Breaking News

33వ పుస్తక మహోత్సవం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పుస్తకం మనిషికి విజ్ఞానం, వినోదాన్ని అందించడంతో పాటు సరికొత్త ఆలోచన ప్రక్రియల ప్రపంచంలోకి తీసుకువెళుతుందని ప్రతి మనిషికి పుస్తకమే నిజమైన స్నేహితుడని ఏమి ఆశించకుండా జ్ఞానాన్ని మెరుగుపరుచుకునేందుకు దోహదపడుతుందని రాష్ట్ర గవర్నర్‌ బిశ్వ భూషణ్‌ హరిచందన్‌ అన్నారు.
విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నికల్‌ కళాశాల ఆవరణంలో విజయవాడ బుక్‌ ఫెస్టివల్‌ సోసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 33వ పుస్తక మహోత్సవాన్ని గురువారం సాయంత్రం రాష్ట్ర గవర్నర్‌ బిశ్వ భూషణ్‌ హరిచందన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రాష్ట్ర గవర్నర్‌ మాట్లాడుతూ పిల్లలను చిన్నతనం నుండి పుస్తక పఠనం పై ఆశక్తి కల్పించేలా తల్లిదండ్రులు కృషి చేయాలన్నారు. పుస్తకాలు చదివే కొద్ది జ్ఞానవంతులు అవుతారన్నారు. పుస్తకం చదవడం మెదడకు వ్యాయామం వంటిదని, జ్ఞాపకశక్తిని మెరుగుపరిచి దృష్టికేంద్రీకత సామర్థ్యాన్ని పెంచుతుందని మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు ఎంతో దోహదపడుతుందన్నారు. పుస్తక మహోత్సవంలో 200 పైగా ప్రచురణ సంస్థలు అతి ప్రాముఖ్యమైన ప్రచురణలను ఉంచడం పాఠకులను మంత్ర ముగ్దులను చేస్తుందన్నారు. తెలుగు భాష ఔన్నత్యాన్ని సాజీవంగా నిలిపేందుకు పుస్తక ప్రచురణ సంస్థలు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. తనకు అనేక మంది విద్యావేత్తలు మరియు సాహిత్య ప్రముఖులు, రచితలతో సాన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నారు. విజయవాడకు చెందిన కవి సామ్రాట్‌ విశ్వనాధ్‌ సత్యనారాయణ రచించిన ‘‘వేయి పడగలు’’ పురాణ నవలకి భారతీయ అత్యున్నత సాహిత్య పురస్కారమైన జ్ఞానపీఠ అవార్డు దక్కడం మనందరికి గర్వకారణం అన్నారు. ఈ నవలను దివంగత మాజీ ప్రధాని పి.వి నరసింహారావు, హిందీ భాషలోకి అనువదించి సాహితీవేత్త గొప్పతనాన్ని చాటిచెప్పారన్నారు. ప్రముఖ అమెరికన్‌ రచయిత మార్క్‌ట్వైన్‌ చెప్పినట్లుగా పుస్తకాలు చదవని, చదవలేని వ్యక్తులు అప్రయోజకులుగా భావించాలన్నారు. పుస్తకం సామాజిక వికాసానికి తోడ్పడుతుందని, మహాభారతం, భగవద్గీత వంటి ఇతిహసాలు, స్వాతంత్య్ర ఉద్యమ పోరాటం, స్వాతంత్య్ర సమరయోదుల త్యాగాలపై ప్రచురించిన పుస్తకాలను తల్లిదండ్రులు తమ పిల్లలతో చదివించాలన్నారు. ఎమర్జెనీ కాలంలో జైలులో ఉన్నప్పుడు తదుపరి తాను పుస్తకాలు రాయడం ఒక అలవాటుగా చేసుకున్నానని, ఒడియా భాషలో రాణా ప్రతాప్‌ మారు బటాస్‌ వంటి రచనలను చేయడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ ఇతర భాషలను నేర్చుకునే ముందు తన మాతృభాషను ప్రేమించాలన్నారు. మాతృభాషలో స్నేహితులు కుటుంబ సభ్యులు సమాజంలోని ఇతరులతో మాట్లాడేటప్పుడు కమ్యూనికేషన్‌ పై ప్రభావితం చూపుతుందన్నారు. ప్రేమ, అభిరుచి, పెంపొందించేందుకు పుస్తకాలు ఉత్తమ సాధనాలవుతాయన్నారు. 32 సంవత్సరాల నిర్విరామంగా పుస్తక మహోత్సవాన్ని నిర్వహిస్తున్న వేలాదిమంది పాఠకుల అభిరుచులకు అనుగుణంగా పుస్తక ప్రచురణను ఒకే వేధికపైకి తీసుకువచ్చి ప్రదర్శన అమ్మకాలు నిర్వహిస్తున్న నిర్వహకుల ప్రతి ఒక్కరిని అభినందిస్తునన్నారు. విజయవాడ బుక్‌ ఫెస్టివల్‌ సోసైటీకి రావిక్రింది రామ స్వామి అందించిన సేవలకు గుర్తింపుగా ఈ ఏడాది మహోత్సవాలకు ఆయన నామకరణం చేయడం, ఆకాశవాణికి సాహిత్య సహకారం తెలుగు సినిమా రంగానికి రచయితగా నటుడుగా మారుతీరావు అందించిన సేవలకు గుర్తింపుగా ప్రధాన వేదికకు గొల్లపూడి మారుతీరావు వేదికగా నామకరణ చేయడం సంతోషదాయకమన్నారు.
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా చిన్నారుల నుండి వృద్దుల వరకు పుస్తక ప్రియులకు పుస్తక మహోత్సవం అలరించనున్నదన్నారు. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు చెందిన పబ్లికేషన్స్‌ ఒకే చోట దొరికే అవకాశం కలిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యత ఇస్తుందని దీనిలో భాగంగా గ్రామీణ ప్రాంతాలలో డిజిటల్‌ లైబ్రరీలను ఏర్పాటు చేసి సచివాలయాలకు అనుసందానించామన్నారు. నగరంలోని వివిధ పాఠశాలలో 8, నుండి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రతి రోజు బుక్‌ ఫెస్టివల్‌ను తిలకించి విజ్ఞానాన్ని పెంపొందించుకునే విధంగా చర్యలు తీసుకున్నట్లు మంత్రి అన్నారు.
ప్రారంబోత్సవ అనంతరం రిటైర్డ్‌ లెక్చరర్‌ వి. సుందర్‌రావు స్వాతంత్య్ర సంగ్రామ యోదుల చరిత్రను తెలిపే విధంగా ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను, రామకృష్ణ మఠం స్టాల్‌ను గవర్నర్‌ తిలకించారు.
పుస్తక మహోత్సవ ప్రారంభ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ తెలుగు మరియు సాంస్కృత అకాడమి చైర్‌పర్సన్‌ ఎన్‌. లక్ష్మి పార్వతి అధికార భాష సంఘం చైర్మన్‌ విజయ్‌బాబు, జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ నుపూర్‌ అజయ్‌, టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ నాగరాణి, విజయవాడ బుక్‌ ఫెస్టివల్‌ సోసైటి అధ్యక్షులు మనోహర్‌ నాయుడు, కార్యదర్శి లక్ష్మయ్య తదితరులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

16 నెలలు… 16కు పైగా విజయాలు…

-స్పష్టమైన మార్పు చూపించిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం -ఇదే స్ఫూర్తితో పనిచేయాలని ప్రభుత్వ యంత్రాంగానికి సీఎం చంద్రబాబు పిలుపు -ప్రజల సహకారంపై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *