గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో రోడ్ల మీదకు, డ్రైన్ల మీద నిర్మాణం చేసిన ర్యాంపులను వెంటనే తొలగించాలని, బహుళ అంతస్తు భవనాల నిర్మాణం సమయంలో డ్రైన్ ను మేజర్ డ్రైన్ లోకి కనెక్ట్ చేసుకోవాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ స్పష్టం చేశారు. గురువారం కమిషనర్ గారు వికాస్ నగర్, గోరంట్ల తదితర ప్రాంతాల్లో ఎన్.ఓ.సి.కి దరఖాస్తు చేసుకున్నభవనాలను లేజర్ మెజరింగ్ మెషిన్ ద్వారా కొలతలను పరిశీలించి పట్టణ ప్రణాళిక అధికారులకు తగు ఆదేశాలు జారి చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మురుగు పారుదలకు అడ్డుగా డ్రైన్లు లేదా రోడ్ల మీదకు నిర్మాణం చేసిన ర్యాంప్లను తొలగించాలని పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. అపార్ట్మెంట్ నుండి డ్రైన్ ను పక్కన ఖాళీ స్థలాల్లోకి వెళ్ళకుండా మేజర్ డ్రైన్ లోకి వెళ్ళేలా డ్రైన్ నిర్మాణం చేసుకోవాలని తెలిపారు. బహుళ అంతస్తు భవనాలు తప్పనిసరిగా నగరపాలక సంస్థ నుండి అనుమతి పొందిన నిర్దేశిత ప్లాన్ ప్రకారం నిర్మాణం చేస్తేనే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ జారి చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. సెట్ బ్యాక్ పోర్షన్ లో, రోడ్ వైడినింగ్ పోర్షన్ లో ఎటువంటి నిర్మాణం చేసినా, నిర్ణీత ఎత్తు మించినా కూడా ఆక్యుపెన్సీ ఇవ్వడం జరగదన్నారు. రెయిన్ వాటర్ హార్వెస్ట్ పిట్ లు నామమాత్రం కాకుండా పక్కాగా పని చేసేలా కనెక్షన్ చేయాలని, సచివాలయ కార్యదర్శులు పక్కగా తనిఖీ చేయాలని ఆదేశించారు. అనుమతి పొందిన ప్లాన్ ప్రకారం గ్రీనరికి కేటాయింపు ఉండాలన్నారు. అనంతరం ప్రజారోగ్య అధికారులు, శానిటేషన్ కార్యదర్శులతో మాట్లాడుతూ మైక్రో ప్యాకెట్ల వారీగా ఇంటింటి చెత్త సేకరణ నూరు శాతం జరగాలని, మధ్యాహ్నం గ్యాంగ్ వర్క్ ద్వారా సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుధ్య పనులు చేపట్టాలన్నారు. రోడ్ల మీద, కాల్వల్లో వ్యర్ధాలు వేసే వారిని గుర్తించి అపరాధ రుసుం విధించడం, షాప్స్ ని సీజ్ చేయాలని స్పష్టం చేశారు. పర్యటనలో సిటి ప్లానర్ మూర్తి, డి.సి.పి. కోటయ్య, ఏ.సి.పి. అజయ్ కుమార్, టి.పి.ఎస్.లు, శానిటరీ ఇన్సెపెక్టర్లు సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News