-కేంద్ర నాణ్యత ప్రమాణాలు ప్రజారోగ్య ఆస్పత్రులలో అమలు అయ్యేలా వైద్య ప్రణాళికలు, చర్యలు ఉండాలి
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలోని అన్ని ప్రజారోగ్య ఆసుపత్రులలో సుస్థిరమైన అధిక నాణ్యతతో కూడిన ఆరోగ్య సంరక్షణ, మెరుగైన వైద్యం అందించడమే ప్రాథమిక లక్ష్యంగా సేవలు అందించాలని కలెక్టర్ మరియు జిల్లా స్థాయి నాణ్యత హామీ కమిటీ చైర్మన్ కె వెంకట రమణ రెడ్డి అన్నారు.
సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో వైద్య శాఖ ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి నాణ్యత హామీ కమిటీ తొలి సమావేశం జిల్లా కలెక్టర్ గారి అధ్యక్షతన సంబంధిత కమిటీ సభ్యులైన డిప్యూటి డిఎంహెచ్ఓ, డి సి హెచ్ ఎస్ ఏరియా ఆసుపత్రి, సూపరింటెండెంట్ రుయా ఆసుపత్రి, జిల్లా ప్రసూతి ఆస్పత్రి తదితర వైద్య అధికారులతో సమీక్షించి పలు సూచనలు చేశారు. ముందుగా జిల్లా నాణ్యత అధికారి హరికృష్ణ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్ కి సభ్యులకు కమిటీ బాధ్యతలు మార్గదర్శకాలను వివరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమం మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా వైద్య సేవల రాష్ట్ర నాణ్యత హామీ కమిటీ, జిల్లా స్థాయిలో జిల్లా నాణ్యత హామీ కమిటీ ఏర్పాటుతో అన్ని ఆసుపత్రులలో పేదలకు వారి సంతృప్తి మేరకు నాణ్యతతో కూడిన వైద్య సేవలు అందించే మహోన్నత లక్ష్య సాధన దిశలో జిల్లా రుయా హాస్పిటల్, ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి, 2 ఏరియా ఆసుపత్రుల్లో, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు 10, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 58, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 25, హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లు 438 మొత్తం వెరసి జిల్లాలోని 535 ఆరోగ్య కేంద్రాలలో వైద్య అధికారులు పని చేయాలని సూచించారు.
ఈ జిల్లా స్థాయి కమిటీ జిల్లాలో అన్ని ఆసుపత్రిలలో నాణ్యత ప్రమాణాలు అమలయ్యేలా పర్యవేక్షిస్తుందని, ఆస్పత్రిలోని పలు విభాగాల మానవ వనరులకు కెపాసిటీ బిల్డింగ్ చేయడం కేంద్రం సూచించిన చెక్ లిస్ట్ ప్రకారం అన్ని సేవలు వసతులు ఉండేలా చర్యలు చేపట్టాలని, అలాగే జిల్లా
నాణ్యత ప్రమాణ యూనిట్ వారు ఎప్పటికప్పుడు రిపోర్టింగ్ యంత్రాంగం పనిచేసి సమన్వయం చేయాలని తెలిపారు.
అన్ని ఆస్పత్రుల్లో అమలు చేయాల్సిన పలు నిర్ధారించబడిన నాణ్యత ప్రమాణాలలో జాతీయ నాణ్యతా ప్రమాణాల హామీ (NQAS) సేవలు సుస్థిరమైన నాణ్యత ప్రమాణాలు వ్యవస్థ ఏర్పాటుతో పేషంటు కు సంతృప్తికర సేవలు అందించడం, రోగి యొక్క హక్కులు కాపాడటం సపోర్టింగ్ సేవలు, క్లినికల్ సేవలు, ఇన్ఫెక్షన్ కంట్రోల్, క్వాలిటీ మేనేజ్మెంట్ వంటి పటిష్టమైన వ్యవస్థ ఏర్పాటు, సక్రమమైన పని తీరు విధానముతో ఆరోగ్య సంరక్షణలో ప్రపంచ స్థాయి అంతర్జాతీయ నాణ్యత ప్రమాణాలను అమలు చేయడం కొరకు అనుగుణమైన చెక్ లిస్ట్ ఏర్పాటుతో సేవలు అందించడం ముఖ్య ఉద్దేశ్యం అని అన్నారు. మన జిల్లా లోని 58 పి హెచ్ సి లలో 24 NQAS సర్టిఫికెట్ పొందాయని, ఏరియా ఆసుపత్రి శ్రీకాళహస్తి, సి హెచ్ సి పుత్తూరు, చంద్రగిరి సదరు సర్టిఫికెట్ పొందినాయని, మిగిలిన ఆస్పత్రులు కూడా అర్హత సాధించేలా చర్యలు ఉండాలని, దానికి అనుగుణంగా ప్రతిపాదనలు, చేపట్టాల్సిన చర్యలపై నివేదికలు తయారు చేయాలని అన్నారు.
