– రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
-రూ. 19.80 లక్షల విలువైన యూజిడి పనులకు భూమిపూజ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అభివృద్ధి, సంక్షేమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దేశంలోనే శిఖరాగ్రాన నిలిచిందని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 63 వ డివిజన్ MIG ఉడా కాలనీ వద్ద రూ. 19.80 లక్షల నిధులతో యూజిడి పైపు లైన్ ఏర్పాటు పనులకు డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజా రెడ్డితో కలిసి సోమవారం ఆయన భూమిపూజ నిర్వహించారు. ప్రజావసరాలను తీర్చడమే ధ్యేయంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తున్నట్లు ఈ సందర్భంగా మల్లాది విష్ణు తెలిపారు. గత తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. వందలాది కుటుంబాలు నివసించే కాలనీలపైనా కనీసం దృష్టి సారించలేకపోయారని మండిపడ్డారు. పాలకులెవరో కూడా తెలియనంత అధ్వానంగా పాలన సాగించి.. ఐదేళ్ల పాటు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారన్నారు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజా సంక్షేమంతో పాటు అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. గత మూడేళ్లలో డివిజన్లో రూ. 2.46 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు. గత టీడీపీ ప్రభుత్వంలో డంపింగ్ యార్డుగా ఉన్న తెలుగుతల్లి పార్కును.. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడం జరిగిందన్నారు. ఎన్నికలు దగ్గర పడటంతో హడావుడిగా శంకుస్థాపన చేసి వదిలేసిన విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణాన్ని ఈ ప్రభుత్వం బాధ్యతగా తీసుకుని పూర్తిచేస్తోందని చెప్పారు. నెలాఖరు లోగా సబ్ స్టేషన్ ను వినియోగంలోకి తీసుకువస్తామని తెలియజేశారు. అలాగే ఈ ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలను నివారించడంతో పాటు ట్రాఫిక్ ను క్రమబద్దీకరించేందుకు నూతన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చిందని మల్లాది విష్ణు తెలిపారు. వారం రోజుల్లో తాత్కాలిక స్టేషన్ ను ఏర్పాటు చేసి సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలియజేశారు. ప్రజలకు పూర్తిస్థాయి మౌలిక వసతులు అందించడంలో గడపగడపకి మన ప్రభుత్వం కార్యక్రమం ముఖ్యభూమిక పోషిస్తోందని ఈ సందర్భంగా మల్లాది విష్ణు తెలిపారు. ఈ ప్రాంతంలో పర్యటించిన సమయంలో అత్యధిక ప్రజానీకం ఇచ్చిన విజ్ఞప్తి మేరకు.. యూజీడీ పనులకు నేడు శంకుస్థాపన చేసుకోవడం జరిగిందన్నారు. నియోజకవర్గంలోని ప్రతిఒక్క కాలనీని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పునరుద్ఘాటించారు. మరోవైపు ఈ నెల 7న ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరగనున్న జయహో బీసీ మహాసభకు ప్రతిఒక్క డివిజన్ నుంచి కనీసం 300 మంది భారీ ర్యాలీగా తరలివచ్చి మద్ధతు తెలియజేయవలసిందిగా మల్లాది విష్ణు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీఈ రామకృష్ణ, ఏఈ అరుణ్ కుమార్, నాయకులు మోదుగుల గణేష్, పసుపులేటి యేసు, సీహెచ్ రవి, టెక్కం కృష్ణ, నాగేశ్వరరావు, తిరుపతిరావు, నాగు, పి.అనిల్ కుమార్, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News