-ప్రభుత్వ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
భట్రాజుల ఆత్మ కాపాడేందుకు వైసీపీ ప్రభుత్వం కృషి చేస్తుందని అసెంబ్లీ కోఆర్డినేటర్, విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భట్రాజు సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పాలగిరి చంద్రకళ ఆయనను శుక్రవారం కలిసి ఓ వినతి పత్రం సమర్పించిన మేరకు ఆయన స్పందించారు. భట్రాజు పొగడ్తలు అంటూ కులాన్ని కించపర్చే విధంగా బహిరంగ వ్యాఖ్యలు చేయడం ద్వారా భట్రాజులందరి మనోభావాలు దెబ్బతుంటున్నాయని చంద్రకళ అభ్యర్థన మేరకు తాను సీఎం దృష్టికి తీసుకెళ్లి రజకులకు, నాయీబ్రాహ్మణులకు ఇచ్చిన విధంగానే తమ ప్రభుత్వం భట్రాజు కులానికి కూడా వర్తించేలా ఓ జీవో తీసుకొస్తామని హామీ ఇచ్చారు. భట్రాజు పొగడ్తలు అనే పదాన్ని నిషేధిస్తూ ఇటువంటి వ్యాఖ్యలు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే విధంగా తమకు రక్షణ కల్పించాలని యావత్ భట్రాజు జాతి తరపున కోరుకుంటున్నామని ఆమె సమర్పించిన వినతి పత్రంలో పేర్కొన్నారు. “భట్రాజు” అనగా గురువు, పూజ్యుడు, ఆచార్యుడు అని అర్థం అని విరించారు. తమ ప్రధాన కులవృత్తి ఉపాధ్యాయ వృత్తి అని, విద్యను బోధించిడమే కులవృత్తిగా ఉన్నందున మమ్మల్ని “విద్వత్ కులం” అని పూర్వకాలం నుంచి తమకు ఒక గౌరవప్రదమైన స్థానం ఉందని పేర్కొన్నారు. “భట్టు దీవెన.. బ్రహ్మ దీవెన” అంటూ ఇప్పటికీ మా చేత అక్షరాభ్యాసం చేయిస్తూ దీవెనలు అందుకుంటున్నారు. తమలో కవులు, కళాకారులు, శత, సహస్ర అవధానులు, ఘనపాటీలు గా ఉన్నారన్నారు. శ్రీకృష్ణదేవరాయ ఆస్థాన కవి రామరాజభూషణుడు (భట్టుమూర్తి) నుంచి నేటి “పుట్టపర్తి సాయిబాబా” వరకు ఎందరో మహానుభావులు పుట్టిన కులం తమదని అటువంటి ఉన్నతమైన కులస్తులమైన మమ్మల్ని సినిమాల్లో, టీవీ సీరియల్ లో, పోటీ పరీక్ష మెటీరియల్స్ లో, సోషల్ మీడియాలో, రాజకీయ నాయకులు, సమాజంలో ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు మరియు ఇతరులు “భట్రాజు పొగడ్తలు” మరియు “ఆశ్రితులు”(యాచకులు) అంటూ వారి ఉపమాన, ఉపమేయాలకు తమ కులాన్ని ఉదాహరణగా వాడుతూ మా మనోభావాలను కించపరుస్తూ కుల దూషణకు పాల్పడి అవమానిస్తున్నారు. దీనితో మా కులస్తులు అవమానాలు ఎదుర్కొంటూ తీవ్రమైన మనోవేదనకు గురి అవుతున్నారు. అందువల్ల ప్రభుత్వము “భట్రాజు పొగడ్తలు” మాటలను నిషేధిస్తూ ఇటువంటి వ్యాఖ్యలు చేసే వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకునే విధంగా తమకు రక్షణ కల్పించాలని యావత్ భట్రాజు జాతి తరపున కోరుకుంటున్నామని పాలగిరి చంద్రకళ ప్రభుత్వ శ్రీకాంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా మహిళా అధ్యక్షురాలు పాలగిరి హరిత తదితర నాయకులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News