విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్త్రీకి రక్షణ కవచం మద్యపాన నిషేదమేనని, స్త్రీలు బానిసత్వం నుంచి బయటకు రావాలంటే మద్యపాన నిషేదమే మార్గమని గాంధీ దేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ అధ్యక్షులు ఆర్.ఆర్.గాంధీ నాగరాజన్ ఆకాంక్షించారు. ఆదివారం గాంధీనగర్‌లోని ధర్నాచౌక్‌లో గాంధీ దేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ అధ్యక్షులు ఆర్.ఆర్.గాంధీ నాగరాజన్ కళ్ళకు గంతలు కట్టుకొని సంపూర్ణ మద్యపాన నిషేదం కోసం రిలే నిరాహార దీక్ష చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గాంధీ నాగరాజన్ మాట్లాడుతూ మహాత్మా గాంధీని అత్యంత కిరాతకంగా చంపిన రోజు 30వ తేదీ కాబట్టి ప్రతి నెలా 30వ తేదీ ఆయన చేసి త్యాగాలను భావితరాల వారికి గుర్తు చేసేందుకు తాను కళ్ళకు గంతలు కట్టుకొని దీక్ష చేస్తానన్నారు. స్త్రీ రక్షణ లేని స్వాతంత్య్ర… స్వాతంత్య్రం కానేకాదన్నారు. గాంధీ కలలు కన్న నిజమైన స్వాతంత్య్రం ఇదేనా అని ప్రశ్నించారు. మద్యపానానికి బానిసైన వారి అనేక కుటుంబాలు ఇప్పుడు ఎన్నో నాశనమైపోతున్నాయన్నారు. బుద్ది వున్నవాడు అయితే మద్యపాన నిషేదం చేస్తాడని చెప్పిన ఆనాటి ముఖ్యమంత్రిని ప్రశ్నించిన ఈనాటి ముఖ్యమంత్రి ఇప్పుడు ఆ విషయం మరిచి ఎందుకు జాప్యం చేస్తున్నారో అర్థం కావడంలేదని వాపోయారు. ఎలక్షన్స్‌లో కూడా మద్యాన్ని వరదలుగా పారించి కార్యకర్తలను గూండాలుగా మార్చే విషసంస్కృతి ఇప్పటికీ కొనసాగుతుందన్నారు. సేవలు అందించాల్సిన నాయకులు దేశాన్ని దోచుకుంటూ దేశాన్ని నాశనం చేస్తున్నారన్నారు. దేశంలో అన్ని తప్పులకు ప్రధాన కారణం మద్యపానమేనన్నారు. ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో 20 శాతం ఈ మద్యం నుంచే వస్తుందని అందుకుని దీని నిషేదంపై ప్రభుత్వం తటపటాయిస్తుందన్నారు. మాదకద్రవ్యాలు, మద్యపాన నిషేదం పై సెంట్రల్, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుని చట్టసవరణ తీసుకురావాలన్నారు. భావితరాల వారికి మంచి భవిష్యతు వుండాలంటే మద్యపాన నిషేదం, డ్రగ్స్, మత్తుపదార్థాలు నిషేదం ఒక్కటే దారి అని దానికి అందరూ నడుం బిగించాలని పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీ కలలు కన్న స్వరాజ్యం భారతదేశంలో రావాలన్నారు. బ్రతికితే దేశం కోసం, చస్తే దేశం కోసం అనే నినాదంతో తాను ఉద్యమ బాట నడుస్తున్నానన్నారు. ఓటును నోటుకు అమ్ముకునే సంస్కృతిని విడనాడి. ఓటు అనే బ్రహ్మాస్త్రంతో మంచి నాయకుడిని ఎన్నుకుని మన భవిష్యత్తు తరాల కోసం అయినా అందరూ నడుం కట్టాలన్నారు. ఆర్టికల్ 47 మన రాజ్యాంగంలో మద్యపాన నిషేదానికి రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దపీఠ వేయాలని వుంది. రాజ్యాంగపరంగా వున్నది మన హక్కు. అది లేకుండా దేశాన్ని చూడాల్సిన బాధ్యత మనది అందుకే ఈ పోరాటమని తెలిపారు. మద్యపానం వలన ఎందరో మహిళల తాళిని తేంచే స్థాయి వచ్చినా కూడా మీ పరిపాలన కొనసాగించాలా? అని న్నారు. బీహార్‌లో ముఖ్యమంత్రిగా వున్న నితీష్‌కుమార్ ఆరు సంవత్సరాలుగా మద్యపానాన్ని నిషేదించారు. సుమారు 2.50 లక్షల మంది ప్రజలు, ప్రతిపక్షాలు కూడా మద్యపానం కావాలని పోరాడి కేసులు వేసినాగాని అక్కడి ప్రభుత్వం మాత్రం మద్యపానం నిషేదాన్ని తీసివేయలేదు. అక్కడ స్త్రీ రక్షణనే ముఖ్యంగా తీసుకున్నారు. అక్కడ వున్న ముఖ్యమంత్రికి స్త్రీ రక్షణ ప్రధాన ధ్యేయమనే భావం, ఆలోచన ఇక్కడ ముఖ్యమంత్రికి ఎప్పుడు వస్తుందన్నారు. అక్కడ వున్న పరిపాలనా విధానాన్ని ఇక్కడ ఎందుకు అవలంభించరని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో గాంధీ ట్రస్ట్ మహిళా అధ్యక్షురాలు ఆర్.ఎన్. శివరంజని, ట్రస్టు రాష్ట్ర అధ్యక్షురాలు బాపతి భారతి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News