Breaking News

గ్రామ వార్డు సచివాలయాలు,రైతు భరోసా కేంద్రాలు ముఖ్యమంత్రి మానస పుత్రికలు..

-రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వంపెద్ద పీట….
-రైతులకు అధికారులకు అభినాభవ సంబంధం ఏర్పాటు చేయాలన్నదే వ్యవసాయ మిషన్ ముఖ్య ఉద్దేశం..
-శాస్త్రవేత్తల సలహాలు పాటించాలి…
-అధికారులు క్షేత్ర పర్యటనలు చేయాలి…
-రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రైతులు పండించిన పంటలకు మార్కెట్ సౌకర్యం కల్పించి కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయటం ద్వారా రైతు సంక్షేమ ధ్యేయంగా వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎం వి ఎస్ నాగిరెడ్డి అన్నారు.
నగరంలోని స్థానిక పింగళి వెంకయ్య స్పందన సమావేశ మందిరంలో శుక్రవారం రాష్ట్ర వ్యవసాయ మిషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వ్యవసాయ అనుబంధ రంగాల భాగస్వామ్య పక్షాల ముఖాముఖి చర్చ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంవీఎస్ నాగిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో రైతుల కష్టాలను సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించారు కాబట్టే రైతు సంక్షేమానికి పెద్దపీట వేశారన్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల దురదృష్టవశాత్తు రైతులు నష్టపోతున్నారని అన్నారు. .రైతుల సమస్యలను తెలుసుకునేందుకు అధికారులు తరచూ క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలన్నారు.ముఖ్యమంత్రి ఎల్లప్పుడూ రైతుల అభివృద్ధి సంక్షేమం గురించే ఆలోచిస్తారని, నవరత్నాల్లో అందించే ఆర్థిక సహాయం ఎక్కువగా సన్నకారు రైతులు రైతు కూలీలకే లాభం కలుగుతుందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం రైతుల సమస్యలు తెలుసుకునేందుకు ముఖాముఖి కార్యక్రమాలు ప్రతి జిల్లాలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రైతు కుటుంబాలకు పథకాల ద్వారా అందించే సొమ్మును వారి ఆర్థిక అవసరాలకు ఉపయోగించుకోవాలన్నారు. వ్యవసాయం ఎక్కువగా ప్రకృతి పైనే ఆధారపడి ఉంటుందని అందుకనే వాతావరణ పరిస్థితులు భూసారం అనుసరించి లాభదాయకమైన పంటలనే వేయాలని రైతులకు సూచించారు. శాస్త్రజ్ఞుల సలహాలను పాటిస్తూ విత్తనాలు ఎరువులు వాడాలన్నారు. రైతులు మోసం ఎరుగని వారని వారికి అధికారులు తమ పూర్తి సహాయ సహకారాలు అందించాలన్నారు. వరి, మిర్చి, చెరకు, పసుపు, ప్రతి వంటి పంటలనే కాకుండా అనుబంధ రంగాలైన పశుపోషణ, కోళ్ళ పెంపకం, తృణధాన్యాలు, కూరగాయలు, పూల తోటల పెంపకం, ద్వారా స్వయం సమృద్ధి సాధించాలన్నారు. రైతులకు ప్రభుత్వం కల్పిస్తున్న రుణాలు సబ్సిడీలు యంత్ర పరికరాలు సరఫరా మొదలైన వాటిపై పూర్తి అవగాహన కలిగించుకోవాలన్నారు. స్వాతంత్రం వచ్చాక 1950 సంవత్సరంలో ఉన్న 35 కోట్ల జనాభాకు 35 మిలియన్ మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి జరిగేదని, ప్రస్తుతం దేశంలో ఉన్న 140 కోట్ల జనాభాకు 300 మిలియన్ మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి చేసే స్థాయికి చేరుకున్నామన్నారు. కోవిడ్ కష్టకాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాల వల్ల రైతుల సమస్యలను అధిగమించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, రైతు అభివృద్ధి పథకాలు,సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు మొదలైన సంక్షేమ పథకాల ఏర్పాటుపట్ల దేశం మొత్తం మన రాష్ట్రం వైపు ఆసక్తి కనబరుస్తున్నాయన్నారు. మన రాష్ట్రంలో నెలకొల్పిన రైతు భరోసా కేంద్రాల నిర్వహణను తమిళనాడు, కేరళ రాష్ట్రాల మంత్రుల సైతం స్వయంగా వచ్చి పరిశీలిస్తున్నారన్నారు. ఈ క్రాప్, ఈ కేవైసీ విధానాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు ఆసక్తి కనపరుస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా వ్యవసాయ కమిషన్ వైస్ చైర్మన్ ఎంబిఎస్ నాగిరెడ్డి ప్రస్తావించారు.
జిల్లా కలెక్టర్ యస్ ఢిల్లీ రావు మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో ఎంతో అనుభవం ఉన్న వ్యవసాయం మిషన్ వైస్ చైర్మన్ అన్ని జిల్లాలలోనూ పర్యటిస్తూ రైతుల సమస్యలను తెలుసుకొని వాటికి పరిష్కార మార్గం చూపేందుకు సమావేశ ఏర్పాటు చేయడం పట్ల సంతోషదాయకమన్నారు. ధాన్యం కొనుగోలు సమయంలో రైతుకు కనీస మద్దతు ధర లభించేలా తేమ శాతంపై అవగాహన కల్పించాలనన్నారు. ధాన్యం కొనుగోలు సమయంలో తూకంలో తప్పులు లేకుండా చూడాలని సకాలంలో రైతుకు చెల్లింపులు జరపాలన్నారు. గన్ని బ్యాగులు ,హమాలీ, రవాణాపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. వరిలో ఆశించేపొడ తెగులు, మిర్చిలో ఆశించే బ్లాక్ స్ట్రిప్ తెగుళ్లు పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని శాస్త్రవేత్తలు దీనిపై అవగాహన కల్పించాలన్నారు. ఇప్పటికే ఎలుకల నివారణకు నివారణ మందులను రైతులకు అందజేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా, పిఎం కిసాన్ , పంటల బీమాపై అధికారులు అవగాహన కల్పించి వాటిని సద్వినియోగం చేసుకునేలా చూడాలని కలెక్టర్ ఢిల్లీ రావు అన్నారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్. నుపూర్ అజయ్, జిల్లా వ్యవసాయ మండలి చైర్ పర్సన్ డి. దామోదర్ రెడ్డి, డిసిసిబి చైర్మెన్ తన్నీరు నాగేశ్వరరావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎం. విజయభారతి, హార్టికల్చర్ అధికారి పి. బాలాజీ కుమార్, మత్స్యశాఖ జిల్లా అధికారి ఏ నాగరాజా, మార్క్ఫెడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ కె.నాగమల్లిక, ఇతర అధికారులు, శాస్త్రవేత్తలు, రైతులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అవుట్‌ఫాల్ డ్రెయిన్ల డీసిల్టింగ్ పనులను పరిశీలించిన కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *