-సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు కొత్త పద్ధతిలో జీవో నెం.1 తీసుకువచ్చి ప్రజాస్వామ్యాన్ని పాతరేస్తామంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యక్ష ఆందోళనలకు దిగుతామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో హెచ్చరించారు.
విజయవాడ దాసరి భవన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర హైకోర్టు కొట్టేసిన జీవో నెం.1ను కొత్త పద్ధతిలో జీవో తీసుకువస్తామని ప్రభుత్వ ప్రధాన సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించడంపై మండిపడ్డారు. జీవో నం.1ని రద్దు చేయాలని కోరుతూ సీపీఐతో పాటు టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గిడుగు రుద్రరాజు హైకోర్టులో పిటీషన్ వేయటం జరిగిందన్నారు అనాటి బీజేపీ నాయకులు కన్నా లక్ష్మీనారాయణ కూడా ఈ కేసులో ఇంప్లీడ్ అయ్యారని తెలిపారు. హైకోర్టు వెకేషన్ బెంచ్ స్టే ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. సిపిఐతో పాటు ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్లు సుదీర్ఘంగా చర్చించిన అనంతరం కోర్టుకు వెళ్లటం జరిగిందన్నారు. రాష్ట్ర హైకోర్టు జీవో 1ను రద్దు చేస్తూ స్పష్టమైన తీర్పు ఇచ్చిందని వివరించారు. జీవోనెం.1 తీసుకురావటమే దుర్మార్గమయితే హైకోర్టు తీర్పు తదుపరి కూడా ఆ జీవోలో మార్పులు, చేర్పులు చేసి మరోసారి కొత్తగా తీసుకువస్తామని సజ్జల వ్యాఖ్యానించటంపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోందనీ, పోలీసులకు పూర్తిగా అధికారం కట్టబెట్టేట్టయితే ముఖ్యమంత్రిగా జగన్మోహన్రెడ్డి కుర్చీ ఖాళీ చేసి, డిజిపికి అప్పగిస్తే సరిపోతుందని ఎద్దేవా చేశారు. శాంతియుత ధర్నాలకు, ప్రదర్శనలకు, నిరసనలకు అనుమతి ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందన్నారు. ఇలా అయితే ప్రజల తరుపున మాట్లాడే అవకాశం ఎక్కడ ఉంటుందని నిలదీశారు. జగన్మోహన్రెడ్డి రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళా తీయించారన్నారు. జగన్ పాలనలో ఉద్యోగులకు జీతాలు, పింఛన్లు ఇవ్వటం లేదని, కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించటం లేదన్నారు. ఇసుక, మద్యం ద్వారా కోట్లాది రూపాయలు దోచుకుంటున్నారని ఆరోపించారు. కోర్టు కొట్టేసిన జీవోలను మరలా తీసుకురావటానికి ప్రయత్నించటం కోర్టు ధిక్కారమేనని, ముఖ్యమంత్రికి కనీస విజ్ఞత ఉండాలన్నారు.
రాజధాని అమరావతిలో పేదలకు ఇళ్లు ఇస్తామంటే కొంత మంది అడ్డుపడుతున్నారని ముఖ్యమంత్రి చెప్పడాన్ని రామకృష్ణ తప్పుబట్టారు. రాజధానిగా అమరావతి ఉందా? లేదా? అనే విషయాన్ని సీఎం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. సెప్టెంబరులో విశాఖపట్నం వెళతానని జగన్ చెపుతున్నారని ఆయన విశాఖ వెళ్లితే రాజధానిలో ఎవరు ఉంటారని ప్రశ్నించారు. రాజధానిగా ఉంటేనే ప్రజలు ఉంటారని సీఎం వెళ్లిపోయి ప్రజల్ని ఉండమంటే వారు ఎలా ఉంటారని ప్రశ్నించారు. పేదవాళ్లు ఆత్మగౌరవంతో జీవించాలంటే ఒక్క సెంటు భూమి సరిపోదన్నారు. జగన్‌కు కడప, హైదరాబాద్, బెంగళూరు, తాడేపల్లిలో పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్నాయని తెలిపారు. సెంటు స్థలం ఇస్తున్నట్లు గొప్పగా చెబుతున్నారేగానీ, ముఖ్యమంత్రి బంగ్లాలో ఉన్న బాత్రూం అంత కూడా స్థలం కూడా పేదలకు ఇవ్వడం లేదన్నారు. ఇందిరాగాంధీ హయాంలో పేదలకు 5 సెంట్ల స్థలం కేటాయించిందని గుర్తు చేశారు. పేదలకు ఇచ్చే సెంటు స్థలం కూడా హైకోర్టు తీర్పుకు లోబడి ఉంటుందని రాసి ఇస్తామని చెప్పటం విచిత్రంగా ఉందన్నారు. దేశంలో ఇలాంటి చర్యలు ఎప్పుడూ చూడలేదన్నారు. పేదవాళ్లను భిక్షగాళ్లుగా చూడవద్దనీ, వాళ్లు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలేనని గుర్తించాలన్నారు. సీఎంకు చిత్తశుద్ధి ఉంటే అమరావతి రాజధానిపై స్పష్టత ఇవ్వాలన్నారు. పేదలకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇళ్లస్థలం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఇల్లు నిర్మించుకోవటానికి ఇసుక, సిమెంట్ ఉచితంగా ఇవ్వటంతో పాటు రూ.5లక్షలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం రూ.1249 కోట్లు ఇస్తామని పేర్కొనటంపై ముఖ్యమంత్రి స్పందించాలని డిమాండ్ చేశారు. సీఎం ఢల్లీి పర్యటనలో కేంద్ర ఆర్థికమంత్రి, జలశక్తి మంత్రి, ప్రధానమంత్రులను కలిసి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయటానికి నిధులు రాబట్టాలని కోరారు. సీఎం తన సొంత పనులపై ఢల్లీి వెళుతున్నారే తప్ప ప్రజల కోసం కాదన్నారు. ఈ నేపధ్యంలో 22, 23 తేదీలలో విజయవాడలో జరుగనున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ, కార్యవర్గ సమావేశాలలో ఈ అంశాలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని వివరించారు.
అనంతరం విలేఖరులు అడిగిన ప్రశ్నలకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ సమాధానం ఇస్తూ సీపీఐ సెక్యులర్ పార్టీలతో కలిసి పని చేయటానికి సిద్ధమేనని చెప్పారు. కమ్యూనిస్టు పార్టీలు, జనసేన, తెలుగుదేశం పార్టీలు కలిసి ముందుకెళితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. దక్షిణాదిలో బీజేపీకి అవకాశాలు లేవన్నారు. గతంలో బీజేపీ పాచిపోయిన లడ్డూలు ఇచ్చిందని విమర్శించిన పవన్‌కళ్యాణ్ ఇప్పుడు బీజేపీతో కలిసి వెళ్లటానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారో ఆయనే సమాధానం చెప్పాలన్నారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు ఢల్లీిలో ధర్నా చేశారని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడుగడుగునా ద్రోహం చేసిందని, ఎపీలో ఓట్లడిగేందుకు బిజెపికి సిగ్గుండాలని అన్నారు.
Prajavartha Online Telugu News