-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
-28 వ డివిజన్ 202 వ వార్డు సచివాలయ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నవరత్నాల పథకాలతో పేదల సామాజిక, ఆర్థికాభివృద్ధికి చర్యలు తీసుకోవడంతో పాటుగా సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు రాష్ట్ర ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. 28 వ డివిజన్ 202 వ వార్డు సచివాలయ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం శనివారం ఉత్సాహపూరిత వాతావరణంలో కొనసాగింది. వైఎస్సార్ సీపీ డివిజన్ కోఆర్డినేటర్ కనపర్తి కొండా, అధికారులతో కలిసి భానునగర్ సెంటర్ సాయిబాబా గుడి వద్ద నుంచి ఎమ్మెల్యే పాదయాత్ర ప్రారంభించారు. ప్రతిఒక్కరినీ పేరుపేరున పలకరిస్తూ.. 236 గడపలను సందర్శించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై విస్తృత అవగాహన కల్పిస్తూ.. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతకం చేసిన కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులకు మహిళలు ఘన స్వాగతం పలికారు, హారతులతో బ్రహ్మరథం పట్టారు. అర్హత ఉన్న ప్రతిఒక్కరికీ ఈ ప్రభుత్వం సంక్షేమ పథకాలు శాచ్యురేషన్ పద్ధతిలో అందజేస్తున్నట్లు మల్లాది విష్ణు తెలియజేశారు. తన సుధీర్ఘ రాజకీయ జీవితంతో ప్రజల కోసం చిరస్థాయిగా నిలిచేలా ఒక్క పథకమైనా చంద్రబాబు ప్రవేశపెట్టారా..? అని సూటిగా ప్రశ్నించారు. ఈ సందర్భంగా స్థానికుల నుంచి ఎమ్మెల్యే మల్లాది విష్ణు గ్రీవెన్స్ స్వీకరించారు. తమ దృష్టికి వచ్చిన ప్రతిఒక్క సమస్యను నూటికి నూరు శాతం పరిష్కరించాలని అధికారులకు తెలియజేశారు. తప్పనిసరిగా వ్యాక్సినేషన్ ను పూర్తి చేసుకోవాలని ప్రజలందరికీ సూచించారు.
సచివాలయ పరిధిలో రూ. 5.65 కోట్ల సంక్షేమం
నవరత్నాల పథకాల ద్వారా 202వ వార్డు సచివాలయ పరిధిలో రూ. 5.65 కోట్ల సంక్షేమాన్ని మూడున్నరేళ్లలో అందజేసినట్లు మల్లాది విష్ణు వెల్లడించారు. వైఎస్సార్ పింఛన్ కానుక ద్వారా ప్రతినెలా 275 మందికి క్రమం తప్పకుండా ఇంటి వద్దకే పింఛన్ అందిస్తున్నట్లు తెలిపారు. అమ్మఒడి ద్వారా 400 మందికి రూ. 56 లక్షలు., ఆసరా ద్వారా 411 మందికి రూ. 40 లక్షలు., విద్యాదీవెన మరియు వసతి దీవెన ద్వారా 78 మందికి రూ. 14.19 లక్షలు., చేయూత ద్వారా 174 మందికి రూ. 32.62 లక్షలు., కాపు నేస్తం ద్వారా 6 మందికి రూ. 1.12 లక్షలు., వాహనమిత్ర ద్వారా 26 మందికి రూ. 2.60 లక్షలు., జగనన్న తోడు ద్వారా 30 మందికి రూ. 3 లక్షల ఆర్థిక సాయాన్ని ఒక్క ఏడాదిలోనే అందించినట్లు వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
సీఎం జగన్ పాలన చూసి చంద్రబాబుకు కడుపు మంట
రాష్ట్రంలో పూర్తిగా ఉనికిని కోల్పోయిన చంద్రబాబు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనరంజక పాలన చూసి కడుపు మంటతో రగిలిపోతున్నారని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మల్లాది విష్ణు విమర్శించారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అమలు పరుస్తున్న ప్రజారంజక పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల పట్ల ప్రతిపక్ష నేత తీవ్ర అసహనంతో రగిలిపోతున్నారన్నారు. పొత్తు లేనిదే సీఎం వైఎస్ జగన్ ను ఎదుర్కొనే ధైర్యం కూడా చేయలేని చంద్రబాబు.. ఆయనను రాష్ట్రం నుంచి వెళ్లగొడతానని బీరాలు పలకడం హాస్యాప్పదమన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి పంచర్ పడిందని పలు సందర్భాలలో ప్రతిపక్ష నేతనే అంగీకరించారని వ్యాఖ్యానించారు. కనుకనే సీఎం వైఎస్ జగన్ తో నేరుగా తలపడే సత్తా లేక ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని మల్లాది విష్ణు మండిపడ్డారు. 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు విజన్ రాష్ట్రాన్ని అట్టడుగున నిలిపితే.. కేవలం మూడున్నరేళ్ల కాలంలో సీఎం వైఎస్ జగన్ విజన్ ఏపీని దేశంలోనే శిఖరాగ్రాన నిలబెట్టిందని కితాబిచ్చారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా కనుమరుగైందని.. చివరకు ప్రజల దృష్టిని ఆకర్షించే క్రమంలో దిగజారుడు విమర్శలు చేస్తూ అభాసుపాలవుతున్నారని మల్లాది విష్ణు అభిప్రాయపడ్డారు. అబద్ధాల్లో పుట్టి పెరిగిన చంద్రబాబును ప్రజలు ఇప్పటికీ నమ్మడం లేదని.. 2019 ఎన్నికల తర్వాత టీడీపీ వరుస ఓటములే ఇందుకు నిదర్శనమన్నారు. ఎవరెన్ని విమర్శలు చేసినా వైఎస్సార్ సీపీ ప్రభుత్వ పాలనపై 87 శాతం మంది ప్రజలు పూర్తి సంతృప్తిగా ఉన్నారని స్పష్టం చేశారు. కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, జోనల్ కమిషనర్ అంబేద్కర్, నాయకులు చిన్నారావు, కగ్గా పాండు, వేదాంతం చైతన్య, ఈశ్వరరావు, పిల్లుట్ల వంశీ, భోగాది మురళి, శ్రీను, రామకృష్ణ, యక్కల మారుతి, రాంబాబు, ఇతర నాయకులు, అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News