-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
-32 వ డివిజన్ 229 వ వార్డు సచివాలయ పరిధిలో రెండో రోజు గడప గడపకు మన ప్రభుత్వం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి గారి ఆశయాలను నెరవేరుస్తూ.. ప్రతి పేదవాడికి మేలు చేకూర్చడమే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. గురువారం 32 వ డివిజన్ 229 వ వార్డు సచివాలయ పరిధిలో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ డివిజన్ ఇంఛార్జి గుండె సుందర్ పాల్, అధికారులతో కలిసి ఆయన పాల్గొన్నారు. సాయిబాబా టెంపుల్ రోడ్డు, తిరుపతయ్య వీధి, పసుపులేటి వారి వీధి, డొంక రోడ్డులో విస్తృతంగా పర్యటించి 257 ఇళ్లను సందర్శించారు. మూడున్నరేళ్లలో ప్రభుత్వం చేసిన మంచితో పాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాసిన లేఖను లబ్ధిదారులకు వివరించారు. గత చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమై ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని మల్లాది విష్ణు అన్నారు. కానీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 99శాతం ఎన్నికల హామీలను అమలు చేసినట్లు పేర్కొన్నారు. ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. తన దృష్టికి వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సైడ్ కాలువలలో ఎప్పటికప్పుడు పూడికను తొలగించాలని వీఎంసీ సిబ్బందిని ఆదేశించారు. అవసరమైన చోట స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయవలసిందిగా అధికారులకు సూచించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
ఎన్టీఆర్ పేరు ఉచ్ఛరించే నైతిక అర్హత వెన్నుపోటుదారులకు లేదు
స్వర్గీయ ఎన్టీఆర్ పేరును స్మరించే హక్కు చంద్రబాబుకు లేదని మల్లాది విష్ణు విమర్శించారు. అధికారం లేనప్పుడు మాత్రమే బాబుకు రామారావు గారు గుర్తొస్తారని ఆరోపించారు. మనుషుల్ని వాడుకోవడం ప్రతిపక్షనేతకు వెన్నతో పెట్టిన విద్య అని.. చంద్రబాబు కారణంగా ఆనాడు ఎన్టీఆర్ మానసికక్షోభ అనుభవించారని గుర్తుచేశారు. ఆయన కష్టపడి స్థాపించిన పార్టీని లాక్కుని, చివరకు ఆ మహనీయుని మరణానికి కారకుడయ్యారని గుర్తుచేశారు. అటువంటి నమ్మకద్రోహి నాయకత్వంలో పనిచేస్తున్న తెలుగుదేశం నేతలకు ఎన్టీఆర్ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని ఉద్ఘాటించారు. చంద్రబాబు రాజకీయ జీవితమంతా వెన్నుపోటులు, కుట్ర కోణాలేనని.. ఎన్టీఆర్ ఆఖరి మాటలే ఇందుకు నిదర్శనమన్నారు. కానీ ఇచ్చిన మాట ప్రకారం జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టి.. ఆయనపై సీఎం వైఎస్ జగన్ తన గౌరవాన్ని చాటారని మల్లాది విష్ణు పేర్కొన్నారు.
చంద్రబాబు పచ్చి అబద్ధాలకోరు
ప్రతిపక్ష నేత చంద్రబాబు పచ్చి అబద్ధాలకోరని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మల్లాది విష్ణు విమర్శించారు. వ్యవస్థలను నాశనం చేసిన విధ్వంసకారుడు అని దుయ్యబట్టారు. జన్మభూమి కమిటీలతో రాష్ట్రాన్ని అవినీతిమయం చేసి.. పైగా 500 నోట్లు, 2000 నోట్లు అంటూ నిస్సిగ్గుగా దిగజారి మాట్లాడుతున్నారని నిప్పులు చెరిగారు. 2019 ఎన్నికల సమయంలోనూ ఇంతకన్నా ఎక్కువే అవాస్తవాలను చంద్రబాబు ప్రచారం చేశారని గుర్తుచేశారు. మరలా ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ కు ప్రజల్లో ఆదరణ రావడం చూసి తట్టుకోలేక కుటిల రాజకీయాలకు తెరదీస్తున్నారన్నారు. ఎలాగైనా ప్రజల నుండి సానుభూతిని పొందాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారన్నారు. తన పబ్లిసిటీ పిచ్చి కోసం మనుషులు చనిపోయినా పర్వాలేదనే రీతిలో ప్రతిపక్షనేత ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. కందుకూరు, గుంటూరు మరణాలను బాధ్యత వహించాల్సింది పోయి.. పోలీసులపై నెట్టే ప్రయత్నం చేయడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబులో అహంకారం తారాస్థాయికి చేరిందని దుయ్యబట్టారు. ఇప్పటికే 2019 ఎన్నికల్లో ప్రజలు టీడీపీకి తిరుగులేని గుణపాఠం నేర్పించారని మల్లాది విష్ణు గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో అంతకంటే దారుణమైన ఫలితాలను తెలుగుదేశం నేతలు చవిచూడబోతున్నారని స్పష్టం చేశారు. కార్యక్రమంలో డీఈలు గురునాథం, రామకృష్ణ, సిడిఓ జగదీశ్వరి, నాయకులు ఒగ్గు గవాస్కర్, జి.వెంకటేశ్వరరెడ్డి, ఆదిరెడ్డి, శ్యామ్, లింగాల శ్రీనివాసరావు, గణేష్, శివన్న, త్రివేణిరెడ్డి, శ్రీను, జగన్, సురేష్, బెజ్జం రవి, భోగాది మురళి, ఇతర నాయకులు, అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News