-జగనన్న విద్యా కానుక సామాగ్రి నాణ్యతగా ఉండేలా సంబంధిత టీములు తనిఖీలు చేయాలి
-బడి బయటి పిల్లలు అందరినీ మ్యాపింగ్ చేసి బ్రిడ్జ్ కోర్సు విద్యతో వారిని మెయిన్ స్ట్రీమ్ చేయాలి
-పాఠశాల పునః ప్రారంభం నాటికి బడి ఈడు పిల్లలందరూ బడిలో ఉండేలా చర్యలు తీసుకోవాలి: కలెక్టర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
మనబడి నాడు -నేడు కార్యక్రమంలో భాగంగా నిర్మితమవుతున్న పాఠశాల భవనాలు మరియు ఇతర మౌలిక సదుపాయాల ఏర్పాటు వేగవంతం చేసి పాఠశాలల పునః ప్రారంభం నాటికి పూర్తి చేసేలా ఉండాలని, జగనన్న విద్యా కానుక కిట్లు నాణ్యత ప్రమాణాలు మేరకు ఉండేలా సంబంధిత టీములు తనిఖీలు చేయాలని, విద్యా హక్కు చట్టం మేరకు రెండవ ఫేజ్ లో విద్యార్థులను మరింతగా నమోదు చేయించాలని విద్యాశాఖ అధికారులను జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి ఆదేశించారు.
శుక్రవారం ఉదయం కలెక్టర్ మనబడి నాడు – నేడు కార్యక్రమం కింద మంజూరైన పాఠశాలల నిర్మాణాలు, మరమ్మత్తులు మరియు మౌలిక సదుపాయాల కల్పన పై డీఈవో, డిప్యూటీ డిఇఓ మండల విద్యాశాఖ అధికారులు, ప్రోగ్రాం అధికారుల తో విద్యాశాఖకు సంబంధించిన పలు అంశాలపై సమీక్ష చేసి దిశా నిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిర్దేశించిన 10 కాంపోనెంట్స్ లేనటువంటి పాఠశాలల్లో మాత్రమే ప్రహరీ గోడలు, అదనపు గదుల నిర్మాణం వంటివి నిబంధనల మేరకు చేపట్టాలని అన్నారు. పాఠశాల భవనాల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్న వాటిలో స్టేజి వారి పురోగతి ఉండేలా చర్యలు చేపట్టి పాఠశాలల పునః ప్రారంభం లోపు నిర్మాణ పనులు, మరమ్మత్తులు, విద్యుత్తు కనెక్షన్ ట్యూబ్ లైట్లు ఫ్యాన్లు తదితర మౌలిక సదుపాయాల కల్పన ఏర్పాటు పూర్తి కావాలని అన్నారు. పాఠశాలల్లో నిరంతర నీటి సరఫరాతో మరుగుదొడ్ల ఏర్పాటు కావాలని అన్నారు. జిల్లాలో మంజూరు చేసిన 400 కిచెన్ షెడ్లలో 342 పురోగతిలో ఉన్నాయని తెలుపగా మిగిలిన వివిధ స్టేజీలలో ఉన్న వాటిని, మేజర్ మరమ్మతులు, మైనర్ మరమ్మతులను త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. పాఠశాలల్లో విద్యుదీకరణ పనులు 634కు గాను 546 పురోగతిలో ఉన్నాయని తెలుపగా సకాలంలో పూర్తి కావాలని అన్నారు. సప్లయర్ సకాలంలో మెటీరియల్ అందజేయలేకపోతే నిబంధనల మేరకు ప్రణాళిక బద్ధంగా పూర్తి అయ్యేలా సంబంధిత మండల విద్యాధికారులు చర్యలు చేపట్టి వేగవంతం చేయాలని అన్నారు. జగనన్న విద్యా కానుక కిట్లకు సంబంధించి సంబంధిత సామాగ్రి ఈ నెల ఆఖరిలోపు అందేలా నాణ్యత తనిఖీలు సంబంధిత కమిటీలు చేపట్టి చర్యలు తీసుకోవాలని అన్నారు. పదవ తరగతి, ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులకు రెమిడీయల్ టీచింగ్ ఏర్పాటు ఉండాలని సూచించారు. జిల్లాలోని 617 మంది బడి బయటి పిల్లలను గుర్తించిన వారిలో బడి ఈడు పిల్లవాడి వారీగా వారికి ప్రత్యామ్నాయ బ్రిడ్జి కోర్సులలో చేర్పించుట, టీచర్లకు విద్యార్థులను అనుసంధానం చేయడం, పాఠశాలకు రాలేని విభిన్న ప్రతిభావంతులకు ఐ ఈ ఆర్ టి ఎడ్యుకేషన్ అందించేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
విద్యా హక్కు చట్టం కింద రెండవ ఫేజ్ లో 252 మంది మాత్రమే నమోదు అయ్యారని మరింత ఎక్కువమంది ప్రైవేటు అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటవ తరగతిలో చేరేలా నమోదుకు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం విద్యపై వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి వివిధ పథకాల ద్వారా జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, విద్యా కానుక, అమ్మఒడి తదితర కార్యక్రమాల అమలుతో ప్రతి బడి ఈడు పిల్లవాడు బడిలో ఉండే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నందున, బడి బయట పిల్లలు లేకుండా ప్రతి పిల్లవాడు పాఠశాలలో ఉండేలా చర్యలు చేపట్టాలని విద్యాశాఖ అధికారులు ప్రణాళికబద్ధంగా నిబద్ధతతో పనిచేసి పాఠశాలల పునః ప్రారంభం నాటికి పండుగ వాతావరణంలో బడి ఈడు పిల్లలందరూ బడిలో చేరేలా చర్యలు చేపట్టాలని విద్యాశాఖ అధికారులకు హితవు పలికారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి వి శేఖర్, ప్లానింగ్ కోఆర్డినేటర్ ఎస్ ఎస్ ఏ రామచంద్రారెడ్డి తదితర విద్యాశాఖ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News