– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
-23 వ డివిజన్ 93 వ వార్డు సచివాలయ పరిధిలో మూడో రోజు గడప గడపకు మన ప్రభుత్వం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ లక్ష్యమని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. శనివారం 23 వ డివిజన్ 93 వ వార్డు సచివాలయం పరిధిలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ డివిజన్ ఇంఛార్జి ఆత్మకూరు సుబ్బారావు, కోఆర్డినేటర్ ఒగ్గు విక్కీతో కలిసి ఆయన పాల్గొన్నారు. దాసరి వారి వీధిలో విస్తృతంగా పర్యటించి 107 ఇళ్లను సందర్శించారు. ప్రతి ఇంటి వద్ద ప్రజలు వారికి ఘనంగా స్వాగతం పలికారు, దుశ్శాలువలతో సత్కరించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరిపాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని మల్లాది విష్ణు చెప్పారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. ఈ సందర్భంగా స్థానిక సమస్యలపై ఆరా తీశారు. దాసరి వారి వీధిలో కొంతమేర దెబ్బతిన్న రోడ్డు పున:నిర్మాణానికి అంచనాలు సిద్ధం చేయవలసిందిగా ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. గత తెలుగుదేశం హయాంలో కార్పొరేటర్ నుంచి ముఖ్యమంత్రి వరకు వారి పాలకులే ఉన్నప్పటికీ ఈ ప్రాంతాన్ని పూర్తి నిర్లక్ష్యం చేశారని మల్లాది విష్ణు విమర్శించారు. కానీ ఈ ప్రభుత్వంలో రూ. కోట్లాది నిధులతో డివిజన్ ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నట్లు తెలియజేశారు.
కష్టజీవులకు తోడుగా ‘జగనన్న చేదోడు’
పర్యటనలో భాగంగా టైలరింగ్ చేస్తున్న అక్కచెల్లెమ్మలతో మల్లాది విష్ణు ముచ్చటించారు. జగనన్న చేదోడు పథకం ద్వారా రజక, నాయీబ్రాహ్మణ, దర్జీ అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ముల ఆత్మవిశ్వాసాన్ని ఈ ప్రభుత్వం మరింత పెంచిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో మొదటి, రెండు విడతలు కలిపి 2,021 మందికి రూ. 3 కోట్ల వరకు లబ్ధి చేకూర్చడం జరిగిందన్నారు. మూడో విడతకు సంబంధించి అర్హత ఉన్న ప్రతిఒక్కరికీ త్వరలోనే వారి వారి వ్యక్తిగత ఖాతాలలో నగదు జమ చేయడం జరుగుతుందని తెలియజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
నారాలోకేష్ నోరు అదుపులో పెట్టుకో
టీడీపీ నేత నారాలోకేష్ నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మల్లాది విష్ణు సూచించారు. 151 అసెంబ్లీ స్థానాలలో తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వచ్చిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గూర్చి మాట్లాడే నైతిక అర్హత.. దొడ్డిదారిన ఎమ్మెల్సీ, మంత్రి అయిన లోకేష్ కి ఎక్కడిదని ప్రశ్నించారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఉన్న మంగళగిరిలోనే చిత్తుగా ఓడిపోయినా లోకేష్ తీరు మారలేదన్నారు. టీడీపీ హయాంలో వేల కి.మీ.రోడ్లు., లక్షలాది వీధిదీపాలు ఏర్పాటు చేసుంటే.. తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఎందుకు కనుమరుగైందో నారా లోకేష్ సమాధానం చెప్పాలన్నారు. పైగా ఎన్నికల మేనిఫెస్టోను మాయం చేసిన మీరు.. యూత్ మేనిఫెస్టోను తీసుకువస్తామని ప్రగల్భాలు పలకడం హాస్పాస్పదమన్నారు. కేవలం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలనను చూసి ఓర్వలేనితనంతో టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. యువగళం, వారాహి రెండూ ఒకటేనని నారా లోకేష్ మాటలలో మరోసారి స్పష్టమైందని మల్లాది విష్ణు అన్నారు. చంద్రబాబు, పవన్, లోకేష్ వక్రంగా ఆలోచిస్తున్నారని.. ప్రజా సమస్యల కన్నా ముఖ్యమంత్రి పీఠమే వారికి ముఖ్యమని ఆరోపించారు. 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు గూర్చి, నారాలోకేష్ గూర్చి పవన్ ఏం మాట్లాడారో ఒక్కసారి గుర్తుచేసుకోవాలని తెలిపారు. సీఎం జగన్ ను ఒంటరిగా ఎదుర్కొనే సత్తా బాబు, పవన్ లకు ఏమాత్రం లేదని.. వచ్చే ఎన్నికల్లో ఎవరు ఎవరితో కలిసి వచ్చినా 175 స్థానాలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపు తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు చల్లా సుధాకర్, వెన్నం రత్నారావు, పసుమర్తి రాజేష్, ఆత్మకూరి వెంకట అప్పారావు, కొల్లిపర శ్రీను, చాందిని, ఇతర నాయకులు, అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News