– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మల్లాది విష్ణు
-24వ డివిజన్ 92 వ వార్డు సచివాలయం పరిధిలో మూడో రోజు గడప గడపకు మన ప్రభుత్వం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడున్నరేళ్ల పాలనలో ప్రతి ఇంటా సంక్షేమం వెల్లివిరుస్తోందని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. శుక్రవారం 24 వ డివిజన్ 92 వ వార్డు సచివాలయం పరిధిలో స్థానిక కార్పొరేటర్ కుక్కల అనిత రమేష్ తో కలిసి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. కొండపల్లి వారి వీధి, కాజా యలమంద వీధి, కాజా ముసలయ్య వీధి, వేముల శ్యామలాదేవి రోడ్డులలో విస్తృతంగా పర్యటించి.. 226 గడపలను సందర్శించారు. మూడేళ్ల పాలనలో అందించిన సంక్షేమ ఫలాలు ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగారు. పలువురు చిరువ్యాపారులు, వాకర్స్ తో ముచ్చటించారు. నియోజకవర్గంలో ఎక్కడకు వెళ్లినా, ఏ పేద కుటుంబం తలుపుతట్టినా.. సంక్షేమ పథకాలు అందుతున్నాయనే చెబుతున్నారని మల్లాది విష్ణు తెలిపారు. పథకాల అమలులో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి గ్రీవెన్స్ స్వీకరించారు. వీధులలో ఎక్కడా కూడా వర్షపు నీరు నిలిచిపోకుండా.. స్ట్రామ్ డ్రెయిన్ల నిర్మాణం ద్వారా మళ్లించాలని ఇంజనీరింగ్ సిబ్బందికి సూచించారు. అలాగే కొండపల్లి వీధి, కాజా యలమంద వీధి, కాజా ముసలయ్య వీధులలో యూజీడీ రీప్లేస్ మెంట్ కి అంచనాలు సిద్ధం చేయవలసిందిగా ఆదేశించారు. మరోవైపు గిరిపురంవాసులు ఎంతోకాలంగా ఎదుర్కొంటున్న ఇళ్ల రిజిస్ట్రేషన్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు.. సంక్రాంతి నాటికల్లా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతులమీదుగా రెగ్యులరైజ్డ్ పట్టాలు అందజేస్తామని హామీనిచ్చారు.
వసతి గృహంలో మౌలిక వసతుల పరిశీలన
పర్యటనలో భాగంగా కస్తూరిభాయిపేటలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహాన్ని మల్లాది విష్ణు సందర్శించారు. నందిగామ, కంచికచర్ల, తిరువూరు, లింగాలపాలెం సహా వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థినులతో మాట్లాడి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు., మౌలిక వసతులపై ఆరా తీశారు. వంటశాలను, భోజనశాలను పరిశీలించారు. మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందుతుందా..? లేదా..? అని చిన్నారులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. మరుగుదొడ్లను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు. మేనమామగా చిన్నారుల బంగారు భవిష్యత్ కోసం అమ్మఒడి, గోరుముద్ద, విద్యాకానుక, ఇంగ్లీష్ మీడియం, సీబీఎస్ఈ సిలబస్.. ఇలా చేయగలిగినంతా సీఎం వైఎస్ జగన్ చేస్తున్నారని మల్లాది విష్ణు తెలిపారు. జగన్ మామ అందిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకొని విద్యార్థులు చదువులో ఉన్నతంగా రాణించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా “థ్యాంక్యూ జగన్ మామ” అంటూ చిన్నారులు చేసిన నినాదాలతో ఆ ప్రాంతమంతా మారుమ్రోగింది. అనంతరం మీడియాతో మాట్లాడారు.
చంద్రబాబుది అవినీతి, రాక్షస పాలన
చంద్రబాబు తన పాలనలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి రాక్షస పాలన సాగించారని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మల్లాది విష్ణు ఆరోపించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై చంద్రబాబు చేసిన ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు. నిజానికి రాక్షస పాలన చేసింది చంద్రబాబు, ఆయన కుమారుడు నారాలోకేష్ లేనంటూ ధ్వజమెత్తారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం, శాసనసభలో ప్రతిపక్షం గొంతునొక్కి నిరంకుశంగా వ్యవహరించారన్నారు. కానీ వైఎస్సార్ సీపీ ప్రతిపక్షంగా ఆనాడు నిర్మాణాత్మక పాత్ర పోషించిందని.. కానీ నేడు తెలుగుదేశం బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. చంద్రబాబు పాలన అంతా భ్రమరావతి చుట్టూ, కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాయడానికే పరిమితమైందన్నారు. కానీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని తెలియజేశారు. మూడు ప్రాంతాల అభివృద్ధి జరగాలంటే పరిపాలన వికేంద్రీకరణతోనే సాధ్యమని నమ్మి.. ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు పేర్కొన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలో ప్రజలకు మేలు చేసిన నాయకుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొదటి స్థానంలో నిలుస్తారని ఈ సందర్భంగా తెలిపారు. మరోవైపు ఆక్రమణదారులు, ఫోర్జరీలు చేసేవారికి చంద్రబాబు కొమ్ముకాయడం సిగ్గుచేటని మల్లాది విష్ణు అన్నారు. అవినీతిపరులకు వత్తాసు పలుకుతూ కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక అవార్డులు అందుకున్న పోలీస్ శాఖను బెదిరించే ప్రయత్నం చేయడం సరికాదన్నారు. చంద్రబాబు తాటాకు చప్పుళ్లకు భయపడేవారు ఎవరూ లేరన్న విషయాన్ని గ్రహించాలన్నారు. ఇప్పటివరకు చూసింది కేవలం ట్రైలరేనని.. చూడవలసిన అసలైన సినిమా ముందుందని తెలిపారు. అనంతరం మూడు రోజుల పర్యటనలో తనపై చూపిన ప్రేమానురాగాలకు డివిజన్ ప్రజలకు పేరుపేరున కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, జోనల్ కమిషనర్(ఇంఛార్జి) అంబేద్కర్, డీఈ(ఇంజనీరింగ్) గురునాథం, ఏఎంఓహెచ్ రామకోటేశ్వరరావు, నాయకులు కొమ్ము చంటి, బెల్లపు సత్యనారాయణ, బెల్లపు వెంకట్రావు, ఓబిరెడ్డి వెంకట్రామిరెడ్డి, బొంగరాల భాస్కర్ రావు, క్రాంతి, మోహన్ రావు, సచివాలయ సిబ్బంది, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News