల్మీకి సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News