– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మోక్షానికి సులభ మార్గం శ్రీ విష్ణు సహస్రనామ పారాయణమని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ధనుర్మాస మహోత్సవాలలో భాగంగా ముత్యాలంపాడులోని శ్రీ షిరిడీ సాయి మందిరంలో శుక్రవారం నిర్వహించిన విష్ణుసహస్రనామ స్తోత్ర అఖండ పారాయణం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో మల్లాది విష్ణు పాల్గొని ప్రసంగించారు. మనిషి ప్రశాంతంగా, ఉన్నత ప్రమాణాలతో జీవించాలంటే ఆధ్యాత్మికత తప్పనిసరని పేర్కొన్నారు. ఇందుకోసం యువతరం సనాతన ధర్మాన్ని మరచిపోకుండా ఉండేందుకు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని మొదటి, రెండు, మూడవ పర్యాయాలు పఠించడం వలన విశేష ఫలితాలు లభిస్తాయన్నారు. ఎవరైతే ప్రతినిత్యం బ్రహ్మ ముహూర్తములో రావి వృక్షం దగ్గర ఈ పారాయణం గావిస్తారో వారి సంకల్పం సిద్దిస్తుందని.. మనసులోని చెడు ఆలోచనలు తొలగిపోతాయని పేర్కొన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న కార్యక్రమాలతో ప్రజలలో ఆధ్యాత్మికత వెల్లివిరుస్తోందని మల్లాది విష్ణు అన్నారు. హిందూ ధర్మాన్ని కాపాడుతూ, దేవాలయాల వ్యవస్థను ఎల్లవేళలా పరిరక్షిస్తూ ముందుకు సాగుతున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అన్ని దేవుళ్ల ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆకాంక్షించారు. షిరిడీ సాయినాథుని దివ్య ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలు సుఖశాంతులతో జీవించాలని కోరుకున్నారు.
Prajavartha Online Telugu News