-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-నగర కమిషనర్ తో కలిసి క్షేత్రసాయి పరిశీలన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బుడమేరు ప్రక్షాళనలో భాగంగా కాలువలో పేరుకున్న తూటికాడను యుద్ధప్రాతిపదికన తొలగించాలని ఇరిగేషన్ అధికారులకు రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు సూచించారు. నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఇరిగేషన్, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి బుడమేరు, రైవస్ కాలువ పరివాహక ప్రాంతాలలో శనివారం ఆయన పర్యటించారు. న్యూ ఆర్ ఆర్ పేట, మధ్యకట్ట, అరండల్ పేట, గుణదల పరిసర ప్రాంతాలలో క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. నియోజకవర్గంలో దాదాపు 9 కి.మీ. మేర బుడమేరు విస్తరించి ఉందని.. కాలువలో తూటికాడ, గుర్రపు డెక్క తొలగింపు పనులను 10 రోజులలో పూర్తి చేయవలసినదిగా ఆదేశించారు. దోమలు వ్యాప్తి చెందకుండా డ్రోన్ ద్వారా కాలువలో M.L.ఆయిల్ పిచికారీ చేయాలన్నారు. అలాగే రైవస్ కాలువ ప్రక్షాళన పనులు వీలైనంత త్వరగా చేపట్టాలన్నారు. మరోవైపు గడప గడపకి మనప్రభుత్వంలో ప్రభుత్వం దృష్టికి వచ్చిన పనులతో పాటు న్యూరాజరాజేశ్వరి పేట, అరండల్ పేటలో తాగునీటి వ్యవస్థను మెరుగు పరచాలని ఇంజనీరింగ్ అధికారులకి సూచించారు. దావు బుచ్చయ్యకాలనీ ప్రధాన రహదారి నిర్మాణ పనులకి అంచనాలు సిద్ధం చేయవలసినదిగా తెలిపారు. ఎమ్మెల్యే వెంట ఇరిగేషన్ ఎస్ఈ ఎస్. తిరుమలరావు, ఈఈలు కె. శ్రీనివాసరావు, కె. బాబు, ఇంజనీరింగ్ ఈఈ శ్రీనివాస్, జోనల్ కమీషనర్ సృజన, వైసీపీ కార్పొరేటర్లు బంకా శకుంతల భాస్కర్, జానారెడ్డి, ఇసరపు దేవి రాజా రమేష్, ఉద్ధంటి సునీత సురేష్, ఆయా శాఖల డిఈలు, ఏఈలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News