-రాజమండ్రిలో ‘ఈట్ స్ట్రీట్’ ప్రారంభోత్సవంలో ఎంపీ భరత్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాజమండ్రి నగరానికి కొత్త శోభ, సరికొత్త సంస్కృతిని ఈ ‘ఈట్ స్ట్రీట్’ తో నగర ప్రజలకు పరిచయం చేస్తున్నామని వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ అన్నారు. శుక్రవారం రాత్రి నగరంలోని ఆర్ట్స్ కళాశాలకు ఆనుకుని ఉన్న వీధిలో ‘అర్బన్ ఫుడ్ ప్లాజా’ పేరుతో ఈట్ స్ట్రీట్ ను ఎంపీ భరత్, జిల్లా కలెక్టర్ డాక్టర్ కే మాధవీలత, కమిషనర్ కే దినేష్ కుమార్, రుడా ఛైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ ఈట్ స్ట్రీట్ లో వాహనాలకు ప్రవేశం లేదని, సరదాగా కుటుంబ సభ్యులతో నడచివచ్చి ఆస్వాదించేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. ప్రస్తుతానికి 33 స్టాల్స్ కు అనుమతి ఇవ్వడం జరిగిందని, మరో 30 వరకూ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. భవిష్యత్తులో నగరంలో పుష్కర ఘాట్, ఏకేసీ కళాశాల సమీపంలో కూడా ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నామని తెలిపారు. ప్రతీ రోజు రాత్రి 7నుండి తొమ్మిది గంటల వరకూ కొనసాగేలా నిర్ణయించామని, పబ్లిక్ డిమాండును బట్టి మరో రెండు మూడు గంటలు పెంచగలమని ఎంపీ భరత్ తెలిపారు. ఇక్కడకు వచ్చేవారికి ఎటువంటి ఇబ్బందీ కలగకుండా పోలీసు నిఘా ఉంటుందని, ఆకతాయిలు, మద్యం సేవించే వారి ఇక్కడకు వస్తే పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని ఎంపీ భరత్ తెలిపారు. నగర వాసులు ఈట్ స్ట్రీట్ ను సద్వినియోగం చేసుకుని వ్యాపారులకు ప్రోత్సాహం అందివ్వాల్సిందిగా ఎంపీ భరత్ విజ్ఞప్తి చేశారు.
Prajavartha Online Telugu News