-కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యాచరణలో భాగంగా విజయవాడ నగర పాలక సంస్థ ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తున్న డోర్ టు డోర్ చెత్త సేకరణకు ప్రజలంతా సహకరించాలని, హోటళ్లు, వ్యాపార వాణిజ్య కార్యాలయాల నిర్వాహకులు బహిరంగంగ ప్రదేశాల్లో చెత్తను వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ హెచ్చరించారు. స్థానిక 18 వ డివిజన్ రాణిగారితోటలో అంటోనీ వీధి మరియు బాలాస్వామి వీధి పలు ప్రాంతాల్లోని శానిటేషన్ మస్టర్ పాయింట్ ను కమిషనర్ శనివారం ఉదయం 6.30 గంటలకు తనిఖీ చేశారు. డివిజన్ పరిధిలోని శానిటేషన్ సిబ్బంది హాజరును కమిషనర్ పరిశీలించారు. ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరు అయిన సిబ్బందికి నోటీసులు జారీ చేయాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు.
నగరంలో ఎక్కడైనా రోడ్లపై చెత్త వేస్తే వారికి జరిమానాలు విధించాలని అధికారులను ఆదేశించారు. అలాగే చెత్త వేస్తున్న ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు, సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రజల వద్ద నుండి తడి, పొడి చెత్త వేర్వేరుగా స్వీకరించాలని, ఆ విధంగా అవగాహన కల్పించాలన్నారు. పారిశుద్ధ్యం లోపిస్తే సంబంధిత అధికారులపై కటిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు.
వీధిలో హోటళ్లు, షాపుల నిర్వాహకులు పరిసరాల పరిశుభ్రతపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, అలాంటి వారిని గుర్తించి నోటీసులు జారీ చెయ్యాలని కమిషనర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. సమీపంలోని పాని పూరి బండి నిర్వాహకులు ఎంగిలి ఆకులు, ఇతర వ్యర్ధాలను వీధిలోని డ్రైనేజిలో వేయడాన్ని గుర్తించిన కమిషనర్, పద్ధతి మార్చుకోకపోతే వ్యర్ధాలను తిరిగి ఇళ్ళలోకి వేయిస్తామని, లైసెన్సు రద్దు చేస్తామని హెచ్చరించారు వారికి జరిమానా విధించాలని కమిషనర్ ఆదేశించారు.
నగరంలో దోమల నివారణకై ప్రతి రోజు హ్యాండ్ మరియు లితో ఫోగ్గింగ్ యంత్రముల ద్వారా ఫాగింగ్ నిర్వహిస్తూ, నీరు నిల్వ యున్న ప్రదేశములలో ఆయిల్ బాల్స్ వేయుట, పి.డి.పి. వర్క్, లార్వా గుర్తించిన ప్రదేశాలలో మరియు కల్వర్టల క్రింద పై రత్రం పవర్ స్ప్రేతో స్ప్రే చేయించుట మొదలగు యాoటిలార్వల్ ఆపరేషన్స్ పనులు నిర్వహించాలని అన్నారు. దోమ లార్వా వృద్ది, నివారణకు తీసుకొనవలసిన జాగ్రత్త చర్యలపై సచివాలయ సిబ్బంది ద్వారా ప్రతి ఇంటికి అవగాహన కల్పించే దిశగా ఆదేశాలు ఇవ్వటం జరిగిందని అన్నారు.
నగర వ్యాప్తంగా అన్ని డివిజనుల్లో పారిశుద్ధ్య నిర్వహణ పనులను ఆకస్మికంగా తనిఖీ చేస్తానని, విధినిర్వహణలో ప్రతిఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కమిషనర్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ ఆరోగ్య శాఖాధికారులు, హెల్త్ ఆఫీసర్లు, శానిటరీ సూపర్వైజర్లు, శానిటరీ ఇన్స్ పెక్టర్లు, శానిటరీ సెక్రెటరీలు, సచివాలయం సిబ్బంది మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News