– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
-29 వ డివిజన్ 209 వ వార్డు సచివాలయ పరిధిలో ఐదో రోజు గడప గడపకు మన ప్రభుత్వం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా పేదరిక నిర్మూలన కోసం సీఎం వైఎస్ జగన్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి.. ఏపీని సంక్షేమానికి కేరాఫ్ గా నిలిపారని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. శుక్రవారం 29 వ డివిజన్ 209 వ వార్డు సచివాలయ పరిధిలో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కొంగితల లక్ష్మీపతి, అధికారులతో కలిసి ఆయన పాల్గొన్నారు. హనుమంతరావు వీధి, మల్లంపల్లి వారి వీధి, సాయిబాబా కాలనీలోని పలు వీధులలో విస్తృతంగా పర్యటించి 375 గడపలను సందర్శించారు. ప్రతి ఇంటికీ వెళ్లి లబ్ధిదారులను ఆప్యాయంగా పలకరిస్తూ.. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అందించిన లబ్ధిని బుక్ లెట్ల ద్వారా వివరించారు. అర్హత ఉండి ఏ ప్రభుత్వ పథకం అందకపోయినా.. తన దృష్టికి తీసుకువస్తే తక్షణమే పరిష్కారం అయ్యేలా చూస్తానని హామీనిచ్చారు. ప్రతిఒక్క వాలంటీర్ తమ క్లస్టర్ల పరిధిలోని గృహ యజమానులకు సచివాలయ ఉద్యోగుల ఫోన్ నెంబర్లను అందుబాటులో ఉంచాలని సూచించారు. అనంతరం పలువురు అర్జీదారులకు మంజూరైన ఆరోగ్యశ్రీ కార్డులు, కుల, ఆదాయ ధ్రువ పత్రాలను ఎమ్మెల్యే చేతులమీదుగా అందజేశారు.
ప్రతి శుక్రవారం డ్రై డే తప్పనిసరి
ప్రతి శుక్రవారం నివాసాలలో డ్రైడే పాటించడం ద్వారా దోమల వృద్దిని అరికట్టవచ్చని మల్లాది విష్ణు అన్నారు. పర్యటనలో భాగంగా దోమల నియంత్రణపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఎక్కువ రోజులు ఇళ్లల్లో నీటిని నిల్వ ఉంచకూడదని ఈ సందర్భంగా సూచించారు. డెంగ్యూ దోమలు మంచినీటిలో ఎక్కువగా గుడ్లు పెడతాయని.. కనుక గృహాల్లోని నీటి తొట్టిలు, డ్రమ్ములు, ట్యాంకులు, కుండీలలో కనీసం మూడు రోజులకోసారి నీటి నిల్వలను తొలగించాలన్నారు. డెంగీ, మలేరియా, చికెన్ గున్యా లాంటి విష జ్వరాలకు కారణమయ్యే దోమలను లార్వా దశలోనే నియంత్రించే దిశగా వీఎంసీ ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. అలాగే పారిశుద్ధ్య కార్యక్రమాలు పూర్తి స్థాయిలో జరిగేలా అధికారులు, శానిటేషన్ సెక్రటరీలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
చంద్రబాబు చట్టాలను గౌరవించాలి
రాజకీయ సభల కంటే ప్రజల ప్రాణాలే ప్రభుత్వానికి ముఖ్యమని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మల్లాది విష్ణు అన్నారు. కందుకూరు, గుంటూరులో జరిగిన ఘటనలకు సంబంధించి తెలుగుదేశంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా బహిరంగ ప్రదేశాల్లో సభలు నిర్వహించాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా భావించి జీవో నెం.1 తీసుకువచ్చినట్లు చెప్పారు. దీనిపై ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టడం ఎందుకని ప్రశ్నించారు. ఎంతటి వారైనా ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారమే మీటింగ్‌లు పెట్టుకోవాల్సి ఉంటుందని మల్లాది విష్ణు తెలిపారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబుకి.. పోలీస్ అధికారులతో ఏవిధంగా ప్రవర్తించాలో తెలియకపోవడం బాధాకరమన్నారు. పైగా డీజీపీకి లేఖ రాయడాన్ని ఆయన తప్పుబట్టారు. చూస్తుంటే ఓడిపోతామనే భయం చంద్రబాబుకు పట్టుకున్నట్లు ఉందని.. 2024లో కుప్పం సహా 175 అసెంబ్లీ స్థానాలలో వైఎస్సార్ సీపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు కడవకొల్లు నరసింహారావు, నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, జోనల్ కమిషనర్ జి.సుజనా, డీఈలు గురునాథం, రామకృష్ణ, ఏఎంఓహెచ్ రామకోటేశ్వరరావు, నాయకులు ఎస్.కె.బాబు, కోలా రమేష్, కంభం కొండలరావు, సముద్రపు గోవింద్, చీమల గోవింద్, అక్బర్, మానం వెంకటేశ్వరరావు, కొంగితల సుధాకర్, దేవినేని సుధాకర్, అంబటి వెంకయ్య, పూర్ణిమ, నాగమణి, జి.వాసు, మోహన్ రావు, దేవినేని శివాజీ, ఇతర నాయకులు, అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News