-ఘనంగా శత జయంతి వేడుకలు, వెబ్‌సైట్, ప్రత్యేక సంచిక ఆవిష్కరణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా వారి చరిత్ర భావితరాలకు స్ఫూర్తి కావాలనే ఉద్దేశ్యంతో ఓ బృహత్తర కార్యక్రమాన్ని మొదలు పెట్టామని మాజీ ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ రాజకీయ కార్యదర్శి టి.డి జనార్దన్ తెలిపారు. శనివారం బందరురోడ్డు, బాలోత్సవభవన్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో ఎన్.టి.ఆర్ శత జయంతి కమిటీ చైర్మన్ జనార్దన్ మీడియాతో మాట్లాడుతూ ఎన్.టి.రామారావు సినిమా రంగంలో ఎన్నో చిరస్మరణీయమైన పాత్రలను పోషించి తెలుగు వారి ఆరాధ్య నటుడుగా నీరాజనాలందుకున్నారు, ముఖ్యమంత్రిగా ఆయన ప్రారంభించిన పథకాలతో ప్రజానాయకుడుగా జేజేలందుకున్నారు. వారు తెలుగునాట మాత్రమే కాదు, భారత రాజకీయాలలో కూడా క్రియాశీలకమైన పాత్ర పోషించి, జాతీయ నాయకుడుగా ప్రతిపక్షాలను ఏకత్రాటి మీదకు తెచ్చిన దూరదృష్టి కల నాయకుడు, ఆయన స్ఫూర్తిమంతమైన జీవితం ఎప్పటికీ తెలుగువారికి మార్గదర్శకం కావాలనే ఉద్ధేశ్యంతో మా కమిటీ ఈ బృహత్తర కార్యక్రమానికి రూపకల్పన చేసిందన్నారు. రామారావు సినిమా ప్రస్థానం, రాజకీయ, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన సమగ్రమైన సమాచారంతో ఎన్.టి.ఆర్ వెబ్‌సైట్ రూపకల్పన జరుగుతోందన్నారు. అలాగే రామారావు శాసనసభలో చేసిన ప్రసంగాలు, చారిత్రక ప్రసంగాలతో మరో రెండు పుస్తకాలు కూడా ప్రచురిస్తున్నామని తెలిపారు. నటుడుగా మూడున్నర దశాబ్దాలలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో 300 చిత్రాలలో విభిన్నమైన పాత్రల్లో నటించారన్నారు. రాయలసీమ కరువు, చైనా యుద్ధం, దివిసీమ ఉప్పెనలాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, దేశరక్షణ కోసం నిధులు సమకూర్చడానికి సహా నటీనటులతో కలసి విరాళాలు సేకరించారన్నారు. ఎన్.టి.ఆర్. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చరిత్రను సృష్టించాయన్నారు. ఎన్.టి.ఆర్ ఘన కీర్తిని చాటే విధంగా విజయవాడ, హైదరాబాద్‌లో తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా రెండు కార్యక్రమాలను ఏర్పాటుచేస్తున్నామని, తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు, ఇతర జాతీయ నాయకులు, సినిమారంగ ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొంటారని జనార్దన్ తెలిపారు. ఈ కమిటీలో సీనియర్ నాయకులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారన్నారు. ఈ ప్రయత్నానికి అభిమానులు, వారితో సాన్నిహిత్యం ఉండి, మర్చిపోలేని సంఘటనలు, అపురూమైన ఫోటోలు ఎవరి దగ్గర వున్నా తమకు tdjanardhan@gmail.com మెయిల్ లేదా 9866178085 మొబైల్ నెంబర్‌కి వాట్సప్ యాప్ పంపించాలని మీడియా ద్వారా జనార్దన్ విజ్ఞప్తిచేశారు.
Prajavartha Online Telugu News