Breaking News

వినియోగదారుల్లో చైతన్యం తీసుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది… : జాయింట్ కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
వినియోగదారుల హక్కుల గురించి విద్యార్థినీ విద్యార్థులకు చిన్ననాటి నుంచే అవగాహన కల్పించి వారిలో చైతన్యం తీసుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్‌ డాక్టర్ అపరాజిత సింగ్ తెలిపారు.
జాతీయ వినియోగదారుల వారోత్సవాలు పురస్కరించుకొని పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం చిలకలపూడి శ్రీ పాండురంగ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో విద్యార్థినీ విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన జె సి డాక్టర్ అపరాజిత సింగ్ మాట్లాడుతూ, వినియోగదారుల ప్రయోజనాలు , వారి హక్కులు, బాధ్యతల గురించి అవగాహన కల్పించడానికి భారతదేశంలో ప్రతి సంవత్సరం డిసెంబర్ 24 న జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని జరుపుకుంటారని తెలిపారు. డిసెంబర్ 24, 1986 న, వినియోగదారుల రక్షణ చట్టం 1986 భారత రాష్ట్రపతి ఆమోదం పొంది అమల్లోకి వచ్చిందన్నారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థినీ విద్యార్థులను ఉద్దేశించి పలు ప్రశ్నలు అడిగారు. మనదేశంలో వినియోగదారునికి ఎన్ని హక్కులు ఉన్నాయిని ? మీ ఇంట్లో కొత్తగా కొనిన మిక్సీ పాడైతే మీరేం చేస్తారు ? జిల్లా వినియోగదారుల ఫోరంలో కేసు వేయాలంటే ఎంత ఫీజు చెల్లించాలి ? సంయుక్త కలెక్టర్ సంధించిన అన్ని ప్రశ్నలకు బాల బాలికలు చురుగ్గా సమాధానం చెప్పడంతో ఆమె వారిని వెరీ గుడ్ అని ప్రశంసించారు. ఈనెల 24వ తేదీన జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా జరిగే వకృత్వ పోటీల్లో మీరంతా పాల్గొంటున్నారా ? అలాగే వ్యాసరచన పోటీలో మీరు రాసే స్క్రిప్టులు నేను చదువుతానని బాల బాలికలతో ఆమె అన్నారు.
మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా డిజిటల్‌ యుగం నడుస్తుండటంతో వినియోగదారుడు గాని ఉత్పత్తిదారుడు తమకే అర్థం కాని కనిపించని పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు. పర్యావసనంగా వినియోగదారులు మోసాలకు గురయ్యే అవకాశం ఉన్నదని దీనిని అరికట్టడానికి వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం 2019 తీసుకురావడం జరిగిందని అన్నారు.
వినియోగదారుల రక్షణకు సంబంధించి కొత్త చట్టంలో జిల్లా కమిషన్‌ పరిధి కోటి రూపాయల వరకు ఉందని రాష్ట్ర కమిషన్‌ పరిధి కోటి నుంచి 10కోట్లకు, జాతీయ కమిషన్‌ 10కోట్ల రూపాయలకు పైగా విలువ కలిగిన కేసులను చేపట్టేలా కీలక మార్పులు చేశారని వివరించారు. వినియోగదారులను తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇచ్చేవారిని, అటువంటి ప్రకటనల్లో భాగస్వాములైన వ్యక్తులకు 10 లక్షల వరకు జరిమానా విధించే అధికారం కేంద్ర ప్రాధికార సంస్థకు ఉంది. అదే విధంగా మోసపూరిత ప్రకటనలో పాల్గొన్న ప్రముఖులపై ఇతర వాణిజ్య ప్రకటనల్లో నటించకుండా ఏడాది నుంచి మూడేళ్ల వరకు నిషేధం విధించవచ్చన్నారు.. జిల్లా స్థాయి కమిషన్‌లో కొత్తగా వివాదాల పరిష్కార కోసం మధ్యవర్తిత్వ కేంద్రాలు నెలకొల్పి సత్వర పరిష్కారం కల్పించే అవకాశాన్ని కొత్త చట్టం కల్పిస్తోంది. పరిష్కారం లభించని పక్షంలో జిల్లా స్థాయి కమిషన్‌ రాష్ట్ర, జాతీయ కమిషన్లకు నివేదిక పంపాల్సి ఉంటుంది
వినియోగదారునికి జరిగే మోసాలను చట్టం దృష్టికి తీసుకువచ్చి న్యాయం చేసే విధంగా చట్టాన్ని రూపొందించడం జరిగిందని తెలిపారు. హక్కులకు సంబంధించి వినియోగదారులకు ప్రజలకు పూర్తి అవగాహన కల్పించి చైతన్యం కల్పించడం ద్వారా మోసాలను గుర్తించి నష్ట పరిహారం అందించడమే కాక మోసం చేసిన వారికి శిక్షలు జరిమానాలు విధించడానికి కూడా ఈ చట్టం వెసులుబాటు కల్పించిందన్నారు.
అధికారులు వినియోగ సంఘాలవారు ఈ దిశగా ప్రజల కోసం అవగాహన కల్పించడానికి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. పెద్ద పెద్ద దుకాణాల్లో టోల్‌ ఫ్రీ నెంబర్‌తో పాటు ఫిర్యాదుల పెట్టె వినియోగదారులకు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేయించాలని జాయింట్ కలెక్టర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో డిసిఎస్‌ఓ పార్వతి, డివైఈవో యు.వి. సుబ్బారావు, హిందూ కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ. ఆర్. కె. మూర్తి,జిల్లా వినియోగదారుల సంఘాల సమాఖ్య కార్యదర్శి మోహనరావు, సీనియర్ అడ్వకేట్ లయన్ లంకిశెట్టి బాలాజీ, తూనికలు కొలతల శాఖ ఇన్స్పెక్టర్ ఈశ్వర్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ గోపాలకృష్ణ, పలు సంఘాల ప్రతినిధులు, పలువురు ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *