విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని గాంధీ దేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ అధ్యక్షులు గాంధీ నాగరాజన్ డిమాండ్ చేశారు. శుక్రవారం 43వ డివిజన్ ఊర్మిళా నగర్ లోని గాంధీ దేశం ట్రస్ట్ కార్యాలయం వద్ద నుంచి కళ్ళకు గంతలు కట్టుకొని గాంధీ నాగరాజన్ భవానిపురం, తదితర ప్రాంతాల్లో పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని, ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చే వరకు తాను శాంతియుతంగా వివిధ రూపాల్లో ఆందోళన చేస్తానని స్పష్టం చేశారు. దేశ ప్రజలందరికీ స్వాతంత్ర్య ఫలాలు దక్కాలని, అందరూ సంతోషంగా ఉండేందుకు అవసరమైన చర్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సత్వర చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తన చివరి శ్వాస వరకు దేశం కోసమే జీవిస్తానని ఆయన అన్నారు. మహాత్మా గాంధీ, అంబేద్కర్ ఆశయాలను సాధించేందుకు పాలకులు నిస్వార్ధంగా పనిచేయాలని కోరారు. కొత్తగా కడుతున్న పార్లమెంట్ భవనంకు మహాత్మా గాంధీ బాబాసాహెబ్ అంబేద్కర్ ల పేర్లు పెట్టి వారి శిలా విగ్రహాలను అక్కడ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. గాంధీ నాగరాజన్ కళ్ళకు గంతలతో చేసిన పాదయాత్రలో ఆయనతో పాటుగా గాంధీ ట్రస్ట్ మహిళా అధ్యక్షురాలు ఆర్.ఆర్. శివరంజని, ట్రస్టు రాష్ట్ర అధ్యక్షురాలు బాపతి భారతి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News