-రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన మూడున్నరేళ్లలో సెంట్రల్ నియోజకవర్గం విద్యుద్దీప కాంతులతో వెలిగిపోతోందని రాష్ట్ర ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. శుక్రవారం ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనములో వీఎంసీ విద్యుత్ అధికారులు, సిబ్బందితో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో వీధి దీపాల వ్యవస్థపై సుధీర్ఘంగా చర్చించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రభుత్వం దృష్టికి వచ్చిన అర్జీలపై ఆరా తీశారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ప్రారంభమైన నాటి నుంచి నియోజకవర్గంలో 58 వీధి దీపాలకు మరమ్మతులు నిర్వహించడంతో పాటు.. 65 కొత్త దీపాలు అమర్చినట్లు అధికారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. అలాగే గత మూడున్నరేళ్లలో 161 కొత్త విద్యుత్ స్తంభాలను ప్రతిపాదించి 108 పోల్స్ ను దీపాలతో సహా ఏర్పాటు చేసినట్లు వివరించారు. మిగతా 53 పోల్స్ ను వీలైనంత త్వరగా వినియోగంలోకి తీసుకువస్తామని తెలియజేశారు. శీతాకాలం దృష్ట్యా సాయంత్రం వేళ ఒక గంట ముందుగా వీధి దీపాలు వెలిగేలా చూడాలని సిబ్బందికి ఎమ్మెల్యే సూచించారు. గత ప్రభుత్వంలో నియోజకవర్గ వ్యాప్తంగా గాఢాంధకారం అలుముకుందని.. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే చివరి కాలనీ వరకు విద్యుత్ వెలుగులు ప్రసరిస్తున్నాయని మల్లాది విష్ణు అన్నారు. వాటి పర్యవేక్షణ, మరమ్మతులు నిరంతరంగా కొనసాగాలని ఆదేశించారు. ప్రభుత్వ చర్యలతో ప్రజలు పూర్తి సంతృప్తిగా ఉన్నారని చెప్పారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు ప్రధాన రహదారులు, జంక్షన్ల వద్ద ఏర్పాటు చేసిన 14 హైమాస్ట్ లైట్లతో రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు. ముఖ్యంగా అజిత్ సింగ్ నగర్ వంతెన నుంచి కండ్రిక వరకు ఏర్పాటు చేసుకున్న రంగురంగుల విద్యుద్దీపాలు చూపరులను విపరీతంగా ఆకట్టుకుంటున్నట్లు వెల్లడించారు. కనుక వీఎంసీ అధికారులు, సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ.. వీధి దీపాల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఏమైనా సమస్యలు ఎదురైతే తన దృష్టికి తీసుకురావాలని తెలియజేశారు. ఈ సమీక్షలో డీఈ ఫణీంద్ర కుమార్, వీఎంసీ విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News