Breaking News

సీఎం జగన్ ప్రభుత్వానికి మరే ప్రభుత్వం సాటిరాదు

-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
-గవర్నర్ పేటలో అట్టహాసంగా గడప గడపకు మన ప్రభుత్వం 150 రోజుల విజయోత్సవ వేడుకలు
-కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్న పార్టీ శ్రేణులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడున్నరేళ్ల సంక్షేమ, అభివృద్ధి పాలనకు చంద్రబాబు 14 ఏళ్ల అనుభవం ఏమాత్రం సాటిరాదని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం 150 రోజుల విజయోత్సవ వేడుకలు గవర్నర్ పేటలోని స్వాతంత్ర సమరయోధుల భవనంలో సోమవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, వైఎస్సార్ సీపీ డివిజన్ ఇంఛార్జి ఆత్మకూరు సుబ్బారావు, కోఆర్డినేటర్ ఒగ్గు విక్కీతో కలిసి మల్లాది విష్ణు పాల్గొన్నారు. పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు. తొలుత 98వ సచివాలయ పరిధిలోని రాజగోపాలచారి వీధి, అలీబేగ్ వీధి, డి.టి.రావు వీధి, మేరీ వీధి, క్యానం వారి వీధి, కాజా పున్నయ్య వీధి, మసీదు వీధి, అట్టారత్తయ్యవీధి, గోపువారి వీధి, గూడవల్లి వారి వీధి, బందర్ రోడ్డు, గోపాలరెడ్డి రోడ్డులలో అధికారులు, ప్రజాప్రతినిధులు విస్తృతంగా పర్యటించి 307 గడపలను సందర్శించారు. ప్రజల యోగక్షేమాలపైనే అనుక్షణం దృష్టి సారిస్తూ వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకుంటున్నట్లు మల్లాది విష్ణు వెల్లడించారు. గవర్నర్ పేట అంటేనే వ్యాపార సముదాయాలకు కేంద్ర బిందువని.. అటువంటి ప్రాంత అభివృద్ధిని గత తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని మల్లాది విష్ణు అన్నారు. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కనీవినీ ఎరుగని రీతిలో ప్రాంత రూపురేఖలు మార్చడం జరిగిందన్నారు. అలాగే టీడీపీ కార్పొరేటర్లు ఉన్న ప్రతిఒక్క డివిజన్ ను మూడున్నరేళ్లలో అభివృద్ధికి కేరాఫ్ గా మార్చామని.. వైఎస్సార్ సీపీ అభ్యర్థులను ఎందుకు గెలిపించుకోలేకపోయామనే భావన ప్రజలలో స్పష్టంగా కనిపించిందన్నారు.

ప్రజా సమస్యల తక్షణ పరిష్కారమే లక్ష్యం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచనల మేరకు నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని.. ఇందులో అధికారులు, ప్రజాప్రతినిధులు, సచివాలయ ఉద్యోగుల పాత్ర అభినందనీయమని మల్లాది విష్ణు అన్నారు. ముఖ్యంగా 54 సచివాలయాల పరిధిలో.. 51,105 ఇళ్లను సందర్శించినప్పుడు ప్రజల నుంచి లభించిన స్పందన అపూర్వమన్నారు. ఈ 150 రోజుల్లో దీర్ఘకాలంగా పెండింగ్ ఉన్న అనేక స్థానిక సమస్యలకు పరిష్కారం లభించిందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేయడం ఒక అదృష్టంగా భావిస్తూ.. వాలంటీర్లందరూ ప్రజలకు నిస్వార్థంగా సేవలందిస్తున్నారని మల్లాది విష్ణు పేర్కొన్నారు. కోవిద్ సమయంలో బయటకు రావాలంటేనే భయపడుతున్న సమయంలో.. వీరంతా ప్రాణాలకు తెగించి ప్రజలకు సేవలందించారన్నారు. కరోనా టెస్టులు నిర్వహించడం, వ్యాక్సినేషన్, డోర్ టూ డోర్ ఫీవర్ సర్వే ఎప్పటికప్పుడు పూర్తిచేయడంతో.. ప్రభుత్వ పనితీరు పట్ల ప్రధాని సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారన్నారు. అదే రీతిన పనిచేసి కన్వీనర్లు, గృహ సారథులు సైతం మంచిపేరు తెచ్చుకోవాలని సూచించారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ అంతిమ లక్ష్యం ప్రజా సమస్యల తక్షణ పరిష్కారం తప్ప అధికారాన్ని అనుభవించడం ఏమాత్రం కాదని పునరుద్ఘాటించారు.

