-లైన్స్ క్లబ్ సహకారంతో నగరం సుందరీకరణకు చర్యలు.
-జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సామాజిక సేవా కార్యక్రమాలలో ముందుండే లైన్స్ క్లబ్ అంధ విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ముందుకు రావడం అభినందనీయమని, నగరాన్ని సుందరీకరించి పర్యావరణ పరిరక్షణలో లైన్స్ క్లబ్ సభ్యులు భాగస్వామ్యం అవసరమని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అన్నారు.
లైన్స్‌క్లబ్ ఆఫ్ విజయవాడ మెగా సిటి సహకారంతో 2.5 లక్షల రూపాయల వ్యయంతో గుణదల విజయమేరీ ఇంటిగ్రేటెండ్ అంధ విద్యార్థుల పాఠశాలలో ఏర్పాటు చేసిన రక్షిత మంచినీటి (ఆర్‌వో) పథకాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సామాజిక సేవాకార్యక్రమంలో లైన్స్ క్లబ్ ఎల్లప్పుడు ముందుంటుందన్నారు. అంధ విద్యార్ధుల ఆరోగ్యాన్ని పరిరక్షించాలనే ఆలోచనతో రక్షిత మంచినీటి (ఆర్‌వోప్లాంట్) సౌకర్యాన్ని కల్పించడం అభినందనీయమన్నారు. సమస్థ జీవకోటికి జీవనాధారం నీరే ఆధారం అన్నారు. మానవ శరీరానికి 70 శాతం నీరు ఉండలన్నారు. రోజు కనీసం 4 నుంచి 5 లీటర్ల సురక్షిత త్రాగునీటిని ప్రతి వ్యక్తి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుత పరిస్థితులలో అవసరాలకు మించి ఎరువులు పురుగుమందులు వాడడం, పరిశ్రమల నుండి వెలువడే వ్యర్థాలు, ఎలక్ట్రానిక్ వ్యర్థాల వలన నీరు కలుషితమై ప్రజల ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయన్నారు. కలరా, డయేరియా, టైఫాయిడ్ వంటి అంటువ్యాధులు అధిక శాతం కలుషితమైన నీటివలనే సంభవిస్తాయన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు స్వచ్చంద సంస్థల సహకారం ఎంతో అవసరం అన్నారు. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా పాఠశాలలను అభివృద్ధి పరిచి సురక్షితమైన త్రాగునీటిని అందింస్తున్నామన్నారు. కాలుష్య నివారణకు పచ్చదనం పరిశుభ్రత ప్రధానమన్నారు. నగరాన్ని సుందరీకరించి పచ్చని మొక్కలతో ఆహ్లదకరమైన వాతావరణాన్ని కల్పించడంతో పాటు కాలుష్యనివారణకు చర్యలు తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు. లైన్స్ క్లబ్ సభ్యులు ముందుకు వచ్చి పర్యావరణ పరిరక్షణకు చేపట్టే కార్యక్రమాలలో భాగస్వామ్యులు కావాలని కోరారు. ఇప్పటికే లైన్స్‌క్లబ్ ఆఫ్ విజయవాడ మెగా సిటి ఇ`వేస్ట్ మేనేజ్‌మెంట్‌లో భాగస్వామ్యులై ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సేకరించి కాలుష్యనివారణకు కృషి చేస్తున్నారన్నారు. లైన్స్ క్లబ్ సేవలను స్పూర్తిగా తీసుకుని స్వచ్చంద సంస్థలు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ డిల్లీరావు పిలుపునిచ్చారు.
లైన్స్ క్లబ్ పాస్ట్ డిస్టిక్ట్ గవర్నర్ డా. పుట్టగుంట సతీష్‌కుమార్ మాట్లాడుతూ లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇప్పటివరకు అనేక సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందన్నారు. ప్రకృతి వైపరీత్యాలు, విపత్కర పరిస్థితులు సంభవించినప్పుడు ప్రజలకు సేవలందించడం జరిగిందన్నారు. కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో జిల్లా వ్యాప్తంగా ప్రజలకు కరోనా వ్యాక్సిన్ ఉచితంగా అందించడంతో పాటు కరోనా వ్యాధి గ్రస్తులకు పౌష్టికాహారం, మందులను పంపిణీ చేయడం జరిగిందన్నారు. జిల్లా యంత్రాంగం కోరిన వెంటనే విద్యా వైద్య రంగం అభివృద్ధికి, ప్రజలకు అవసరమైన సేవలందించేందుకు లైన్స్ క్లబ్ ఎల్లప్పుడు సిద్దంగా ఉంటుందని ఆయన తెలిపారు.
తొలుత అంధ విద్యార్థినిలు మానస, బింధులు బ్రెయిలీ లిపిలో నీటి ప్రాముఖ్యత విశిష్టతను చదివి వినిపించిన తీరు, కుమారి అలేఖ్య సాంప్రదాయ నృత్యం, విద్యార్ధులు ఆలపించిన దేశభక్తి గీతాలు, నృత్యాలు ఆహాతులను హత్తుకున్నాయి.
కార్యక్రమంలో లైన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ మెగా సిటి ప్రతినిధులు దామెర్ల శ్రీశాంతి, లింగం శివశంకర్, వైపిసి ప్రసాద్, మిరియాల వెంకటేశ్వరరావు, ఏ కోటిరెడ్డి, కె. శ్రీనివాసరావు, డి. గోపినాధ్, ఎస్ కృష్ణమోహన్, ఎన్.దిలీప్ కుమార్, కె. విజయకృష్ణ, గద్దె శేషగిరి, గుండపు చంద్రశేఖర్, విజయ మేరీ అంధుల పాఠశాల కరస్పాండెంట్ డా. అమల, స్థానిక తహాశీల్థార్ సిహెచ్ దుర్గాప్రసాద్, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News