-20 ఏళ్ళలోపు గర్భిణీలను హై రిస్క్ డెలివరీలుగా గుర్తించాలి..
-గర్భిణీ స్త్రీలలు ఐరన్ టాబ్లెట్లను వినియోగించేలా చర్యలు తీసుకోండి.
-జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గర్భిణీ స్త్రీలలో హై రిస్క్ డెలివరీలను ముందుగానే గుర్తించి జాగ్రత్త చర్యలను పాటించడం ద్వారా మాత శిశు మరణాల నివారించాలని కిషోర బాలికలు గర్భిణీ స్త్రీలు ఐరన్ టాబ్లెట్లను తప్పనిసరిగా ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు వైద్యాధికారులను ఆదేశించారు.
మాత శిశు మరణాల నివారణ, హై రిస్క్ డెలివరీలు, ఐరన్ టాబ్లెట్ల వినియోగంపై గురువారం జిల్లా కలెక్టర్ డిల్లీరావు ఆయన కార్యాలయం నుండి వైద్యాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మాత శిశు మరణాలను పూర్తి స్థాయిలో నివారించడం పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. 20 ఏళ్ళలోపు టీనేజ్ గర్భిణీ స్త్రీలను గుర్తించి వారి ఆరోగ్య విషయాలపై పూర్తి సమాచారాన్ని సేకరించి పొందుపరచాలన్నారు. గర్భిణీ స్త్రీలలో బిపి షుగర్ వ్యాధులను గుర్తించి వైద్య సహాయం అందించడంతో పాటు ఆహారపు అలవాట్లలో మార్పు తీసుకురావాలన్నారు. నెలలు నిండక ముందే వచ్చే ప్రసవాలను ముందుగానే గుర్తించి సమీపంలోని అనస్థీషియాలజిస్ట్, గైనకాలజిస్ట్ అందుబాటులో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలలో ప్రసవాలను నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. గర్భిణీ ధరించిన 45 రోజుల లోపు వివరాలను నమోదు చేసి 3 నెలల పాటు ఐరన్ ఫోలిక్ యాసిడ్ సి విటమిన్లను అందజేయాలన్నారు. మహిళలలో రక్తహీనతను నివారించేందుకు యుక్త వయస్సు నుండే బాలికలకు ఐరన్ టాబ్లెట్లను ప్రభుత్వం సరఫరా చేస్తుందన్నారు. ప్రభుత్వం సరఫరా చేసిన ఐరన్ టాబ్లెట్లను అంగన్వాడీ కేంద్రాలు పాఠశాలలు, కళాశాలలకు పంపిణీ చేయవలసిన బాధ్యత జిల్లా వైద్యాధికారి శిశు సంక్షేమ అధికారులదే అన్నారు. పంపిణీ చేసిన టాబ్లెట్లను వినియోగించేలా పర్యవేక్షించాల్సి బాధ్యత అంగన్వాడీ సూపర్వైజర్లు, ఏఎన్యంలపై ఉందన్నారు. ఆకస్మిక తనిఖీలతో ఐరన్ టాబ్లెట్లను వినియోగించడం లేదని గుర్తిస్తే సూపర్వైజర్లు, ఏఎన్యంలపై చర్యలు తీసుకుంటామన్నారు. మధ్యాహ్న భోజన పథకం ద్వారా ఆహారంలో కోడిగుడ్లను సరఫరా చేస్తే తెల్ల సొనను మాత్రమే వినియోగించి పౌష్టికాహారం ఉన్న పచ్చ సొనను పారవేస్తున్నారని ఇటువంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. హై రిస్క్ డెలివరీలను గుర్తించి ఎప్పటికప్పుడు జాబితాను సమర్పించాలని కలెక్టర్ డిల్లీరావు వైద్య అధికారులను ఆదేశించారు.
కాన్ఫరెన్స్లో డియంహెచ్వో డా. యం సుహాసిని, డిప్యూటి డియంహెచ్వో డా. వై నళినిదేవి, పిహెచ్సి వైద్యులు డా. కాల్యాణి, డా. సుమ, డా. దివిజ, వైద్యాధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News