రౌడీలు, గూండాలను ప్రేరేపించేలా లోకేష్ వ్యాఖ్యలు
యువగళం ఒక అట్టర్ ఫ్లాప్ యాత్ర అని నారాలోకేష్ ఇప్పటికే గ్రహించారని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మల్లాది విష్ణు విమర్శించారు. దీంతో ఫ్ట్రస్టేషన్లో రాష్ట్రంలో అల్లర్లు, రౌడీయిజాన్ని ప్రోత్సహించేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అధికారంలోకి వస్తే కేసులు మాఫీ చేస్తామంటూ లోకేష్ వ్యాఖ్యానించడం దేనికి సంకేతమన్నారు. రౌడీలు, గూండాలను ప్రేరేపించేలా టీడీపీ నేతల మాటలు ఉన్నాయని ఆరోపించారు. అలాగే పెట్టుబడుల ఆకర్షణలోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దూసుకువెళుతుంటే.. ఓర్వలేక విమర్శలు గుప్పిస్తున్నారని నిప్పులు చెరిగారు. ప్రతిఒక్క పారిశ్రామిక సదస్సులోనూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తోన్న సహాయ సహకారాల గూర్చి, మన రాష్ట్రంలోని వనరుల గూర్చి పారిశ్రామికవేత్తలు కీర్తిస్తుంటే.. పచ్చ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. విపక్షాల త‌ప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అలుపెరుగని ప్రజా సంకల్ప పాదయాత్రతో 151 స్థానాలలో ఒంటి చేత్తో పార్టీని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలిపించుకున్నారని.. ఆ సంఖ్యను 175కి పెంచవలసిన బాధ్యత ప్రతిఒక్క కార్యకర్తపై ఉందని పిలుపునిచ్చారు.

బోండా ఉమా బహిరంగ చర్చకు సిద్ధమా..?
సెంట్రల్ నియోజకవర్గంలో పర్యటించే కనీస అర్హత బోండా ఉమాకు లేదని నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా వ్యాఖ్యలపై సోమవారం ఆమె తీవ్రంగా స్పందించారు. ఎవరి హయాంలో నియోజకవర్గం అభివృద్ధి పథంలో పయనిస్తుందో ప్రజల మధ్యనే బహిరంగ చర్చకు రావాలని సవాలు విసిరారు. కేవలం ఎమ్మెల్యే మల్లాది విష్ణు చొరవతో 58వ డివిజన్ పరిధిలో రూ. 22 కోట్ల విలువైన అభివృద్ధి పనులు మంజూరయ్యాయని.. పనులు శరవేగంగా జరుగుతున్నట్లు వివరించారు. టీడీపీ నేతలు కేవలం నాలుకపై లెక్కలు చెప్పడం కాదని.. ధైర్యముంటే చర్చకు రావాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఈలు గురునాథం, రామకృష్ణ, ఏఎంఓహెచ్ రామకోటేశ్వరరావు, సీడీఓ జగదీశ్వరి, నాయకులు వెన్నం రత్నారావు, చల్లా సుధాకర్, పసుమర్తి రాజేష్, సీతాదేవి, కొల్లిపర శ్రీను, వడ్డీ వాసు, యర్రంశెట్టి అంజిబాబు, సీతాదేవి, చాందిని, ఇతర నాయకులు, అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *