గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న లే అవుట్స్ లో ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని, లబ్దిదారుల బ్యాంక్ అకౌంట్స్ ఓపెనింగ్ త్వరగా పూర్తి చేయాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఇంజినీరింగ్, హౌసింగ్ అధికారులు, ఎమినిటి కార్యదర్శులను ఆదేశించారు. శనివారం కమిషనర్ పేరేచర్లలోని జగనన్న లే అవుట్ లో నగరపాలక సంస్థ ఇంజినీరింగ్, హౌసింగ్ అధికారులతో కలిసి ఇళ్ళ నిర్మాణ పనుల వేగవంతం పై తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జగనన్న లేఅవుట్స్ లో లబ్దిదారులు ప్రతి ఒక్కరూ ఇంటి నిర్మాణం చేసుకోవాలని, అందుకు తగిన తోడ్పాటుని నగరపాలక సంస్థ నుండి అందిస్తామని తెలిపారు. ప్రతి లబ్దిదారులు బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్ చేసుకోవాలని, ఇప్పటికే బ్యాంక్ ప్రతినిధులు అకౌంట్ ఓపెనింగ్ కు అందుబాటులో ఉన్నారన్నారు. ఎమినిటి కార్యదర్శులు బ్యాంక్ అకౌంట్స్ ఓపెనింగ్ కు ఇతర కార్యదర్శులతో సమన్వయం చేసుకోవాలన్నారు. ఇళ్ళ నిర్మాణ కాంట్రాక్టర్లు పనులు వేగంగా చేయాలని, మార్కింగ్, బిల్స్ ప్రాసెస్ ఎమినిటి కార్యదర్శులు ఎప్పటికప్పుడు చేస్తారన్నారు. కాంట్రాక్టర్ తప్పనిసరిగా ప్రతి రోజు నిర్దేశిత లక్ష్యానికి తగిన విధంగా పనులు చేయాలని, రోజువారి నివేదిక ఎప్పటికప్పుడు తమకు అందించాలన్నారు. ఎమినిటి, ప్లానింగ్ కార్యదర్శులను, వి.ఆర్.ఓ.లను అవసరం మేరకు లే అవుట్స్ కు విధులు కేటాయిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని అదనపు కమిషనర్ ని ఆదేశించారు. ఎమినిటి కార్యదర్శులకు లబ్దిదారుల మ్యాపింగ్, వివరాల సేకరణ, ఆన్ లైన్ కోసం అడ్మిన్, వెల్ఫేర్, ఎడ్యుకేషన్ కార్యదర్శులు మరియు సచివాలయ వాలంటీర్లు సహకరించాలని స్పష్టం చేశారు. లే అవుట్ లో ఎక్కడైనా విద్యుత్ స్థంబాల అవసరం ఉంటే ముందే సదరు శాఖ అధికారులకు తెలియచేయాలన్నారు. కమిషనర్ లబ్దిదారులను ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి స్వంత ఇళ్లు ఉండాలనే బృహత్ ఆశయంతో ఇళ్ళ స్థలాల పంపిణి చేసిందని, అందుకు అనుగుణంగా ఇంటి స్థలం పొందిన లబ్దిదారులు తప్పనిసరిగా ఇంటి నిర్మాణం చేసుకోవాలన్నారు. ఇళ్ళ నిర్మాణ సమయంలోనే మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
పర్యటనలో నగరపాలక సంస్థ ఎస్.ఈ. భాస్కర్, ఈ.ఈ. సుందర్రామిరెడ్డి, డి.ఈ.ఈ. రమేష్ బాబు, హౌసింగ్ ఈ.ఈ. శంకర్రావు, డి.ఈ.ఈ.లు, ఏ.ఈ.లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News