-పాఠశాల నిర్వహణ నిధులు వినియోగించి మౌలిక వసతులను అభివృద్ధి చేయండి…
-విద్యా ప్రమాణాల పెంపుకు ప్రత్యేక శ్రద్ద పెట్టండి…
-జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నాడు-నేడు పథకం ద్వారా చేపట్టిన పనులను నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేయాలని పాఠశాల నిర్వహణ నిధులను సద్వినియోగం చేసి మౌలిక వసతులను అభివృద్ధి చేయడంతో పాటు విద్యార్థుల విద్యా ప్రమాణాలను పెంచేందుకు ప్రత్యేక శ్రద్ద పెట్టాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అధికారులను ఆదేశించారు.
నాడు-నేడు పనుల ప్రగతి, గృహనిర్మాణాలు, స్పందన గ్రీవెన్స్ తదితర అంశాలపై బుధవారం నగరంలోని కలెక్టరేట్ వీడియోకాన్ఫరెన్స్ నుండి మండల స్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ డిల్లీరావు వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాలల నిర్వహణలలో యంపిడివోలు, యంఆర్‌వోలకు భాధ్యత లేదా? విద్యా ప్రమాణాలను పెంచి మౌలిక వసతుల అభివృద్ధి చేసేందుకు పాఠశాలలను సందర్శిస్తున్నారా? అంటూ జిల్లా కలెక్టర్ మండల స్థాయి అధికారులను ప్రశ్నించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విద్య రంగం అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ద పెట్టి కోట్లాది రూపాయల నిధులను మంజూరు చేస్తున్నారన్నారు. పాఠశాలలో మౌలిక వసతుల అభివృద్ధి విద్యా ప్రమాణాల పెంపు పై ప్రత్యేక శ్రద్ద చూపాలన్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా నాడు-నేడు పథకం ద్వారా పాఠశాలలో పూర్తి స్థాయి మౌలికవసతులను కల్పించి నాణ్యత ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలని స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. పాఠశాల నిర్వహణ నిధులు (ఎస్‌యంఎఫ్) ఏర్పాటు చేసి ఎప్పటికప్పడు పాఠశాలలో అవసరమైన మౌలిక వసతులను అభివృద్ధి చేయాల్సి వున్నప్పటికి వాటిని పూర్తి స్థాయిలో వినియోగించకపోవడం బాధకరమన్నారు. పాఠశాలలో ఆధునిక వసతులతో టాయిలెట్లను నిర్మించి టాయిలెట్ మెయింటినెస్ ఫండ్ ద్వారా నిర్వహణను చేపట్టి టాయిలెట్లను మెరుగుపరచాలని ఆదేశించారు. విద్యార్థుల విద్యాప్రమాణాలను ఎప్పటికప్పుడు పరిశీలించి బోధన విధానాలను మెరుగుపరిచేలా చర్యలు తీసుకోవాలని యంపిడివో యంఇవోలను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. పాఠశాలలో ఎస్‌యంఎఫ్, టియంఎఫ్ నిధుల ద్వారా చేపట్టిన పనుల నివేదికలను పాఠశాలల వారిగా తక్షణమే సమర్పించాలని డిఇవోలను ఆదేశించారు. డిసెంబర్‌లో నిర్వహించే సామూహిక గృహప్రవేశాలకు లక్ష్యంగా నిర్థేశించిన 12,264 గృహ నిర్మాణాలను పూర్తి చేసి సిద్ధంగా ఉంచాలన్నారు. గృహా నిర్మాణాల లక్ష్యాలలో ప్రగతి కనపరిచిన మైలవరం, నందిగామ, జి. కొండూరు మండల యంపిడివోలను ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బందిని కలెక్టర్ అభినందించారు. వీడియోకాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ ఎస్. నుపూర్ అజయ్, డిఆర్‌వో కె. మోహన్‌కుమార్, డిఇవో సివి రేణుక, హౌసింగ్ పిడి శ్రీదేవి, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఇ డివి రమణ, పంచాయతీరాజ్ ఎస్‌ఇ ఏ. వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News