విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దిష్టిబొమ్మల దగ్ధంలో వైసీపీకి న్యాయం ,జనసేన నాయకులకు అన్యాయమా అని జనసేన విజయవాడ నగర అధికార ప్రతినిధి, మైనార్టీ నాయకులు షేక్ గయాజుద్దీన్ (ఐజా) పోలీసుల పక్షపాత వైఖరిని తీవ్రంగా ఖండించారు. శుక్రవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మను వైసీపీ వారు దగ్ధం చేశారని, దానికి ప్రతిగా సీఎం జగన్ రెడ్డి దిష్టిబొమ్మను జనసేన నాయకులు దగ్ధం చేయడం జరిగిందని చెప్పారు. అయితే వైసిపి వారిని ఏమి చేయని పోలీసులు జనసేన నాయకులను అక్రమంగా అరెస్టు చేసి వారిని రిమాండ్కు పంపాలనే ఉద్దేశంతో కోర్టులో ప్రవేశపెట్టారని, అయితే న్యాయమూర్తి వారి రిమాండ్ ను తిరస్కరించి 41 ఎ నోటీసులు ఇవ్వాలని చెప్పి పంపించడం పోలీసుల పక్షపాత ధోరణికి నిలువెత్తు నిదర్శనమని ఐజా ధ్వజమె త్తారు. ఇటువంటి పక్షపాత ధోరణిలను పోలీసు వారు విడనాడాలని ఆయన డిమాండ్ చేశారు . జనసేనాని పవన్ కళ్యాణ్ పై వైసీపీ వారు కారు కూతలు కూస్తే పోలీసుల్లో ఏమాత్రం చలనం లేదని అన్నారు. అయితే వైసీపీ అరాచకాలపై ప్రశ్నించిన జనసేన నాయకులను మాత్రం నిర్బంధించడం ఏ రకమైన ప్రజాస్వామ్యమని ఐజా ప్రశ్నించారు. ఇటువంటి పక్షపాత ధోరణులకు పోలీస్ వారు స్వస్తి చెప్పాలని అన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలియజేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందని, రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను కాపాడాల్సిన పోలీసులు వైసీపీ నాయకులకు కొమ్ముకాస్తూ ప్రతిపక్ష నాయకులను వేధించడం సబబు కాదని అన్నారు.
Prajavartha Online Telugu News