విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
లోక కళ్యాణార్థం ముత్యాలంపాడు శ్రీషిర్డీ సాయిబాబా మందిరంలో మార్చి 28న కోటి రుద్రాక్ష అభిషేక, అర్చన నిర్వహిస్తున్నామని మందిర గౌరవాధ్యక్షుడు పి.గౌతంరెడ్డి తెలిపారు. షిర్డీసాయిబాబా మందిరంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పి.గౌతంరెడ్డి మాట్లాడుతూ మార్చి 28న కోటి రుద్రాక్ష అభిషేక, అర్చన తెల్లవారుజామున 2 గంటలకు ప్రారంభమై రాత్రి 11గంటల వరకూ జరుగుతుందన్నారు. ఈ మహోత్సవ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. 29వ తేదీ నుండి రుద్రాక్ష మాల కొరకు కైంకర్యం అందించిన భక్తులకు మాలలు, విశేష ప్రసాదం అందజేయబడుతుందన్నారు. ఈ విశేష కార్యక్రమానికి అనేకమంది యతీశ్వరులు, ప్రజా ప్రతినిధులు విచ్చేస్తారని వారితోపాటు భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని పరమశివుని అనుగ్రహం పొందాలని కోరారు. మధ్యాహ్నం భక్తులకు అన్నప్రసాద వితరణ ఉంటుందన్నారు. ఇప్పటికే నేపాల్ నుంచి 60 లక్షల రుద్రాక్షలను తీసుకువచ్చామని మిగిలిన వాటిని త్వరలోనే తీసుకువస్తామన్నారు. అనంతరం కోటి రుద్రాక్ష అభిషేక అర్చన కార్యక్రమం కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కమిటీ కోశాధికారి మందలపర్తి సత్యశ్రీహరి, కుంచనపల్లి రవిశంకర్, శంకర్ రాజు, మందిర అర్చకులు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News