-కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలో కాకినాడ కేంద్రంగా కార్యకలాపాలు
కాకినాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (కేంద్ర సమాచార విభాగం), కాకినాడ క్షేత్ర కార్యాలయ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ (క్షేత్ర ప్రచార అధికారి)గా శ్రీరామ మూర్తి కందాళ ను నియమిస్తూ కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు విజయవాడలోని పత్రికా సమాచార కార్యాలయంలో మీడియా అండ్ కమ్యూనికేషన్ అధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కెఎస్ఆర్ మూర్తి, ఉభయ గోదావరి జిల్లాల క్షేత్ర ప్రచార అధికారిగా ఈరోజు బాధ్యతలు చేపట్టారు. ఈయన ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ (ఐఐఎస్) అధికారి. గతంలో గుంటూరు-కృష్ణా జిల్లాల క్షేత్ర ప్రచార అధికారిగా ఈయన బాధ్యతలు నిర్వహించారు.
సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (కేంద్ర సమాచార విభాగం) గురించి :
భారత ప్రభుత్వ కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలో సెంట్రల్ బ్యూరో ఆప్ కమ్యూనికేషన్ (సి.బి.సి) పని చేస్తుంది. ప్రతి రాష్ట్రంలోనూ, ప్రతి రెండు జిల్లాలకు కలిపి ఓ సెంట్రల్ బ్యూరో ఆప్ కమ్యూనికేషన్ (కేంద్ర సమాచార విభాగం) ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లో శ్రీకాకుళం, విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, నెల్లూరు, కడప, కర్నూలు లో ఈ కార్యాలయాలు ఉన్నాయి. క్షేత్రస్థాయిలో అంటే మండల కేంద్రాల్లో, గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి ప్రచారం చేసే బాధ్యతను ఈ కార్యాలయాలు నిర్వర్తిస్తుంటాయి. ప్రచార చిత్రాల ప్రసారం ద్వారా, సమావేశాలు, ఎగ్జిబిషన్లు తదితర మార్గాల్లో గ్రామీణ ప్రాంతాలకు ప్రభుత్వ పథకాల వివరాలను చేరవేస్తుంటారు.
Prajavartha Online Telugu News