– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మల్లాది విష్ణు
-60 వ వార్డు 264 వ వార్డు సచివాలయ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆకాంక్ష అని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. శనివారం 60 వ డివిజన్ 264 వ వార్డు సచివాలయం పరిధి A-బ్లాక్ అపార్ట్ మెంట్లలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో డివిజన్ ఇంఛార్జి బెవర నారాయణ, కోఆర్డినేటర్ బత్తుల దుర్గారావులతో కలిసి ఆయన పాల్గొన్నారు. 256 గడపలను సందర్శించి ప్రజల నుంచి గ్రీవెన్స్ స్వీకరించారు. సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. గత పాలకులు మాటలతో కాలయాపన చేశారని.. కానీ వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 98.4 శాతం ఎన్నికల హామీలను అమలు చేసినట్లు మల్లాది విష్ణు తెలిపారు. ఏ పథకం ఎప్పుడు వస్తుందనేది ముందుగానే క్యాలెండర్ ప్రకటించి.. అవినీతి, వివక్షకు తావు లేకుండా సంక్షేమాన్ని అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కాలనీవాసులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అపార్ట్ మెంట్ వాసులు అసోసియేషన్ గా ఏర్పడాలని.. క్రమం తప్పకుండా నెలకోసారి సమావేశం నిర్వహించుకోవాలని సూచించారు. దీని ద్వారా సమస్యల పరిష్కారం సులభతరం అవుతుందన్నారు. టీడీపీ హయాంలో టిడ్కో అప్లికేషన్ కోసం రూ. 30 వేలు నుంచి అత్యధికంగా రూ. లక్ష వరకు చెల్లించినట్లు పలువురు బాధితులు ఎమ్మెల్యే మల్లాది విష్ణు వద్ద తమ ఆవేదనను వెలిబుచ్చారు. కానీ వైఎస్సార్ సీపీ ప్రభుత్వం తమకు అన్నివిధాలా అండగా నిలిచిందని సంతోషం వ్యక్తం చేశారు.
సచివాలయ పరిధిలో రూ. 4.45 కోట్ల సంక్షేమం
264 వ వార్డు సచివాలయ పరిధిలో మూడేళ్లలో రూ. 4.45 కోట్ల సంక్షేమాన్ని అందజేసినట్లు మల్లాది విష్ణు వెల్లడించారు. వైఎస్సార్ పింఛన్ కానుక ద్వారా 413 మందికి ప్రతినెలా క్రమం తప్పకుండా ఇంటివద్దకే పింఛన్ అందజేస్తున్నట్లు తెలిపారు. అమ్మఒడి ద్వారా 387 మందికి రూ. 54.18 లక్షలు., విద్యాదీవెన మరియు వసతి దీవెన ద్వారా 112 మందికి రూ. 12.31 లక్షలు., చేయూత ద్వారా 92 మందికి రూ. 17.25 లక్షలు., కాపునేస్తం ద్వారా 26 మందికి రూ. 3.90 లక్షలు., జగనన్న తోడు ద్వారా 25 మందికి రూ. 2.50 లక్షలు., వాహనమిత్ర ద్వారా 31 మందికి రూ. 3.10 లక్షల ఆర్థిక సాయాన్ని ఒక్క ఏడాదిలోనే అందించినట్లు వివరించారు. అలాగే డివిజన్లో 36 మందికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ. 14.23 లక్షల లబ్ధి చేకూర్చినట్లు తెలిపారు. మరోవైపు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్న 43 వార్డు సచివాలయాల పరిధిలో.. 47 అభివృద్ధి పనులకు గానూ రూ. 7.38 కోట్లు మంజూరైనట్లు మల్లాది విష్ణు వెల్లడించారు. త్వరలోనే టెండర్లను పిలిచి పనులు ప్రారంభిస్తామని తెలియజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
బీజేపీ నేతలకు మతిభ్రమించింది
రాష్ట్రంలోని భారతీయ జనతా పార్టీ నేతలకు మతిభ్రమించిందని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. అత్యంత పారదర్శకంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న కార్యక్రమాలపై కూడా విమర్శలు గుప్పించడం సిగ్గుచేటన్నారు. డీబీటీ విధానంపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వస్తుంటే.. బీజేపీ నేతలు అవినీతి ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ ను అవినీతికి కేరాఫ్ గా మార్చిన టీడీపీతో కలసి అధికారాన్ని పంచుకున్న మీరా.. మాపై విమర్శలు గుప్పించేదని ధ్వజమెత్తారు. అమరావతిలో పెద్దఎత్తున భూకుంభకోణం జరిగిందని.. ఈ వ్యవహారంపై సీబీఐ ఎంక్వైరీ జరపాలని కేంద్రాన్ని కోరితే ఇప్పటివరకు స్పందించలేదన్నారు. దీనికి బీజేపీ నేతలు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. సోము వీర్రాజు మాటలను సొంత పార్టీ నేతలే విశ్వసించే పరిస్థితి లేదని.. కన్నా లక్ష్మీనారాయణ మాటలే ఇందుకు ఉదాహరణగా చెప్పుకొచ్చారు. కనుక సోము వీర్రాజు, కిరిటీ సోమయ్య విజ్ఞతతో మాట్లాడాలని సూచించారు. టీడీపీ, జనసేన కలయికతో ఒరిగేదేమీ ఉండదని.. 2014 లో మూడు పార్టీలు కలిసినప్పడే వైఎస్సార్ సీపీకి 44.60 శాతం ఓట్లు వచ్చాయన్నారు. కనుక బీజేపీ నేతలు వ్యక్తిగత అజెండాతో పనిచేయడం మానుకోవాలని.. లేకుంటే ప్రజలే తగిన రీతిలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. అనంతరం స్థానికులతో కలిసి మొక్కలను నాటారు. కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, డీఈ గురునాథం, ఏఈ అరుణ్ కుమార్, ఏఎంఓహెచ్ రామకోటేశ్వరరావు, నాయకులు ఇస్మాయిల్, బాబు, ఫాతిమా, కుమారి, నాని, హనుమంతు దుర్గారావు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News