విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రైలు నం. 12727 విశాఖపట్నం – హైదరాబాద్ గోదావరి ఎక్స్‌ప్రెస్ బీబీనగర్ స్టేషన్ దాటిన తర్వాత బీబీనగర్ మరియు ఘట్కేసర్ రైల్వే స్టేషన్ల మధ్య ఈరోజు అనగా 15 ఫిబ్రవరి 2023 ఉదయం 06.10 గంటలకు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో రైలులోని ఎస్ 4 నుండి ఎస్ 1 వరకు నాలుగు స్లీపర్ క్లాస్ బోగీలు , ఒక జనరల్ బోగీ మరియు ఒక లగేజీ కమ్ బ్రేక్ వ్యాన్ పట్టాలు తప్పాయి . ఈ రైలులోని మిగిలిన 16 బోగీలకు ఏమాత్రము నష్టం కలగలేదు . ఈ ఘటన జరిగిన వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది వెంటనే పరిస్థితిని సంబంధిత అధికారులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న వెంటనే సహాయ చర్యలతో పాటు పునరుద్ధరణ పనులను చేపట్టడానికి వైద్య సిబ్బందితో సహా రైల్వే అధికారుల బృందంతో సంఘటనా స్థలానికి చేరుకొని తగిన చర్యలు చేపట్టాలని యాక్సిడెంట్ రిలీఫ్ ట్రైన్ (ఏ ఆర్ టి ) మరియు మెడికల్ రిలీఫ్ వ్యాన్ (ఎం ఆర్ వి ) తో సహా ఘటన స్థలానికి చేరుకున్నారు . రైలులో ప్రయాణిస్తున్న ప్రయాణికులందరికీ అత్యవసర వైద్యం మరియు ఇతర అవసరాల కోసం రైల్వే మరియు వైద్య సిబ్బంది ప్రయాణికులకు సహాయం అందించారు .అనంతరం రైల్వే అధికారులు రైలును క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత, పట్టాలు తప్పిన కోచ్‌లలోని ప్రయాణికులను దెబ్బతినని బోగీలలోకి తరలించారు. ఈ రైలులో ప్రయాణికులతో పాటు ప్రభావితం / దెబ్బతినని బోగీలతో కూడిన రైలు ఘటన స్థలం నుండి ఉదయం 7 .40 గంటలకు బయలుదేరి 08.40 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్‌కు చేరుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేయడానికి సహాయ కేంద్రాన్ని ఏర్పాటుచేసి 040-27786666 ఫోన్ నెంబర్ ద్వారా వివరాలను అందించడం జరిగింది . అలాగే సికింద్రాబాద్ స్టేషన్లో మెడికల్ కిట్లతో అదనంగా వైద్య బృందాలను ప్రయాణికులకు తదుపరి వైద్య సహాయం అందించడానికి సిద్ధంగా ఉంచడం జరిగింది .
ఈ ఘటన సందర్బంగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ మరియు సికింద్రాబాద్ డివిజన్ డి ఆర్ ఎం ఏ . కె . గుప్తా లు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ మరియు పునరుద్ధరణ పనులను స్వయంగా పర్యవేక్షించారు. బీబీనగర్ – ఘట్కేసర్ విభాగంలో ఉన్న రెండు లైన్లలో ప్రప్రధమంగా సింగిల్ లైన్ గుండా నిలిచిపోయిన రైళ్లను ఆయా గమ్యస్థానాలకు చేర్చడం జరిగింది .
పట్టాలు తప్పడం మరియు ట్రాక్‌కు అంతరాయం ఏర్పడిన పరిస్థితుల దృష్ట్యా 09 రైళ్లు రద్దు కాగా , 19 రైళ్లు పాక్షికంగా రద్దు చేయబడ్డాయి. అలాగే 07 రైళ్లు సమయ మార్పు మరియు 06 రైళ్లు ఇతర మార్గం ద్వారా దారి మళ్లించబడ్డాయి. (బులెటిన్ నెంబర్ 6 వరకు) . రద్దు చేసిన రైళ్లలోని ప్రయాణికుల సౌకర్యార్థం సికింద్రాబాద్, నల్గొండ స్టేషన్లలో ప్రత్యేక రీఫండ్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. అదేవిదంగా సాధారణ రైళ్ల రాకపోకలు సాగించేందుకు పునరుద్ధరణ పనులు వేగవంతముగా సాగుతున్నాయి .
Prajavartha Online Telugu News