-జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అహింసా, సత్యాగ్రహాలే ఆయుధాలుగా దేశానికి స్వేచ్ఛ స్వాతంత్రాలను అందించిన మహనీయుడు జాతి పిత మహాత్మాగాంధీ చూపిన మార్గంలో పయనించి ప్రజలకు సేవలందిద్దామని జిల్లా కలెక్టర్ డిల్లీరావు అన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ 75వ వర్థంతి అమరవీరుల దినోత్సవ సందర్భంగా సోమవారం కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ డిల్లీరావు, జాయింట్ కలెక్టర్ ఎస్ నుపూర్ అజయ్, డిఆర్వో కె. మోహన్‌కుమార్, అధికారులు జాతిపిత మహాత్మాగాంధీ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జాతి సమగ్రతను ఐక్యతను నిలిపేందుకు గాంధీ అనుసరించిన మార్గం అందరికీ ఆదర్శంగా నిలుస్తుందన్నారు. నిత్యం అహింసాయుత మార్గంలో సత్యమే పరమావధిగా జీవించిన మహనీయుడు మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్యానికి బాటలు వేశారన్నారు. సర్వజన హితమే నామతమని, అంటరానితనాన్ని నిర్మూలనకే నా జీవితం అంకితమని మహాత్మాగాంధీ తరచు అనేకసార్లు తన మనోభావాలను పంచుకున్నారన్నారు. ఆయన చూపిన మార్గంలో పయనించి ప్రజలకు పారదర్శకమైన సేవలందించి కృషి చేద్దామన్నారు. పేద బలహీన వర్గాల ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలను అందించి వారిని ఆర్థికంగా బలోపేతం చేయడం ద్వారా బాపుజీ ఆశయాలను నేరవేద్దామని జిల్లా కలెక్టర్ డిల్లీరావు అన్నారు.
Prajavartha Online Telugu News