Breaking News

కె. ఆర్.ఎం.బి. కార్యాలయాన్ని విజయవాడలోనే ఏర్పాటు చేయాలి…

-ఆంధ్రా రైతుల నీటి హక్కులను కాపాడాలి
-కె. ఆర్.ఎం.బి. చైర్మన్ ఎం.పి.సింగ్ కు విజ్ఞప్తి చేసిన సాగునీటి వినియోగదారుల సంఘాల సమఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణానదీ యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేయటానికి చర్యలు తీసుకోవాలని ఈనెల ౩వ వారంలో హైదరాబాద్ లో జరగనున్న 17 వ బోర్డు సమావేశంలో ప్రధాన ఎజెండాగా చేర్చిన నేపథ్యంలో దీనిపై స్పందిస్తూ సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ళ వెంకట గోపాలకృష్ణారావు నేతృత్వంలో సాగునీటి సంఘాల రాష్ట్ర సారధులు కృష్ణా తూర్పు డెల్టా ప్రాజెక్టు కమిటీ మాజీ చైర్మన్ గుత్తా శివరామకృష్ణ, నాగార్జునసాగర్ ఎడమ కాలువ ప్రాజెక్టు కమిటీ మాజీ చైర్మన్ యనమద్ది పుల్లయ్య చౌదరి ఇతర కార్యవర్గ సభ్యులు ఈరోజు కె. ఆర్.ఎం.బి.చైర్మన్ ఎం.పి.సింగ్ కు పూర్తి వివరాలతో ఈ-మెయిల్ ద్వారా వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఇదే విషయమై ఈరోజు ఉదయం విజయవాడ ప్రెస్ క్లబ్ లో పత్రికా విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి పూర్తి వివరాలు తెలియజేశారు.
ఈ సందర్భంగా జలవనరుల శాఖ రాష్ట్ర ఎపెక్స్ కమిటీ మాజీ సభ్యులు, సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ళ వెంకట గోపాలకృష్ణారావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణానదీ పరివాహక ప్రాంతంలో అన్ని రకాల మానిటరింగ్ చేయటానికి కృష్ణానదీ యాజమాన్య బోర్డు ఏర్పడిందని ఈ విషయం మీద దీని ప్రధాన కార్యాలయాన్ని విజయవాడలోనే ఏర్పాటు చేయటానికి 2018 జనవరిలో ఇబ్రహీంపట్నం ప్రాంతంలో భవనాలను కూడా పరిశీలించటం జరిగిందని అట్లాగే వై.సి.పి. ప్రభుత్వం ఏర్పడినాక జూన్ 2020 లో అప్పటి ప్రభుత్వ ప్రాధానకార్యదర్శి విజయవాడలోనే కె. ఆర్.ఎం.బి. కార్యాలయం ఏర్పాటు చేయటానికి కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శికి లేఖ రాస్తూ దాని ప్రతులను కె. ఆర్.ఎం.బి. సభ్యకార్యదర్శి హైద్రాబాదుకు పంపడం జరిగిందని, అలాగే 2019 నవంబరులోను, 2020 ఆగస్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జలవనరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ విజయవాడలోనే కె. ఆర్.ఎం.బి. కార్యాలయం ఏర్పాటు చేయాలనీ కేంద్ర జలశక్తి శాఖకు లేఖ రాయటం జరిగిందని తెలిపారు. ఇదిలా ఉండగా రాష్ట్ర ప్రభుత్వం వీటికి విరుద్ధంగా 2020 డిసెంబరులో కె. ఆర్.ఎం.బి. కార్యాలయాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని కె. ఆర్.ఎం.బి.కి విజ్ఞప్తి చేసి ప్రస్తుతం జరుగబోవు 17 వ బోర్డు మీటింగులో ఈ అంశాన్ని చేర్చటం చాలా ధారుణమన్నారు. కృష్ణానది పరివాహక ప్రాంతంలో శ్రీశైలం, నాగార్జునసాగర్, ప్రకాశం బ్యారేజి క్రింద ఉమ్మడి కర్నూలు, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలో 30 లక్షల ఎకరాల ఆయకట్టు ఉందని విజయవాడ పట్టణం కృష్ణానది ఒడ్డున రైల్, రోడ్డు, విమాన సౌకర్యం కలిగి ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వ అధికారులు, తెలంగాణ ప్రభుత్వ అధికారులు, ఆయకట్టుదారులు, నీటి సంఘాల ప్రతినిధులు తమ సమస్యలను కె. ఆర్.ఎం.బి. దృష్టికి తీసుకురావటానికి అనుకూలంగా ఉంటుందన్నారు. ఇన్ని సానుకూల అంశాలు ఉన్న విజయవాడలో కాకుండా కృష్ణా డెల్టా కు 400 కి.మీ, శ్రీశైలం కు 800 కి.మీ, నాగార్జున సాగర్ కు 700 కి.మీ, దూరంధాటి గోదావరి బేసిన్ అవతల ఉన్న విశాఖపట్నంలో మూడు రాజధానుల్లో భాగంగా కార్యనిర్వాహక రాజధాని నెపంతో కె. ఆర్.ఎం.బి. కార్యాలయాన్ని ఎలా ఏర్పాటు చేస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.గతంలో కేంద్ర జలశక్తి శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య జరిగిన నిర్ణయాలను పరిగణలోనికి తీసుకుని విజయవాడలోనే కార్యాలయాన్ని ఏర్పాటు చేయటానికి అన్ని రకాల చర్యలు తీసుకోవాలని కె. ఆర్.ఎం.బి. చైర్మన్ ఎం.పి.సింగ్ కు విజ్ఞప్తి చేసారు. దీని ప్రతులను కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్, న్యూఢిల్లీకి పంపి ఈ విషయంలో జోక్యం చేసుకుని ఆంధ్ర రైతుల నీటి హక్కులను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. నిజంగా రాష్ట్ర ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆంధ్ర ప్రజల నీటి హక్కుల మీద ధ్యాస ఉంటే శ్రీశైలం ఎగువ భాగాన సిడబ్ల్యుసి కేంద్ర జల శక్తి శాఖ కె.ఆర్.ఎం.బి నుంచి ఏ విధమైన అనుమతులు తీసుకోకుండా 150 టీఎంసీలతో పాలమూరు రంగారెడ్డి, దిండి, మిషన్ భగీరథ,భక్త రామదాసు, తుమ్మెళ్ళ తదితర కొత్త ప్రాజెక్టులు, 105 టీఎంసీలతో కల్వకుర్తి, నెట్టెంపాడు, ఎస్.ఎల్.బి.సి తదితర ప్రాజెక్టులు విస్తరిస్తూ ఉంటే కేవలం లేఖలతో సరిపెట్టకుండా ఈ అక్రమ ప్రాజెక్టులను చట్టబద్దంగా అడ్డుకుని ఆంధ్రా రైతుల నీటి హక్కులను కాఆడలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వా న్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో డిస్ట్రిబ్యూటరీ కమిటీ మాజీ చైర్మన్ లు, సాగునీటి వినియోగదారుల సంఘాల రాష్ట్ర సమాఖ్య కార్యవర్గ సభ్యులు ఉప్పలపాటి చక్రపాణి(ప్రకాశం), అంకాళ్ళ ప్రభుదాసు (గుంటూరు), గుండపనేని శ్రీనివాసరావు, బొర్రా అశోక్ కుమార్ (కృష్ణా) తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *