
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కాట్రేనికోన కి చెందిన క్రియేటివ్ హార్ట్స్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వ్యర్యంలో విజయవాడ బాలోత్సవ భవన్ వేదికగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 45 మంది ప్రముఖ చిత్రకారులతో మాస్టర్ స్ట్రోక్ 2 పేరిట చిత్రకళా ప్రదర్శన ఏర్పాటు చేసినారు. ఈ చిత్రకళ ప్రదర్శనలో ఉంచిన చిత్రాలు అన్నీ సందర్శకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ మరియు బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ చేసిన చిత్రకారులే కాకుండా క్రియేటివ్ హార్ట్స్ ఫైన్ ఆర్ట్స్ కి చెందిన విద్యార్థులు గీసిన చిత్రాలు కూడా ఇందులో ప్రదర్శనగా ఉంచడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా జవహర్లాల్ నెహ్రు అర్కెటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ రిజిష్టరర్ ప్రొఫెసర్ సుందర్ కుమార్ – హైదరాబాద్, ప్రముఖ చిత్రకారులు డాకోజు శివప్రసాద్ – హైదరాబాద్, శేషబ్రహ్మం – ఒంగోలు, విజువల్ ఆర్ట్స్ చైర్మన్ సత్య శైలజ – అమలాపురం, అంధ్రప్రదేశ్ తెలుగు సంస్కృత అకాడమీ పాలకమండలి సభ్యులు డాక్టర్ కప్పగంతు రామకృష్ణ, 64 కళలు డాట్ కామ్ పత్రిక ఎడిటర్ కళా సాగర్ – విజయవాడ విచ్చేసారు.
juntu ప్రొఫెసర్ సుందర్ కుమార్ మాట్లాడుతూ పట్టణాలలోనే కాకుండా పల్లెటూరిలో సైతం చిత్రకళ అభివృద్ధికి క్రియేటీవ్ ఆర్ట్స్ సంస్థ చేస్తున్న కృషిని కొనియాడారు. రేపటి తరాన్ని చిత్ర కారులుగా తీర్చి దిద్దాలని సూచించారు. డాక్టర్ కప్పగంతు రామకృష్ణ మాట్లాడుతూ భారతీయ చిత్రకళ గొప్పదనాన్ని వివరించారు. భాషలో అక్షరాలు ఏర్పడకముందు చిత్రాల ద్వారా అప్పటి ప్రజలు మాట్లాడుకునే వారని చెప్పారు. ఇప్పటికీ ట్రాఫిక్ సిగ్నల్స్, సెల్ ఫోన్ ఎమోజీల వంటి చిత్రాలు మానవ భాషలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి అని చెప్పారు. సీనియర్ చిత్రకారులు శివ ప్రసాద్ మాట్లాడుతూ చిత్రకళ అనేది ప్రతీ మనిషిలో ఉన్న అంతర్గత.. మానసిక పరిస్థితిని ప్రతిభింభించే గొప్ప సాధనం ఈ చిత్రకళ అని ఇది మనిషికి ఎంతో ఆనందాన్ని… ఆలోచనలను కలిగిస్తాయని చిత్రకారులని ఉద్దేశించి మాట్లాడుతూ అభినందనలు తెలిపారు. క్రియేటివ్ హార్ట్స్ వ్యవస్థాపక అధ్యక్షులు అంజి ఆకొండి మాట్లాడుతూ గత ఏడు సంవత్సరాలుగా ఎంతో మంది చిన్నారులకి , చిత్రకారులకి వివిధ చిత్రకళ పోటీలు, చిత్రకళ ప్రదర్శనలు ఏర్పాటు చేస్తూ చిత్రకళ అభివృద్ధికి, చిత్రకారుల గుర్తింపు కోసం కృషి చేస్తున్నాను అని, చిత్రకళ అనేది ఒక సేవా మార్గం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో 200 మంది చిత్రకారులు..చిత్రకళ అభిమానులు విచ్చేసి ఈ చిత్రకళా ప్రదర్శనను విజయవంతం చేసినారు.
Prajavartha Online Telugu News