-అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయట తిరగొద్దు
-తూఫాన్ విపత్కర పరిస్థితిని ఎదుర్కొనుటకు సర్వం సన్నద్ధం : జిల్లా కలెక్టర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి, డిసెంబర్ 9: బంగాళా ఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మాండూస్ తుఫానుగా మారి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మరియు ఈ వర్షాలు నేటి 9వ తేదీ నుండి 11 వ తేదీ వరకు కొనసాగనుండగా జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశిస్తూ జిల్లా ప్రధాన కార్యస్థానం మరియు మండల కేంద్రాల్లో 24X7 కంట్రోల్ రూం లు ఏర్పాటు చేశామని తిరుపతి జిల్లా కలెక్టర్ కె. వెంకటరమణారెడ్డి అన్నారు.
శుక్రవారం ఉదయం స్థానిక కలెక్టర్ చాంబర్ లో మీడియా తో మాట్లాడుతూ గత రెండు రోజులుగా అధికారులను, ప్రజలను అప్రమత్తం చేసామని మాండూస్ తుఫాను నేపథ్యంలో తీర ప్రాంత ఐదు మండలాలు చిల్లకూరు, కోట, వాకాడు, సూళ్ళూరుపేట ,తడ మరింత అప్రమత్తత అవసరమని అన్నారు. అంతేకాకుండా కేవీబీ పురం లో వర్షపాతం ఎక్కువగా ఉదయం నమోదు అయిందని అన్నారు. మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లో చేపల వేటకు సముద్రంలోకి వెళ్లరాదని కోరారు. ముంపునకు గురయ్యే అవకాశాలున్న గ్రామాలలో 126 పునరావాస కేంద్రాలను ముందస్తు సన్నద్ధత గా ఏర్పాటు వసతి , ఆహారం , త్రాగునీరు వంటివి ఇబ్బందులు లేకుండా చూడాలని , గర్భిణీ స్త్రీలు, చిన్న పిల్లలు, డయాలసిస్ పేషంట్లు, విభిన్న ప్రతిభావంతులను ముసలివాళ్ళను ప్రాధాన్యతగా అందరినీ తరలించెలా చర్యలు చేపట్టామని తెలిపారు. సచివాలయ సిబ్బంది స్థానికంగానే 24 గంటలు అందుబాటులో ఉండాలని అన్నారు. పంచాయితీ రాజ్ మరియు ఆర్ అండ్ బి శాఖలు ప్రమాద చెరువులను, రహదారులను ముందుగానే గుర్తించి గస్తీ ఏర్పాటు, శ్యాండు బ్యాగులు అందుబాటులో ఉంచుకోవడం జరిగిందనీ అన్నారు. ఎట్టిపరిస్థితిలలోనూ మానవ, పశు ప్రాణ నష్టం జరగడానికి వీలు లేదని అన్నారు. ఇప్పటికే అన్ని రేషన్ షాపులకు నిత్యావసర వస్తువులను తరలించడం జరిగిందని అన్నారు. వర్షాలు తగ్గిన వెంటనే సంబంధిత అధికారులు తుపాన్ నష్ట అంచనాలు చేపట్టాలని అన్నారు. తూఫాను సహాయక చర్యలలో భాగంగా గూడూరులో 23 మంది ఎస్.డి.ఆర్.ఎఫ్ రెస్క్యూ టీమ్, నాయుడుపేటలో 26 మంది ఎన్.డి.ఆర్.ఎఫ్. రెస్క్యూ టీం లు ఏటువంటి అవాంఛనీయ సంఘటనలనైన ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ముందస్తు చర్యల్లో భాగంగా వేటకు సముద్రంలో వెళ్లిన 203 మంది మత్స్యకారులను సురక్షితంగా వారి గ్రామాలకు చేరేలా చర్యలు తీసుకున్నామని అన్నారు. ఇప్పటివరకు జిల్లాలోని తిరుపతి, శ్రీకాళహస్తి, సూళ్ళూరుపేట, గూడూరు రెవిన్యూ డివిజినల్ అధికారులు జిల్లాలోని అన్ని మండలాల్లో తమ పరిధిలో నిరంతర పర్యవేక్షణ జరగాలని ఆదేశించినట్లు తెలిపారు. అన్ని విధాలుగా మాండూస్ తూఫాన్ ను ఎదుర్కొన డానికి జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో సన్నద్ధత తో ఉందని ప్రజలు ఈ భారీ వర్షాల సమయంలో అత్యవసరం అయితే తప్ప బయట తిరగకుండా సహకరించాలని కోరారు.
Prajavartha Online Telugu News