విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న పాలవెల్లువ పథకం అమలు జరుగుతున్న మండలాలలోని యంపిడివోలు, తహాశీల్థారు, ఏపియంఏలు, పశువైద్యులు, రూట్ ఇన్‌చార్జులతో జాయింట్ కలెక్టర్ ఎస్ నుపూర్ అజయ్ ఆమె కార్యాలయం నుండి గురువారం వీడియోకాన్ఫరెన్స్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలోని జి కొండూరు, మైలవరం, గంపలగూడెం, తిరువూరు, విస్సన్నపేట, రెడ్డిగూడెం, ఏ కొండూరు మండలాలలో జగనన్న పాలవెల్లువ పథకం అమలు జరుగుతుందన్నారు. ఈ మండలాలలో 96 పాల సేకరణ కేంద్రాలు ఉన్నాయని, వీటి ద్వారా రోజుకి 6వేల లీటర్ల పాలు సేకరించడం జరుగుతుందన్నారు. ఈ పాల సేకరణ తక్కువగా జరుగుతున్నందున పాల సేకరణ పెంచే విధంగా మహిళా పాడి రైతులతో సచివాలయ సిబ్బంది, మండల అధికారులతో సమావేశాలు నిర్వహించాలన్నారు. మహిళా పాడి రైతులకు కెడిసిసి బ్యాంకు ద్వారా వర్కింగ్ క్యాపిటల్‌గా 30 వేల రూపాయల రుణాలను ఎక్కువ మంది మహిళా రైతులకు మంజూరు చేయాలన్నారు. ఎయంయుఎల్ పాల కేంద్రాలకు పాల సేకరణ స్థాయిని పెంచేందుకు తగు సూచనలను జాయింట్ కలెక్టర్ చేశారు. ప్రైవేట్ డైరీలకన్న ఆటోమెటిక్ బల్క్ యూనిట్ కేంద్రాల (ఎయంయుఎల్) సంస్థ వారు మెరుగైన పాల ధర గరిష్టంగా లీటర్‌కు రూ.82.50 ఇస్తున్నారని పత్రీ గ్రామంలోని పాడి రైతులకు తెలియజేసి జగనన్న పాల వెల్లువ కేంద్రాలలో పాల సేకరణ పెంచే విధంగా కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ నుపూర్ అజయ్ అన్నారు.
వీడియోకాన్ఫరెన్స్‌లో తిరువూరు ఆర్‌డివో వైవి ప్రసన్న లక్ష్మి, డిఆర్‌డిఏ పీడి కిరణ్‌కుమార్, కెడిసిసి బ్యాంక్ అధికారులు, సంబంధిత మండలాల యంపిడివోలు, తహాశీల్థారు, ఏపియంఏలు ఉన్నారు.
Prajavartha Online Telugu News