-ఇన్నర్‌వీల్ క్లబ్ వ్యవస్థాపకురాలు మార్గరెట్ ఆలివర్ గోల్డింగ్ విగ్రహం ఏర్పాటు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఒక సాధారణ నర్సుగా జీవితం ప్రారంభించిన మార్గరెట్ ఆలివర్ గోల్డింగ్ మనసులో నుంచి పుట్టిన స్నేహం, సేవాభావమే నేడు ఇన్నర్‌వీల్ మహిళా క్లబ్‌గా రూపాంతరం చెందిందని అంతర్జాతీయ ఇన్నర్‌వీల్ ప్రెసిడెంట్ జెనైడా ఫాల్కన్ అన్నారు. మార్గరేట్ ఆలివర్ గోల్డింగ్ సేవలకు గుర్తుగా మరికొందరికి స్ఫూర్తిదాయకంగా నిలిచేందుకు ఇన్నర్‌వీల్ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్‌టౌన్ ఆధ్వర్యంలో పాత ప్రభుత్వాసుపత్రి ఆవరణలో బుధవారం మార్గరేట్ విగ్రహాన్ని ప్రతిష్టించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జెనైడా ఫాల్కన్ మాట్లాడుతూ.. మరో రెండేళ్ళల్లో శత వసంతాలు పూర్తి చేసుకోనున్న ఇన్నర్‌వీల్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రపంచంలోని తొలిసారిగా మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ నగరంలో మార్గరేట్ విగ్రహం ఏర్పాటు చేయడం వల్ల నగరానికి అంతర్జాతీయ స్థాయిలో పేరుప్రతిష్టలు పెంపొందుతాయని తెలిపారు. ప్రస్తుతం ఇన్నర్‌వీల్ క్లబ్‌లకు సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా 100 దేశాల్లో నాలుగు వేల క్లబ్‌లు ఉన్నాయని తెలిపారు. పాత ప్రభుత్వాసుపత్రిలో మార్గరెట్ విగ్రహం ఏర్పాటు చేసిన ప్రాంతంలోనే చిన్నారుల కోసం ఆట స్థలంతో కూడిన ఉద్యానవనాన్ని కూడా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ఎంతో వ్యయప్రయాసలకోర్చి మార్గరేట్ విగ్రహాన్ని నెలకొల్పిన ఇన్నర్‌వీల్ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్‌టౌన్ అధ్యక్షురాలు కరంబీర్ కౌర్‌ను జెనైడా ఫాల్కన్ అభినందించారు. కార్యక్రమంలో ఇన్నర్‌వీల్ ఇంటర్నేషనల్ ట్రెజరర్ సరితా లునాని, అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ సుర్జిత్ కౌర్, డిస్ట్రిక్ట్ చైర్మన్ సీతాదేవి, క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News