-ఈనెల 26న ముఖ్యమంత్రి చేతుల మీదగా లబ్దిదారులకు పట్టాల పంపిణీ..
-పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం ద్వారా ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుదాం..
-జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర రాజధాని అమరావతిలో సొంత గృహాన్ని మంజూరు చేయడం ద్వారా ముఖ్యమంత్రి పేదలకు గౌరవాన్ని కల్పించడం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని ఈనెల 26వ తేదిన పేదలకు ముఖ్యమంత్రి పట్టాల పంపిణీ చేయనున్న కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేద్దామని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అన్నారు. రాజధాని ప్రాంతమైన అమరావతిలో ఆర్5జోన్ నందు పేదలకు మంజూరైనా స్థలాలకు ఈనెల 26వ పట్టాల పంపిణీ కార్యక్రమం పై జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు శనివారం ప్రజాప్రతినిధులు మున్సిపల్ అధికారులతో నగరంలోని ఆయన కార్యాలయం నందు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర రాజధాని ప్రాంతం నడిబోడ్డున పేద ప్రజలకు ఇళ్ళ స్థలాలను మంజూరు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సాసహోపేతమైన నిర్ణయం తీసుకుని పేదలకు గౌవరాన్ని కల్పించారన్నారు. ఈనెల 26వ తేదిన లబ్దిదారులకు ముఖ్యమంత్రి చేతుల మీదగా పట్టాలను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. రాజధాని ప్రాంతమైన వెంకట పాలెం గ్రామంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయం సమీపంలో జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి లబ్దిదారులకు పట్టాల పంపిణీ చేస్తారని తెలిపారు. లబ్దిదారుల ఎంపిక దాదాపు పూర్తయిందన్నారు. విజయవాడ నగర పరిధిలో 24,600 మంది లబ్దిదారులకు గతంలో ఇళ్ళ స్థలాలు మంజూరు చేస్తామని హామి పత్రాలు ఇవ్వడం జరిగిందన్నారు. వీరిలో 19,240 మంది లబ్దిదారులను ఎంపిక చేయడం జరిగిందన్నారు. మరో 5,380 మంది లబ్దిదారుల వివరాలను సేకరించవలసి ఉందన్నారు. వీరిలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 2,100 మంది, సెంటల్ నియోజకవర్గంలో 1500 మంది తూర్పు నియోజకవర్గంలో 1600 మంది లబ్దిదారుల వివరాలను పరిశీలించవలసి ఉందన్నారు. అధికారులు లబ్దిదారులకు సంబంధించిన పూర్తి స్థాయి వివరాలను సేకరింస్తున్నారని ఈనెల 21వ తేదికి ఎంపికను పూర్తి చేసి అర్హులైన వారికి ఇళ్ళ స్థలాలను కేటాయించేలా చర్యలు తీసుకున్నామన్నారు. పట్టణ పరిధిలోని లబ్దిదారులకు సంబంధించి 168 ఏకరాల భూమిని కేటాయించాల్సిందిగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నట్లు ఆయన తెలిపారు. 26వ తేది పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఎన్‌టిఆర్ గుంటూరు జిల్లాల నుండి సుమారు 60 వేల మంది సభకు హాజరు కానున్నారన్నారు. విజయవాడ నగరానికి సంబంధించి లబ్దిదారులు వారి కుటుంబ సభ్యులతో కలిసి 30 వేల మంది సభకు హాజరయ్యేలా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందుకు 500 బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డిల్లీరావు తెలిపారు. అవసరమైతే అదనపు బస్సులను ఏర్పాటు చేయడంతో పాటు సభకు హాజరయ్యేవారికి ఉదయం అల్పహారం, త్రాగునీరు, మజ్జిగ పాకెట్లను సరఫరా చేయాలని అధికారులను ఆదేశించామని సభ పూర్తి అయిన అనంతరం ప్రజలు తిరిగి వారి గృహాలకు చేరుకునే వరకు ప్రతి భాధ్యతలు తీసుకోవాలని అధికారులకు స్పష్ట మైన ఆదేశాలు జారీ చేస్తున్నామన్నారు, పట్టాల పంపిణీ విజయవంతం చేయడం ద్వారా పేదలకు రాజధానిలో ఇళ్ళస్థలాలు మంజూరు చేసిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేద్దామని జిల్లా కలెక్టర్ డిల్లీరావు వివరించారు.
సమావేశంలో మున్సిపల్ కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుడ్కర్, సబ్ కలెక్టర్ అదితి సింగ్, విజయవాడ పశ్చిమ, మధ్య నియోజకవర్గాల శాసనసభ్యులు వెలంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణువర్థన్ శాసనమండలి సభ్యులు యండి. రుహుల్లా, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటి మేయర్ బెల్లం దుర్గ, స్థానిక నాయకులు కడియాల బుచ్చిబాబు, డిఆర్‌వో కె. మోహన్‌కుమార్, నగరపాలకసంస్థ డిప్యూటి కమీషనర్ సత్యవతి, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News