-నిర్మిస్తున్న గృహాలు, సౌకర్యాలు వచ్చి చూడండి, ఇళ్లు నిర్మించుకోండి
-లబ్ధిదారులకు సూచించిన జాయింట్ కలెక్టర్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
కరగ్రహారం లేఅవుట్లో గృహ నిర్మాణం, మౌలిక వసతుల అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం జాయింట్ కలెక్టర్ కరగ్రహారం లేఅవుట్ సందర్శించి ఏ, డి, ఈ, ఎల్ బ్లాకులలో గృహ నిర్మాణాలు పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ కరగ్రహారంలో 330 ఎకరాలలో 18 వేల మంది లబ్ధిదారులకు లేఅవుట్ వేసి స్థలాలు ఇచ్చినట్లు తెలిపారు. ముందుగా ఏ, డి, ఈ, ఎల్ బ్లాక్లలో గృహ నిర్మాణాలు మొదలు పెట్టామని తెలిపారు. ఇప్పటిదాకా 250 గృహాలు వివిధ నిర్మాణ దశలలో ఉన్నాయని జెసి తెలిపారు. ఏ బ్లాక్ లో అప్రోచ్, అంతర్గత రహదారులు నిర్మించామని, విద్యుత్ కనెక్షన్లు ఇవ్వనున్నామని, మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. లబ్ధిదారులు గృహాలు నిర్మించుకొనుటకు ఇప్పుడిప్పుడే ముందుకు వస్తున్నారని ఇదొక సానుకూల పరిణామం అన్నారు ఇక్కడ పోర్టు కూడా వస్తున్నందున, పోర్టు అభివృద్ధితో ఈ ప్రాంతం మచిలీపట్నంలోనే ప్రైమ్ లొకేషన్ కాగలదని ఆశిస్తున్నట్లు తెలిపారు. గృహాలు నిర్మించుకొనుటకు బ్యాంకుల ద్వారా డ్వాక్రా గ్రూపుల సభ్యులకు 75 వేల వరకు రుణాలు మంజూరు చేయిస్తున్నట్లు తెలిపారు. ఇన్ని సౌకర్యాలు కల్పిస్తున్నప్పటికీ,ఇంకా కొంతమంది గృహాలు నిర్మించుకొనుటకు ముందుకు రాకపోవడం పట్ల జెసి ఆవేదన వ్యక్తం చేశారు. ఆరు నెలల క్రితం పరిస్థితి వేరు, ఇప్పటి పరిస్థితి వేరు, లబ్ధిదారులు వచ్చి చూడండి, ఇళ్లు నిర్మించుకోండి అంటూ జాయింట్ కలెక్టర్ సూచించారు. రెండు వారాల్లో లబ్ధిదారులు ముందుకు వచ్చి గృహ నిర్మాణాలు మొదలు పెట్టుకోవాలని, లేనియెడల వారికి ఆసక్తి లేదనుకుని, ఇంకా స్థలాల కోసం చాలామంది ఎదురుచూస్తున్నారని, అట్టివారికి వారికి లాటరీ తీసి కేటాయించడం జరుగుతుందన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చంద్రయ్య, తాసిల్దారు డి సునీల్ బాబు, విద్యుత్ శాఖ ఈ ఈ భాస్కరరావు, మెప్మా కోఆర్డినేటర్ బసవేశ్వరరావు, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, టౌన్ ప్లానింగ్ అధికారులు జాయింట్ కలెక్టర్ వెంట ఉన్నారు.
Prajavartha Online Telugu News