విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ కర్నాటక గవర్నర్ తవార్ చంద్ గెహ్లాట్ తో భేటీ అయ్యారు. ఆదివారం బెంగుళూరు అధికారిక పర్యటనలో ఉన్న గవర్నర్ ఆ రాష్ట్ర గవర్నర్ తో మర్యాద పూర్వకంగా సమావేశం అయ్యారు. అక్కడి రాజ్ భవన్ లో రాష్ట్ర గవర్నర్ ను సాదరంగా ఆహ్వానించిన తవార్ చంద్ కర్నాటక సాంప్రదాయం మేరకు శాలువా, తలపాగా, జ్ణాపికతో ఘనంగా సత్కరించారు. బిశ్వభూషణ్ హరిచందన్ కూడా వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటంతో కర్నాటక గవర్నర్ ను గౌరవించారు. ఈ సందర్భంగా వీరిరువురూ సమకాలిన రాజకీయ , సామాజిక అంశాలపై చర్చించారు. ఇరు రాష్ట్రాల మధ్య సమీప్యం ఉన్న విభిన్న అంశాలపై వీరు సమాలోచన జరిపారు. కర్నాటకలో తెలుగు వారు గణనీయంగా స్ధిర పడిన నేపధ్యం, ఐటి ఆధారిత ఉపాధి కోసం పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ యువత బెంగుళూరు నివాసితులుగా మారుతున్న పరిస్ధితులు వంటి విషయాలపై ఇరు రాష్ట్రాల గవర్నర్లు సంభాషించారు. కర్నాటక ఒడియా అసోసియేషన్ నేతృత్వంలో సాయంత్రం జరిగిన ప్రత్యేక కార్యక్రమానికి గవర్నర్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఆదివారం అక్కడే బసచేసి సోమవారం మధ్యాహ్నం గవర్నర్ హరిచందన్ విజయవాడ రాజ్ భవన్ కు చేరుకోనున్నారు.
Prajavartha Online Telugu News