విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న కాలనీలలో నిర్మించే ఒక్కో ఇంటికి రూ.5 లక్షల చొప్పున ఇవ్వాలని, టిడ్కో గృహ సముదాయాలకు మౌలిక వసతులు కల్పించి, తక్షణమే లబ్దిదారులకు స్వాధీనపరచాలని డిమాండ్ చేస్తూ నేటి నుండి (జనవరి 17వ తేదీ) రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో సిపిఐ ఆధ్వర్యంలో లబ్దిదారుల సమావేశాలు నిర్వహించి, లబ్దిదారులచే అర్జీలపై సంతకాల సేకరణ జరపాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పిలుపునిచ్చారు.
ఈ మేరకు కె.రామకృష్ణ నేడొక ప్రకటన విడుదల చేశారు. పేదల కోసం ఇళ్లస్థలాలు కేటాయించి, ఆయా స్థలాలలో జగనన్న కాలనీల పేరుతో ఇళ్లను నిర్మిస్తామని రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రకటించింది. కాని తదుపరి జగనన్న కాలనీలలో లబ్దిదారులే గృహ నిర్మాణాలు చేపట్టాలని ప్రభుత్వం ఒక్కో లబ్దిదారునికి రూ.1.80 లక్షలు ఇస్తుందని చెబుతోంది. ఆయా స్థలాలలో వెంటనే ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని, లేనిపక్షంలో లబ్దిదారుల పట్టాలను రద్దు చేస్తామని బెదిరిస్తోంది.
ఒక కుటుంబానికి ఏమాత్రం నివాసయోగ్యంకాని విధంగా కేవలం సెంటు స్థలం కేటాయించారు. పట్టణాలకు, పని ప్రాంతాలకు సుదూరంగా కొండలు, గుట్టలు, చెరువులు, ముంపు ప్రాంతాలలో పేదలకు ఇళ్లస్థలాలను కేటాయించడంతో ఆయా ప్రాంతాలలో ఇళ్లు నిర్మించుకునేందుకు లబ్దిదారులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పట్టణ ప్రాంతాలలో రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతాలలో 3 సెంట్ల చొప్పున ఇళ్లస్థలాలు కేటాయించాలని సిపిఐ డిమాండ్ చేసినప్పటికీ జగన్ సర్కార్ పెడచెవిన పెట్టింది. జగనన్న కాలనీలలో రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్, త్రాగునీటి సౌకర్యం వంటి మౌలిక సదుపాయాలు ఇప్పటివరకూ కల్పించలేదు. ఒక్కో ఇంటికి ప్రభుత్వం ఇచ్చే రూ.1,80,000లు ఏమాత్రం సరిపోక లబ్దిదారులు అగమ్యగోచరంలో కొట్టుమిట్టాడుతున్నారు. కనుక ఒక్కో ఇంటికి రూ.5 లక్షల చొప్పున ఇవ్వాలని సిపిఐ డిమాండ్ చేస్తున్నది.
అలాగే రాష్ట్ర వ్యాప్తంగా నిర్మితమైన లక్షలాది టిడ్కో గృహాలను ఇంతవరకు లబ్దిదారులకు స్వాధీనపరచకుండా జగన్మోహనరెడ్డి ప్రభుత్వం తాత్సార వైఖరి అవలంభిస్తున్నది. గూడు సమకూరుతుందన్న ఆశతో అప్పులు తెచ్చి డిపాజిట్లు కట్టిన లబ్దిదారులు గత మూడున్నళ్లుగా టిడ్కో ఇళ్ల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. తక్షణమే టిడ్కో గృహ సముదాయాలకు మౌలిక సదుపాయాలు కల్పించి, టిడ్కో ఇళ్లను లబ్దిదారులకు స్వాధీనపరచాలని డిమాండ్ చేస్తున్నది.
జగనన్న కాలనీలలో ఇళ్ల నిర్మాణానికి ఒక్కో ఇంటికి రూ.5 లక్షల చొప్పున ఇవ్వాలని, టిడ్కో ఇళ్లను వెంటనే లబ్దిదారులకు స్వాధీనపరచాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో జనవరి 17వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలోని మండల, పట్టణ, నగర స్థాయిలలో లబ్దిదారుల సమావేశాలు నిర్వహించి, లబ్దిదారులచే సంతకాలు సేకరించి, సంతకాలతో కూడిన అర్జీలను జిల్లా కలెక్టర్లకు, సంబంధిత అధికారులకు సమర్పించాలని పిలుపునిస్తున్నామన్నారు.
Prajavartha Online Telugu News