అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థ ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (APNRTS) ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న ప్రవాసాంధ్రుల సంక్షేమం, భద్రత, అభివృద్ది ధ్యేయంగా, రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి మార్గదర్శకత్వంలో పనిచేస్తూ, ప్రవాసాంధ్రులకు అనేక ఉచిత సేవలు అందిస్తోంది. APNRT Society అనేక సేవలు అందించడమే కాకుండా… ఉపాధి, ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్ళే కార్మికులకు ముందస్తు అవగాహనా కార్యక్రమాలు చేపడుతోంది.
మన రాష్ట్రం నుండి చాలామంది ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలకు వలస వెళ్తున్నారు. అయితే అక్రమ ఏజెంట్ల మాటలు నమ్మి, అవగాహన లేకుండా వెళ్లి ఇబ్బందులకు గురవుతున్న వారి కోసం, APNRTS వలసలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాల్లో ఈ అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఏప్రిల్ 25వ తేదీన (మంగళవారం) ఉదయం 10:30 గంటలకు పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు నందు పద్మశ్రీ ఫంక్షన్ హాల్ (కూచిపట్ల, వల్లూరి వారి వీధి) వేదికగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పౌరసరఫరాలు మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖా మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వర రావు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్, SP, జాయింట్ కలెక్టర్, మున్సిపల్ కమీషనర్, పలు ప్రభుత్వ అధికారులు పాల్గొననున్నారు.
ఈ కార్యక్రమంలో స్వచ్చంద సంస్థలు, నియామక ఏజెంట్లు (రిక్రూటింగ్ ఏజెంట్లు) వలసకార్మికులు, విదేశాలకు వెళ్లాలనుకుంటున్న వారు పాల్గొనాలని ఆహ్వానిస్తున్నాం. అలాగే మీకు ఉన్న సందేహాలు, అపోహలను నివృత్తి చేసుకోగలరు.
విదేశాలకు వెళ్ళాలనుకుంటున్న వారు, విదేశాల్లో ఉన్నవారు ఏదేని సహాయం కొరకు APNRTS 24/7 హెల్ప్ లైన్ నంబర్లు 0863 2340678 వాట్సాప్: 85000 27678 ను సంప్రదించగలరు.
Prajavartha Online Telugu News