
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మహాత్మా గాంధీ కలలు కన్న స్వరాజ్యం భారతదేశంలో రావాలని గాంధీ దేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ అధ్యక్షులు గాంధీ నాగరాజన్ ఆకాంక్షించారు. గాంధీ వర్ధంతి సందర్భంగా సోమవారం 43వ డివిజన్ ఊర్మిళా నగర్ లోని గాంధీ దేశం ట్రస్ట్ కార్యాలయం వద్ద ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి అక్కడ నుంచి విజయవాడ నగరంలోని ప్రధాన రహదారులలో గాంధీ నాగరాజన్ కళ్ళకు గంతలు కట్టుకొని పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ రాజకీయ పార్టీ నాయకులు పదవుల కోసం పోరాడుతున్నారని, ప్రజాస్వామ్యం కోసం పోరాడాలని కోరారు. మహాత్మా గాంధీని అత్యంత కిరాతకంగా చంపిన ఘనత ఆర్ఎస్ఎస్ దేనని పేర్కొన్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని, ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. భారతదేశ స్వాతంత్రం కోసం నిరంతరం పాటుబడిన మహాత్మా గాంధీ కలలుగన్న స్వాతంత్ర్య ఫలాలు దేశంలోని ప్రజలందికీ దక్కాలని అన్నారు. ప్రజలందరూ సుఖశాంతులతో నివసించడానికి కావలసిన చర్యలు కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాలని సూచించారు. దేశంలోని ప్రజలందరూ ఐక్యతతో పోరాడాలని, మహాత్మా గాంధీ ఆశయాలను ఎవరైతే నెరవేరుస్తామని హామీ ఇస్తారో వారికి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. గాంధీ నాగరాజన్ పాదయాత్రలో ట్రస్టు రాష్ట్ర అధ్యక్షురాలు బంగారు భారతి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News