LAQSHYA (లేబర్ రూం క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ ఇనిషియేటివ్) లక్ష్య సర్టిఫికెట్ ముఖ్య లక్ష్యం లేబర్ రూమ్ మరియు ప్రసూతి ఆపరేషన్ థియేటర్లలో సరియైన వసతులతో కాన్పు సమయంలో ఏర్పడే సమస్యలు లేదా కాన్పు తర్వాత సమస్యలతో కలిగే మాతా శిశు మరణాలను తగ్గించడం అని అన్నారు. ప్రజా ఆరోగ్య కేంద్రాలను సందర్శించే బాలింతలకు మర్యాద పూర్వకమైన నాణ్యమైన మాతృ సంరక్షణ అందించే దిశలో చర్యలు ఉండాలని తెలిపారు. జిల్లా ప్రసూతి ఆసుపత్రి, గూడూరు ఏరియా ఆసుపత్రి లక్ష్య ధ్రువీకరణ పత్రం పొందిందని వాటి ప్రమాణాలను అలాగే కొనసాగించాలని సూచించారు.
కాయకల్ప్ సర్టిఫికెట్ ఇనిషియేటివ్ కార్యక్రమం కింద ఆస్పత్రులను ఎప్పటికప్పుడు ఉన్నతీకరించుకోవడం, పరిసరాల పరిశుభ్రత ఆస్పత్రి నుండి వెలువడే చెత్తను వేస్ట్ మేనేజ్మెంట్, ఇన్ఫెక్షన్ కంట్రోల్ ఏర్పాటు, సహాయక సేవలు పారిశుద్ధ్య కార్యక్రమాలు, ఆస్పత్రి చుట్టూ ప్రహరీ ఏర్పాటు వంటి పలు అంశాల చెక్ లిస్టు ద్వారా నిర్ధారించబడి కేంద్రం నుండి సర్టిఫికెట్ అందించ బడుతుందని అన్నారు.
ముస్కాన్ (MUSQAN) ఇనిషియేటివ్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం పుట్టిన పిల్లల నుండి 12 సంవత్సరాలలోపు పిల్లల మరణాలను మరియు అనారోగ్యాన్ని తగ్గించే దిశలో ఆసుపత్రులలో చిన్న పిల్లల వార్డు, ఓపిడి, నియోనేటల్ కేర్ తదితర సేవలు చిన్నపిల్లల ఆరోగ్యానికి ఉపయుక్త కరంగా ఉండేలా చూడాలి అన్నారు. సమావేశ అనంతరం NQAS సర్టిఫికేషన్ పొందిన కుప్పబాదూరు, పిచ్చాటురు, జి జే పల్లి, కేవీబీ పురం తదితర పి హెచ్ సి ల వైద్యాధికారు లకు ధృవీకరణ పత్రాలు కలెక్టర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు.
పై తెలిపిన అంశాలలో ని సదుపాయాలను ఆస్పత్రులలో కల్పించడం ద్వారా రోగులకు సంతృప్తికర సేవలు అందించితే కేంద్రం నుండి సంబంధిత సర్టిఫికెట్ మరియు నగదు ప్రోత్సాహకాలు అందుతాయన్నారు. కేంద్ర ప్రభుత్వ గుణక్ యాప్ నందు నివేదికల వివరాలు కచ్చితత్వంతో అప్లోడ్ చేయాలని తెలిపారు. వివిధ శాఖలతో నాణ్యత ప్రమాణాల కమిటీ సమన్వయ సమావేశం ఏర్పాటు కు చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ సమావేశం మూడు నెలలకు ఒకసారి జరుగుతున్నందున ముందుగానే ఆసుపత్రి వారీగా ప్రస్తుతం ఉన్న సదుపాయాలు, సర్టిఫికేషన్ కొరకు అంది పుచ్చుకోవాల్సిన అంశాల చెక్లిస్టుతో పూర్తి వివరాలు, ప్రణాళికలతో సమావేశానికి హాజరుకావాలని సూచించారు.
ఈ సమావేశంలో రుయా ఆసుపత్రి, జిల్లా ప్రసూతి ఆస్పత్రి సూపరింటెండెంట్ లు నాగ మునీంద్రుడు, పార్థసారథి, డిప్యూటి డిఎంహెచ్ఓ అరుణ సులోచన దేవి , డి సి హెచ్ ఎస్ డా.ప్రభావతమ్మ, గూడూరు ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామకృష్ణ , డిప్యూటీ డిఎంహెచ్వో సుధారాణి, జిల్లా ఇమునైజేషన్ అధికారిని శాంత కుమారి, నాణ్యత పర్యవేక్షణ కన్సల్టెంట్ శ్రావ్య తదితర వైద్యాధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News