Breaking News

దేశంలోనే ఏపీ ప్రభుత్వం అగ్రగామిగా ఉంది

-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
-64 వ డివిజన్ 285 వ వార్డు సచివాలయ పరిధిలో రెండో రోజు గడప గడపకు మన ప్రభుత్వం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక రంగాలలో అగ్రగామిగా నిలుస్తూ.. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. శనివారం 64 వ డివిజన్ 285 వ వార్డు సచివాలయ పరిధిలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ యరగొర్ల తిరుపతమ్మతో కలిసి ఆయన పాల్గొన్నారు. రాధానగర్, ప్రజాశక్తి నగర్లలో విస్తృతంగా పర్యటించి.. 201 గడపలను సందర్శించారు. సంక్షేమ పథకాల అమలు తీరును తెలుసుకోవడంతో పాటు ప్రజలకు కావలసిన మౌలిక సదుపాయాలు మరింత మెరుగుపర్చడానికి గడప గడపకు మన ప్రభుత్వం ఎంతగానో దోహడపడుతోందని మల్లాది విష్ణు తెలిపారు. సచివాలయ పరిధిలో గత మూడున్నరేళ్లలో రూ. 7.40 కోట్ల సంక్షేమాన్ని అందజేసినట్లు వెల్లడించారు. 319 మందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేసినట్లు వివరించారు. ఈ సందర్భంగా లబ్ధిదారు నీసనం సునందమ్మ మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వంలో తన కుటుంబానికి రూ. 9.50 లక్షల లబ్ధి చేకూరిందని పేర్కొన్నారు. దురు రమణమ్మ మాట్లాడుతూ.. అమ్మఒడి, విద్యాదీవెన, వసతి దీవెన, ఆసరా, సున్నావడ్డీ, ఇంటి స్థలం మంజూరయ్యాయని ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పేదరికాన్ని అంతం చేయాలనే దృఢ లక్ష్యంతో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంటే.. పేదలందరూ పేదలుగా ఉండిపోవాలన్న దురుద్దేశంతో ప్రభుత్వ పథకాలపై టీడీపీ నేతలు దుష్ప్రచారాలు చేస్తున్నారని మల్లాది విష్ణు మండిపడ్డారు. అలాగే రాధానగర్, పాయకాపురం, ఎన్.ఎస్.సి.బోస్ నగర్లలో ఇళ్ల రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించడం జరిగిందని.. ఇందుకోసం ప్రజలందరూ తమ తమ వార్డు సచివాలయాలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

మహిళా పక్షపాత ప్రభుత్వం మనది
మహిళ సంక్షేమంలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంతో పోటీ పడే రాజకీయ పార్టీ దేశంలోనే మరొకటి లేదని మల్లాది విష్ణు పేర్కొన్నారు. ఆడపడుచుల ఆర్థిక చేయూతకు ప్రత్యేకంగా 7 పథకాలను ప్రవేశపెట్టి దిగ్విజయంగా అమలు చేస్తున్నామన్నారు. సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా 32,510 మంది అక్కచెల్లెమ్మలకు రూ. 56 కోట్ల 35 లక్షలు., సున్నావడ్డీ పథకం ద్వారా 44,370 మందికి రూ. 17 కోట్ల 26 లక్షలు., వైఎస్సార్ చేయూత ద్వారా 8,542 మందికి రూ. 39 కోట్లు., అమ్మఒడి పథకం ద్వారా 28,834 మంది తల్లులకు రూ. 118 కోట్ల 98 లక్షలు., విద్యాదీవెన ద్వారా 6,989 మందికి రూ.36 కోట్ల 97 లక్షలు., వైఎస్సార్ కాపు నేస్తం ద్వారా 2,088 మందికి రూ. 8 కోట్ల 87 లక్షలు., ఈబీసీ నేస్తం ద్వారా 1,947 మందికి రూ. 2 కోట్ల 92 లక్షలు నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాలలో జమ చేసినట్లు తెలిపారు. మొత్తంగా మూడున్నరేళ్లలో 85,347 మందికి రూ. 280.39 కోట్ల సంక్షేమాన్ని అందజేసినట్లు వివరించారు.

పెట్టుబడులకు ఏపీ స్వర్గధామం
ఆంధ్రప్రదేశ్‌ లో పెట్టుబడులు పెట్టేందుకు ఎన్నో అవకాశాలు, సహజవనరులు అందుబాటులో ఉన్నాయని.. నైపుణ్యం కలిగిన మానవ వనరులకు కొదవలేదని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు తెలిపారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంస్కరణలు, అందిస్తోన్న రాయితీలతో రాష్ట్రానికి పరిశ్రమలు వెల్లువలా వస్తున్నాయని పేర్కొన్నారు. గతంలో లాగా ఉత్తుత్తి ఒప్పందాలు, ఆర్భాట ప్రచారాలు లేకుండా నేరుగా దిగ్గజ వ్యాపార సంస్థలు పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు రావడం శుభపరిణామన్నారు. తొలి రోజు రూ. 11.87 లక్షల కోట్ల విలువైన 92 ఒప్పందాలు కుదుర్చుకోగా.. వీటి ద్వారా 3,92,015 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు మల్లాది విష్ణు తెలిపారు. పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దూసుకువెళుతుంటే.. చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయని మండిపడ్డారు. ప్రతిఒక్క పారిశ్రామిక సదస్సులోనూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తోన్న సహాయ సహకారాల గూర్చి పారిశ్రామికవేత్తలు కీర్తిస్తుంటే.. పచ్చ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని నిప్పులు చెరిగారు. దావోస్ సదస్సులకు ఎగబడి వెళ్లిన చంద్రబాబు, లోకేశ్ ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు తెచ్చారో సమాధానం చెప్పాల‌ని డిమాండ్ చేశారు. కనుక తండ్రికొడుకులు తలక్రిందులుగా తపస్సు చేసినా.. ప్రజలు నమ్మే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఏఎంఓహెచ్ రామకోటేశ్వరారవు, సీడీఓ జగదీశ్వరి, నాయకులు యరగొర్ల శ్రీరాములు, ఎస్.కె.ఇస్మాయిల్, అఫ్రోజ్, జిల్లెల్ల శివ, పందిరి వాసు, మేడా రమేష్, అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి వ్యక్తిత్వ వికాసం ఎంతో అవసరం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ, ఎన్‌టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో విజయవాడ పటమటలంకలోని అదిత్య డిగ్రీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *