-డా. బి.ఆర్ అంబేద్కర్ జయంతి నాటికి పనులను పూర్తి చేస్తాం..
-రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భావితరాల వారికి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాలు తెలియజేసి వారిని స్మరించుకునే విధంగా అంబేద్కర్ విగ్రహాం స్మృతి వనం ఏర్పాటు చేయనున్నట్లు విగ్రహ నిర్మాణ కమిటీ చైర్మన్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున తెలిపారు.
విజయవాడ స్వరాజ్ మైదానంలో 285 కోట్ల రూపాయల ఖర్చుతో ఏర్పాటు చేయనున్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం స్మృతి వనం నిర్మాణ పనులను బుధవారం విగ్రహ నిర్మాణ కమిటీ చైర్మన్ రాష్ట్ర సాంఫీుక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేని విధంగా విజయవాడ నగరం నడిబొడ్డున దళిత భాందవ్యులు భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్ అంబేద్కర్ 125 అడుగు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచన రావాడాన్ని అదృష్టంగా భావిస్తున్నామన్నారు. నిర్మాణ పనులలో ఆలసత్వం లేకుండా ముఖ్యమంత్రి ఆలోచన విధానానికి అనుగుణంగా పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. తొలుత 100 కోట్ల రూపాయల అంచనాతో డా. బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ స్మృతి వనం నిర్మాణాన్ని చేపట్టడం జరిగిందన్నారు. ప్రస్తుతం 285 కోట్ల రూపాయల ఖర్చుతో అత్యంత సుందరంగా స్మృతి వనాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 14వ తేది నాటికి పనులను పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్దం చేయనున్నామన్నారు. తరతరాల ప్రజలకు డా. బి.ఆర్ అంబేద్కర్ జీవిత విశేషాలను తెలియజేసి ఆ మహాత్ముడుని స్మరించుకునేలా చేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం అన్నారు. గత ప్రభుత్వం దళితులకు ఇచ్చిన మాటలను ఎన్నడు నిలబెట్టుకోలేదన్నారు. డా. బిఆర్ అంబేద్కర్‌ను అగౌరపరిచే విధంగా ముల్లచెట్ల మధ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారన్నారు. విగ్రహ ఏర్పాటుకు ఎటువంటి చర్యలు తీసుకోలేకపోయారని ఇది దళిత జాతిని అగౌరపరిచినట్లేనన్నారు. ముఖ్యమంత్రి ఏ ఒక్కరూ కోరకుండానే దేశంలోనే ఒక అత్యున్నతమైన స్మృతి వనాన్ని ఏర్పాటు చేయాలని ఆలోచించి ఆచరణలో పెట్టడంతోపాటు ఎంత ఖర్చు అయిన వెనకాడకుండా పనులను పూర్తి చేయాలని ఆదేశించడం దళిత జాతి గర్వించతగ్గ విషయమన్నారు. స్వరాజ్ మైదానంలో జలవనరుల శాఖకు సంబంధించిన క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్‌ను తొలగించే ప్రక్రియను చేపట్టి వారం రోజులో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు పరిశీలించి పనులను మరింత వేగవంతం చేసి నిర్థేశించిన గడువులోపు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగిందని మంత్రి వివరించారు.
డా.బి.ఆర్ అంబేద్కర్ స్మృతి వనం పనుల పరిశీలనలో మంత్రి వెంట సాంఘిక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జి. జయలక్ష్మి, డైరెక్టర్ కె. హర్షవర్థన్, జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు, మున్సిపల్ కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుడ్కర్, జలవనరుల శాఖ ఛీఫ్ ఇంజనీర్ ఎన్ పుల్లరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జి. గోపాల్, ఏపిఐఐసి ఇంజనీర్ ఇన్ ఛీప్ శ్రీనివాస్ ప్రసాద్, డిప్యూటి జోనల్ మేనేజర్ రహీమ్, కెసిపి ప్రాజెక్టు డైరెక్టర్ పి.వాసుదేవరావు, ప్రాజెక్టు మేనేజర్లు కె. కృష్ణమోహన్, జవీద్ తదితరులు ఉన్నారు.
Prajavartha Online Telugu News