విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రైతులు వేసవిలో తమ భూములకు సంబంధించి భూసార పరీక్షలు నిర్వహించి ఫలితాలకు అనుగుణంగా పంటలను చేపట్టి తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించాలని జిల్లా వ్యవసాయాధికారిణి సాకా నాగమణమ్మ ఒక ప్రకటనలో కోరారు. జిల్లాలో ఖరీఫ్ సీజన్‌లో 40 వేల హెక్టార్‌లో వరి, 44,134 హెక్టార్‌లో ప్రత్తి, 18,500 హెక్టార్‌లో మిరప, 22,500 హెక్టార్‌లో మామిడితో పాటు పుష్పజాతి పంటలు కూరగాయలను పండిరచడం జరుగుతుందన్నారు. సారవంతమైన భూములలో పంటలను చేపట్టడం ద్వారా రైతులు అధిక దిగుబడి సాధించే అవకాశం ఉంటుందన్నారు. రైతులు తమ భూములకు సంబంధించి భూసార పరీక్షలను చేయించుకుని అనుగుణంగా పంటలను చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. భూసారాన్ని బట్టి అవసరమైన సేంద్రియ ఎరువులు, పచ్చిరొట్ట, పైరులు దున్నడం ద్వారా భూమిని సారవంతం చేసుకోవాలన్నారు. సాగునీటి యాజమాన్య పద్దతులు, వనరుల వినియోగం, భూసార పరీక్షలు, సేంద్రియ ఎరువుల వాడకం వంటి అంశాలపై రైతులు అవగాహన కలిగి వుండడం ద్వారా అధిక దిగుబడులు సాధించాలనే లక్ష్యంతో భూసార పరీక్షలు ` శిక్షణలను అందిస్తున్నామన్నారు. భూసార పరీక్షలపై డివిజన్, మండల, గ్రామ స్థాయి వ్యవసాయ అధికారులకు మట్టి నమూనాల సేకరణ భూసార పరీక్షల పై శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. రైతులకు సంబంధించి భూములు భూ సార పరీక్షలు నిర్వహించి వివరాలను జిపిఎస్ లోకేషన్ ద్వారా మొబైల్ యాప్‌లో అప్‌లోడ్ చేయడం జరుగుతుందన్నారు. గొల్లపూడిలోని భూసార పరీక్ష కేంద్రంతో పాటు జిల్లాలోని నాలుగు ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్ లలో భూ సార పరీక్షలు నిర్వహించి ఫలితాలను తెలియజేసేందుకు చర్యలు తీసుకున్నామని రైతులు వారి పరిధిలోని వ్యవసాయ శాఖ సహాయకులను సంప్రదించి భూ సార పరీక్ష వివరాలను తెలుసుకోవచ్చునని నాగమణమ్మ ఆ ప్రకటనలో తెలిపారు.
Prajavartha Online Telugu News