మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో 60 గ్రామాల్లో చేపట్టిన రెండో దశ రీ సర్వే కార్యక్రమం వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు అధికారులను ఆదేశించారు. గురువారం మధ్యాహ్నం మంగళగిరి నుండి భూపరిపాలన ముఖ్య కమిషనర్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి రీ సర్వే కార్యక్రమం, జగనన్నకు చెబుదాం తదితర అంశాలపై సమీక్షించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ కలెక్టరేట్ లోని వారి చాంబర్ నుండి సంయుక్త కలెక్టర్ అపరాజిత సింగ్, సర్వే భూ రికార్డుల ఏడి గోపాల్ రాజా తో కలిసి పాల్గొన్నారు.
అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రెండవ దశ రీ సర్వే కార్యక్రమం 13 మండలాల్లోని 60 గ్రామాలలో చేపట్టగా అందులో ఇప్పటివరకు 52 గ్రామాల్లోని 95,972 ఎకరాల్లో గ్రౌండ్ ట్రూతింగ్ పనులు పూర్తి అయ్యాయన్నారు. ఇంకా8 గ్రామాల్లో 8,494 ఎకరాల్లో జరగాల్సి ఉందన్నారు. అలాగే 34 గ్రామాల్లోని 59,511 ఎకరాల్లో గ్రౌండ్ వ్యాలిడేషన్ పూర్తయిందని, మిగిలిన గ్రామాల్లో పురోగతిలో ఉందన్నారు.డిఎల్ఆర్ పనులు 14 గ్రామాల్లో పూర్తికాగా 20 గ్రామాల్లో పురోగతిలో ఉందన్నారు. గ్రామ సర్వేయర్ ఒక ఓఆర్ఐ తీసుకుని విఆర్ఓ తో కలిసి గ్రౌండ్ ట్రూతింగ్, గ్రౌండ్ వాలిడేషన్ కలిపి ఒకేసారి రీ సర్వే పూర్తి చేయాలన్నారు. తదుపరి భూ హక్కుదారులకు 9(2)నోటీసులను జారీ చేసి వారి ఆమోదం తీసుకొని నిర్ణీత కాలంలో డేటా ఎంట్రీలు గ్రామ సర్వే లాగిన్ లో నమోదు చేయాలన్నారు. అనంతరం విఆర్ఓ, తహసిల్దార్,ఆర్డీవో లాగిన్ లో నుంచి ఆ వివరాలు సంయుక్త కలెక్టర్ లాగిన్ కు పంపాలన్నారు. తాజా డి ఎల్ ఆర్ నిబంధనల ప్రకారం అన్ని రకాల సవరణలు,మార్పులు గ్రామ సర్వేయర్ లాగిన్ లోనే చేయాలన్నారు. లేదంటే ఆ తదుపరి సంయుక్త కలెక్టర్ లాగిన్ లో చేయవలసి ఉంటుందన్నారు.
డిఎల్ఆర్ తయారయ్యాక తహాసిల్దార్ కు అక్కడి నుంచి ఆర్డిఓ ద్వారా సంయుక్త కలెక్టర్ కు పంపాలన్నారు.
రీ సర్వే పనుల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా పక్కాగా చేయాలని ఇందులో పూర్తి బాధ్యత గ్రామ సర్వేయర్లు, వీఆర్వోలదేనని స్పష్టం చేశారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. వచ్చిన అర్జీలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి సానుకూలంగా పరిష్కరించాలన్నారు. ముఖ్యంగా మరల వస్తున్న అర్జీల పట్ల, అసంతృప్తితో ఉన్న అర్జీదారుల పట్ల ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అర్జీదారుల్లో అసంతృప్తి తగ్గించేందుకు కృషి చేయాలన్నారు. ముఖ్యంగా రెవెన్యూ శాఖకు సంబంధించి ఆర్ ఓ ఆర్, భూముల కబ్జా, భూముల ఆక్రమణ వంటి అంశాల పట్ల తక్షణమే స్పందించి బాధితులను ఆదుకోవాల్సి ఉంటుందన్నారు. అసైన్మెంట్ కమిటీల ద్వారా పేదలకు పట్టా భూములు పంపిణీ కోసం వెంటనే చర్యలు చేపట్టాలన్నారు.
Prajavartha Online Telugu News