-మాదక ద్రవ్యాలకు బానిసలైన వారిలో మార్పు తెచ్చేందుకు యువత కృషి చేయాలి…
-జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సమాజాన్ని పట్టిపీడిస్తున్న మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టాల్సిన భాధ్యత నేటి యువతరం పై ఉందని, మాదక ద్రవ్యాలకు బానిసలైన వారిలో మార్పు తీసుకువచ్చేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు విద్యార్థులకు సూచించారు.
మాదక ద్రవ్యాల నివారణ అవశ్యకతపై నగరంలోని ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ కళాశాలలో ఇండియన్ రెడ్‌క్రాస్ సోసైటీ, రెడ్ రిబ్బన్ క్లబ్, ఎన్ఎస్ఎస్ యూనిట్ల ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన అవగాహన సదస్సుకు జిల్లా కలెక్టర్ డిల్లీరావు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ డ్రగ్స్ వినియోగం వలన విద్యార్థులు జీవితంలో సాధించాలనుకున్న లక్ష్యాలను కోల్పోతారన్నారు. మాదకద్రవ్యాల వినియోగం పై ప్రభుత్వం కఠినమైన చట్టాలను చేయడం జరిగిందన్నారు. అయినప్పటికి యువత చెడు మార్గలవలన మాదకద్రవ్యాల వినియోగానికి ఆకర్షితులు అవుతున్నారన్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు దైనందిక జీవితంలో పని ఒత్తిడి వలన పిల్లలపై పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చూపలేకపోవడం ప్రధాన కారణం అన్నారు. పిల్లల మానసిక శారీరక ప్రవర్తనను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనిస్తూ తప్పుదోవపడుతున్నట్లు గమనిస్తే వెంటనే వారిని సన్మార్గంలో నడిపించగలిగితే పిల్లలకు మంచి భవిష్యత్ అందించిన వారవుతారన్నారు. మాదక ద్రవ్యాల వినియోగంచే వారి మెదడుపై వాటి ప్రభావం పడి నియంత్రణ లేక విచక్షణను కోల్పోయి చేసే ప్రవర్తన వలన సమాజంలో హీనంగా చూడబడతారన్నారు. అటువంటి వారి ప్రభావం కుటుంబ వ్యవస్థపై పడి తలదించుకునే పరిస్థితులు తలెత్తుతాయన్నారు. మాదకద్రవ్యాల వినియోగించే వారు కొన్ని పరిస్థితులలో నేరం చేయడానికి వెనకాడని పరిస్థితులలోకి వెళ్లి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారన్నారు. రెడ్‌క్రాస్ రెడ్రిబ్బన్క్లబ్ ఎన్ఎస్ఎస్ సభ్యులు మాదకద్రవ్యాల నివారణకు మరింత కృషి చేయాలన్నారు. ప్రతి విద్యార్థి వారి ఇంటికి సమీపంలో సుమారు 10నుండి 20 గృహాలలో సభ్యులను నిశితంగా పరిశీలించి ఎవరైన మాదకద్రవ్యాలకు అలవాటు పడుతున్నట్లు గమనిస్తే అటువంటి వారి సమాచారన్ని రెడ్‌క్రాస్, రెడ్రిబ్బన్క్లబ్, ఎన్ఎస్ఎస్ దృష్టికి తీసుకువస్తే వారిలో మార్పులు తీసుకురావాడానికి సహకరించడం ద్వారా మాదకద్రవ్యాల నివారణలో భాగస్వామ్యులు కావాలని కలెక్టర్ సూచించారు. మాదకద్రవ్యాలను యువత మొదట ప్రయోగాత్మకంగా మొదలు పెట్టి అంచలంచలగా వాటికి బానిసలవుతారన్నారు. మాదక ద్రవ్యాలు మత్తుపదార్ధలను విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, విక్రయించేవారి సమాచారాన్ని అందించే వారి పేర్లను గొప్యంగా ఉంచడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డిల్లీరావు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్‌క్రాస్ జిల్లా చైర్మన్ డా. జి. సమరం, ఎస్ఆర్ఆర్ కళాశాల ప్రిన్సిపల్ డా. కె. భాగలక్ష్మి, ఇండియన్ రెడ్‌క్రాస్ సోసైటీ కాలేజ్ యూనిట్ కో`ఆర్డినేటర్ జి. విజయ్ స్వరూప్ సింగ్, రెడ్‌క్రాస్, రెడ్రిబ్బన్క్లబ్, ఎన్ఎస్ఎస్ సభ్యులు, విద్యార్థులు ఉన్నారు.
Prajavartha Online Telugu News